రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలి: బీజేపీ

ABN , First Publish Date - 2020-07-14T01:41:52+05:30 IST

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పాలకులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని..

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలి: బీజేపీ

జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పాలకులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి చెలరేగిన నేపథ్యంలోనే ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బహిరంగంగా అసమ్మతి బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. దీంతో పైలట్ వర్గానికి బీజేపీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై పూనియా స్పందిస్తూ.. ‘‘మాకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. పరిస్థితిని బట్టి కేంద్ర నాయకత్వం సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం పట్ల ఎప్పూడూ నిర్లక్ష్యమే. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సచిన్ పైలట్ ఐదేళ్ల పాటు శ్రమించి పనిచేసినా ఆయన పట్ల ఆ పార్టీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది..’’ అని పూనియా అన్నారు. 


కాగా తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనీ.. గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిందనీ డిప్యూటీ సీఎం పైలట్ చెబుతున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలకు గానూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు 124 స్థానాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి మిత్రపక్షాలతో కలిపి 76 స్థానాలు ఉన్నాయి. తాజాగా సచిన్ పైలట్ వర్గం ప్రభుత్వానికి దూరం జరగడంతో కాంగ్రెస్‌లో కలకలం రేగింది. బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నిందంటూ సీఎం గెహ్లాట్ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ పరిస్థితికి కారణమని కమలదళం చెబుతోంది. 

Updated Date - 2020-07-14T01:41:52+05:30 IST