ముగిసిన స్పందన

ABN , First Publish Date - 2021-10-23T07:19:52+05:30 IST

జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన రెవెన్యూ స్పందన శుక్రవారం సాయంత్రంతో ముగిసింది.

ముగిసిన స్పందన
రైటఫ్‌: చినగంజాం మండలం రాజుగారిపాలెం గ్రామ సచివాలయంలో నిర్వహించిన స్పందనలో పాల్గొన్న ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి

పలురకాల భూసమస్యలపై 11,353 అర్జీలు

పాసుపుస్తకాల కోసమే అధికం 

ఎక్కువగా కొత్తపట్నం మండలంలో 524

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 22 : జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన రెవెన్యూ స్పందన శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. భూ సమస్యలపై ప్రతి సోమవారం జరిగే స్పందనలో భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అందులోభాగంగా జిల్లాలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ స్పందన నిర్వహించారు. జిల్లాలో మొదటి రోజైన గురువారం 5,331 అర్జీలు రాగా.. రెండో రోజైన శుక్రవారం స్పందనలో భారీగా 6,022  అర్జీలు అందాయి. ఏళ్ల తరబడి భూసమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం అర్జీలు ఇచ్చేందుకు భారీగా వచ్చారు. ప్రధానంగా పట్టాదారు పాసుపుస్తకాల సమస్య ఎక్కువగా ఉంది. అటువంటి రైతులు ఆయా సచివాలయాల్లో జరిగిన రెవెన్యూ స్పందనలో ఎక్కువగా అర్జీలు ఇచ్చారు. ఇంకో వైపు సాగులో ఒకరు ఉండగా ఆన్‌లైన్‌లో మరొకరి పేరు ఉండటం, కొన్ని ప్రాంతాల్లో సర్వే తలనొప్పులు, మరికొన్ని ప్రాంతాల్లో చుక్కల భూముల సమస్యలపై అర్జీలు ఇచ్చారు. జేసీ కేఎస్‌ విశ్వనాఽథన్‌, మార్కాపురం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి దోర్నాలలోని సచివాలయాలను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి చినగంజాం మండలం రాజుగారిపాలెం సచివాలయాన్ని సందర్శించారు. అలాగే డిప్యూటీ కలెక్టర్లు, వివిధ స్థాయిల్లోని అధికారులు స్పందనను పర్యవేక్షించారు. కాగా రెండు రోజులపాటు నిర్వహించిన రెవెన్యూ స్పందనలో వచ్చిన అర్జీలను స్పందన పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. వాటిని మూడు నుంచి నాలుగు నెలల్లో పరిష్కరించే దిశగా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోనుంది.




Updated Date - 2021-10-23T07:19:52+05:30 IST