కమలం గూటికి సచిన్ పైలట్..?

ABN , First Publish Date - 2021-08-09T20:28:16+05:30 IST

కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే..

కమలం గూటికి సచిన్ పైలట్..?

జైపూర్: కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. భవిష్యత్తులో ఆయన తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజస్థాన్ బీజేపీ చీఫ్ ఏపీ అబ్దుల్‌కుట్టి తాజాగా సంకేతాలిచ్చారు. సచిన్ పైలట్ మంచి నేత అని, భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరుతారని తాను అనుకుంటున్నానని చెప్పారు.


గత ఏడాది పైలట్, ఆయనకు విధేయులైన 18 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేయడంతో పైలట్ బీజేపీలోకి వస్తారనే బలమైన ఊహాగానాలు చెలరేగాయి. అయితే, ఆ ఊహాగానాలను పైలట్ తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈ ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. ఈ నెలలోనే గెహ్లాట్ మంత్రివర్గ విస్తరణతో రాటు, రాజకీయ నియామకాలు చేపట్టనున్నారు. తాను లేవనెత్తిన అంశాలపై పార్టీ సరైన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నట్టు సచిన్ పైలట్ గత నెలలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గెహ్లాట్ మంత్రివర్గంలో ఆయనతో కలిపి 21 మంది మంత్రులు ఉండగా, మరో తొమ్మిది మందికి చోటు కల్పించే అవకాశం ఉంది.

Updated Date - 2021-08-09T20:28:16+05:30 IST