Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 23 2021 @ 19:01PM

UPA ప్రభుత్వానికి దేశ భద్రతపై శ్రద్ధ లేదు : BJP

న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఆ పార్టీపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. గతంలోని యూపీఏ ప్రభుత్వం స్పందించే తత్వం లేనిదని, నిరుపయోగమైనదని, కనీసం దేశ భద్రత గురించి కూడా ఆ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఈ పుస్తకాన్నిబట్టి స్పష్టమవుతోందని ఆరోపించింది. 


బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి స్పందించే తత్వం లేదని, పనికిరానిదని, కనీసం జాతీయ భద్రత గురించి అయినా శ్రద్ధ లేదని దుయ్యబట్టారు. 


‘‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ... మీరు మౌనాన్ని వీడుతారా? సోనియా గాంధీ గారూ, ఆ సమయంలో భారత సైన్యానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదనేదే మా ప్రశ్న. పాకిస్థాన్‌కు బుద్ధి చెబుతామని, అందుకు అనుమతి ఇవ్వాలని ధైర్యసాహసాలుగల మన సైన్యం అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కోరింది. అయినప్పటికీ మన సైన్యానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు?’’ అని గౌరవ్ భాటియా నిలదీశారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక పాకిస్థాన్‌తో మీకు (సోనియా, రాహుల్, కాంగ్రెస్‌లకు) ఉన్న ప్రత్యేక బంధం గురించి తెలియజేయాలని అడిగారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ దాడుల సందర్భంగా అమరులైన ఎన్ఎస్‌జీ కమాండోలను సైతం మీరు (కాంగ్రెస్) అవమానించారన్నారు. 


కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన మరో నేత

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఇచ్చిన ట్వీట్‌లో, సల్మాన్ ఖుర్షీద్ తర్వాత మరో కాంగ్రెస్ నేత తన పుస్తకాన్ని అమ్ముకోవడానికి యూపీఏను ఇబ్బందుల్లోకి నెట్టారని అన్నారు. 26/11 ముంబై దాడుల అనంతరం సంయమనం పేరుతో బలహీనతను ప్రదర్శించిన యూపీఏను మనీష్ తివారీ తన పుస్తకంలో దుయ్యబట్టారని పేర్కొన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలీ మేజర్ కూడా బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పారని, దాడి చేయడానికి భారత వాయు సేన సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ, యూపీఏ ప్రభుత్వం అడ్డుకుందని ఫాలీ మేజర్ చెప్పారని తెలిపారు. 


పాకిస్థానీ వైఖరి

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఇచ్చిన ట్వీట్‌లో, మనీష్ తివారీ యూపీఏ ప్రభుత్వాన్ని సరైన విధంగానే దుయ్యబట్టారన్నారు. 2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల అనంతరం సంయమనం పేరుతో బలహీనతను యూపీఏ ప్రభుత్వం ప్రదర్శించిందని తెలిపారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నిరంతరం పాకిస్థానీ వైఖరినే అనుసరిస్తున్నాయన్నారు. హిందుత్వం, అధికరణ 370, సర్జికల్ స్ట్రైక్స్ వంటి విషయాల్లో పాకిస్థాన్ వైఖరికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాయన్నారు. ముంబై దాడుల తర్వాత దీటుగా బదులివ్వకుండా ఎవరు నిరోధించారు? ఏమిటి నిరోధించిందో చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. ఉరి, పుల్వామాలలో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత భారత దేశం ఏ విధంగా స్పందించిందో గుర్తు చేశారు. 


మనీష్ రాసినదేమిటి?

మనీష్ తివారీ రాసిన పుస్తకంలోని కొన్ని భాగాలను ఆయన స్వయంగా తన ట్విటర్ ఖాతాలో ఉంచారు. ముంబై దాడుల తర్వాత భారత దేశం దీటుగా స్పందించి ఉండవలసిందని పేర్కొన్నారు. వందలాది మంది అమాయకులను కిరాతకంగా చంపడానికి వెనుకాడని దేశానికి గుణపాఠం చెప్పేవిధంగా చర్యలు తీసుకుని ఉండవలసిందన్నారు. 


Advertisement
Advertisement