అయోమయం... గందరగోళం

ABN , First Publish Date - 2021-01-21T05:08:35+05:30 IST

స్థానిక మరిడిమాంబ కల్యాణ మండపంలో బుధవారం చేపట్టిన టీడ్కో ఇళ్ల మంజూరు హామీ పత్రాల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది.

అయోమయం... గందరగోళం
లబ్ధిదారులతో కిక్కిరిసిన కల్యాణ మండపం

మల్కాపురంలో టిడ్కో ఇళ్ల మంజూరు హామీ పత్రాల పంపిణీ కార్యక్రమం  

 కనీస వసతులు లేకుండానే నిర్వహణ

 కుర్చీలు లేక గోడలపై కూర్చుని విధులు నిర్వహించిన వీఆర్వోలు

 మధ్యలోనే నిలిచిపోయిన పంపిణీ

 ఉసూరుమంటూ వెనుదిరిగిన లబ్ధిదారులు 

మల్కాపురం. జనవరి 20: స్థానిక మరిడిమాంబ కల్యాణ మండపంలో బుధవారం చేపట్టిన టీడ్కో ఇళ్ల మంజూరు హామీ పత్రాల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది. పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పత్రాలను అందించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్వోలు ఈ పరిధిలోని వారందరికీ మంగళవారమే ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. మల్కాపురం  మరిడిమాంబ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం నిర్వహించే కార్యక్రమంలో పత్రాలు తీసుకోవాలని తెలిపారు. దీంతో ఒకేసారి వం దలాది మంది వేదికవద్దకు చేరుకున్నారు. వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న వీఆర్వోలు కూడా చేరుకోవడంతో కల్యాణ మండపం కిక్కిరిసిపోయింది. 


కనీస సౌకర్యాలు లేకుండానే...

కల్యాణ మండపంలో కార్యక్రమం తలపెట్టిన అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదు. వీఆర్వోలు కూర్చునేందుకు కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతమంది నేలమీద, మరికొంతమంది ఎండలో గోడలపై కూర్చుని విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. గతంలో శ్రీహరిపురం జీవీఎంసీ మైదానంలో పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అందులో ఎంపీ విజయసాయిరెడ్డి కొంతమందికి పత్రాలు అందిం చి ముగించారు. అనంతరం వైసీపీ వార్డు అధ్యక్షులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పంపిణీ చేపట్టినా, కార్యక్రమం విజయవంతంగా సాగడంలేదని భావించిన ఉన్నతాధికారులు సచివాలయాల్లోని వీఆర్వోలకు ఈ బాధ్యత అప్పగించారు. అధికసంఖ్యలో లబ్ధిదారులు కల్యాణ మండపం వద్దకు చేరుకోవడంతో, ఎవరు ఎక్క డికి వెళ్లాలో... ఏ వీఆర్వో ఎవరికి ఫోన్‌చేశారో తెలియని అయెమయపరిస్థితి నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్‌ మళ్ల విజయప్రసాద్‌ హాజరవుతారని ఎదురుచూశారు. దీం తో కార్యక్రమం మరింత ఆలస్యమయింది.  లబ్ధిదారులంతా ఆందోళనకు దిగుతుండడంతో అక్కడే ఉన్న వార్డు వైసీపీ అధ్యక్షుల చేతులమీదుగా పంపిణీ చేపట్టారు. ఇలా ప్రతి వార్డుకు సుమారు 50 మంది చొప్పు న పట్టాలను పంపిణీ చేసిన తరువాత కార్యక్రమం నిలిపివేశారు.  దీంతో అనేక మంది లబ్ధిదారులు నిర్వాహకుల తీరును తప్పుబడుతూ నిరాశగా వెనుదిరిగారు. 



Updated Date - 2021-01-21T05:08:35+05:30 IST