కాంగ్రెస్ నేత దారుణ హత్య.. ఆస్పత్రి వద్ద అనుచరుల బీభత్సం..
ABN , First Publish Date - 2021-03-17T20:58:28+05:30 IST
మధ్య ప్రదేశ్‌లోని ఛతార్పూర్ జిల్లాలో స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు ..
ఛతార్పూర్: మధ్య ప్రదేశ్‌లోని ఛతార్పూర్ జిల్లాలో స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. మృతుడు 45 ఏళ్ల ఇంద్ర ప్రతాప్ సింగ్ పర్మార్ ప్రస్తుతం గువారా బ్లాక్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హత్యపై ఛత్తార్పూర్ ఎస్పీ లోకేంద్ర సింగ్ మాట్లాడుతూ... ‘‘ఇంద్ర పరతాప్ సింగ్ బాదమల్హారాలోని ఓ హోటర్ వద్ద ఉండగా.. దాదాపు ఆరుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై అక్కడికి వచ్చారు. అందరూ చూస్తుండగానే ఆయనపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు గుర్తించారు...’’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో మొత్తం 6 వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాట చేశామనీ... త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించామనీ.. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రతాప్ సింగ్ హత్యపై తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అచరులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిని ధ్వంసం చేసి అల్లర్లు సృష్టించారు. సీసీటీవీ ఫూటేజి ఆధారంగా అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.