చూపంతా సచిన్‌పైనే.. కాంగ్రెస్‌లో ఎందుకంత అలజడి?

ABN , First Publish Date - 2021-06-10T01:54:18+05:30 IST

తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువనేత జితన్ ప్రసాద, హస్తం పార్టీని వీడడం మరోసారి ఆపరేషన్ కమల్ చర్చలోకి వచ్చింది. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనం రేకెత్తించింది

చూపంతా సచిన్‌పైనే.. కాంగ్రెస్‌లో ఎందుకంత అలజడి?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ యువ నేతలు ఒక్కొక్కరుగా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునాదులను పెకిలిస్తూనే ఉంది. ఏడాది క్రితం మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సిందియా తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం దేశ వ్యాప్తంగా రాజకీయ సంచలనాన్ని సృష్టించింది. సిందియా ఫిరాయింపుతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. అనంతరం కర్ణాటక రాజకీయాల్లో కూడా కాస్త అటుఇటుగా ఇలాంటి కదలికే రావడం కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఇక బీజేపీ తర్వాతి లక్ష్యం రాజస్తానే అని రాజకీయ విశ్లేషణలు బాగానే వినిపించాయి. రాజస్తాన్ యువనేత సచిన్ పైలట్‌ను బీజేపీలోకి లాగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతారని అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి. ఊహించినట్లుగానే కాంగ్రెస్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్ పైలట్.. బీజేపీవైపు చూడకుండా తిరిగి కాంగ్రెస్ గూటికే రావడం అంచనాలను తారుమారు చేసింది. ఆ పరిణామం తర్వాతే కాంగ్రెస్‌లో అలజడి తగ్గింది.


తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువనేత జితన్ ప్రసాద, హస్తం పార్టీని వీడడం మరోసారి ఆపరేషన్ కమల్ చర్చలోకి వచ్చింది. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనం రేకెత్తించింది. అయితే ఈ సమయంలో జితిన్ ప్రసాద కంటే ఎక్కువగా సచిన్ పైలట్ గురించి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో సిందియా, సచిన్ ప్రముఖులు. కాగా, సిందియా కమల తీర్థం పుచ్చుకున్న నాటి నుంచి సచిన్ పైలట్ గురించే తీవ్రమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటముల్లో ఉన్న సమయంలో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో సిందియా, పైలట్‌ల కృషి ఎక్కువగా ఉంది. అప్పటి మూడు రాష్ట్రాల గెలుపుతోనే కాంగ్రెస్‌లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 2014 ఎన్నికల స్థాయికి పడిపోయింది. అనంతరం నాటి పరిస్థితులు కాంగ్రెస్‌ను మరింత కలవరపెడుతూనే ఉన్నాయి. నెల క్రితం నాటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడం పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇలాంటి సందర్భంలో సచిన్ పైలట్ పార్టీని వీడితే భవిష్యత్ లేని కురువృద్ధ పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుందనే భయాలు పార్టీ వర్గీయుల్ని తీవ్రంగా కలవర పెడుతున్నాయి.


రాజస్తాన్ పీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్‌ను తిరుగుబాటు అనంతరం రెండు పదవుల నుంచి కాంగ్రెస్ దూరం పెట్టింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌కు సచిన్‌కు మధ్య సత్సంబంధాలు లేవు. సచిన్‌ అనుచర వర్గానికి మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం లేదు. సచిన్ ప్రాధాన్యాలు గెహ్లోత్ పట్టించుకోరు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో పూర్వవైభవానికి వచ్చేలా లేదు. దీంతో సచిన్ కచ్చితంగా కమలం గూటికి వెళ్లక తప్పదనే వార్తలు ఇప్పటికీ ఆగడం లేదు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే ఆలోగానైనా సచిన్‌ను బీజేపీలోకి లాగుతారనే ఊహాగాణాలు ఉన్నాయి. అయితే రాజస్తాన్‌ బీజేపీలో నెంబర్ వన్‌గా వసుంధర రాజే ఉన్నారు. ఆమెను కాదని సచిన్‌కు ప్రాధాన్యం ఇవ్వలేరు. ఇది దృష్టిలో ఉంచుకొని సచిన్ వెనకుడుగు వేశారని కొందరు అంటున్నారు. దీనికి తోడు బీజేపీలో చేరిన సిందియా వర్గానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్‌లో సముచిత ప్రాధాన్యమే లభించినప్పటికీ సిందియాకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. ఒకవేళ బీజేపీలో చేరితే తన పరిస్థితి కూడా అలా అవ్వకుండా ఉండదనే భయాలు సచిన్‌ను ఆపుతున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాత్వత మిత్రువులు ఉండరు అంటారు. సచిన్ పైలట్ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో కాలమే వెల్లడిస్తుంది.

Updated Date - 2021-06-10T01:54:18+05:30 IST