చర్చ–రచ్చ

ABN , First Publish Date - 2021-08-20T06:23:48+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ముఖ్యులైన విపక్షనేతలతో భేటీ కాబోతున్నారు..

చర్చ–రచ్చ

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ముఖ్యులైన విపక్షనేతలతో భేటీ కాబోతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొంటారని కాంగ్రెస్‌ చెబుతోంది. విపక్షనేతలందరినీ ఒక్కటిచేసి, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, భారతీయజనతాపార్టీపై మరింత బలంగా యుద్ధంచేయాలన్నది కాంగ్రెస్‌ సంకల్పం. 


పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దాదాపు అన్ని విపక్షపార్టీలూ సంఘటితమై అధికారపక్షంమీద విరుచుకుపడిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వ్యవసాయచట్టాలవంటి అంశాలకంటే, పెగాసస్‌మీద ఒక్కటిగా ఒంటికాలిమీద లేచి ప్రభుత్వాన్ని కుదిపేశాయి. రాజ్యసభ రభస ఏమాత్రం ఊహకు అందనిది. ఇన్సూరెన్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు సందర్భంగా విపక్షనేతల ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉన్నదనీ, వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారపక్షనేతలు డిమాండ్‌ చేశారు. బయటినుంచి కొందరు యోధులను ప్రత్యేకంగా రప్పించి తమమీద దాడులు చేయించారనీ, మహిళా ఎంపీలతో కూడా వారు అసభ్యంగా ప్రవర్తించారని విపక్షాలు ప్రతివిమర్శ చేశాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సమీపగతంలో ఎన్నడూ లేనంత గందరగోళంగా జరిగి రికార్డులను తిరగరాశాయని మంత్రులు, నాయకులు విమర్శిస్తే, సమావేశాలను అర్థంతరంగా ముగించేయడంపైన ర్యాలీలతో విపక్షాలు నిరసన కూడా తెలియచేశాయి. సమావేశాలు ఇలా జరిగినందుకు ఉభయసభల అధిపతులూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. రాజ్యసభ చైర్మన్‌ అయితే చెమ్మగిల్లిన కళ్ళతో గర్భగుడిని అపవిత్రం చేయకండని అభ్యర్థించారు. బెంగుళూరులో బుధవారం ఓ స్మారకోపన్యాసం సందర్భంలో కూడా ఆయన ఈ పరిణామాలు ప్రజల్లో ప్రజాస్వామ్యంపట్ల నమ్మకాన్ని పోగొట్టేట్టుగా ఉంటున్నాయని వాపోయారు.


పార్లమెంటులో చర్చకు తావులేకుండా పోతున్నదన్న బాధ ఎంతోకాలంగా అందరిలోనూ ఉన్నదే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చర్చల నాణ్యతమీదా, చట్టాలు రూపొందుతున్న తీరుమీదా చేసిన వ్యాఖ్యలకు ఈ నేపథ్యంలో మరింత ప్రాధాన్యం ఉంది. గతంలో పార్లమెంటులో వివేకవంతమైన, విస్తృతమైన చర్చలు జరిగినందున ఆయా చట్టాల ఉద్దేశాలు, లక్ష్యాలను సరిగా అర్థంచేసుకోవడానికి వీలుండేదని అన్నారాయన. ఇప్పుడు అందుకు భిన్నంగా, చట్టాల్లో అస్పష్టత ఉంటున్నదనీ, ఇది న్యాయవ్యవస్థకూ, ప్రజలకూ ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. చర్చలూ సంవాదాల అవసరాన్నీ, ప్రయోజనాలను నొక్కిచెబుతూ, నిర్దిష్ట చర్చలేకుండా చట్టాలు చేయడం సరికాదన్నది ఆయన అభిప్రాయం. ప్రతీచట్టం తన అంతిమప్రయోజనాన్ని నెరవేర్చాలంటే అది ఆమూలాగ్రం పటిష్టంగా ఉండాలి. ఒక చట్టం సమగ్రంగా రూపొందడానికి చర్చ ఉపకరిస్తుంది. చట్టాల్లో గందరగోళం, అస్పష్టతకు తావులేనప్పుడు న్యాయస్థానాలకు వ్యాఖ్యానించడానికీ, విశ్లేషించడానికీ వీలుంటుంది. మొన్నటి సమావేశాల్లో ఓబీసీ బిల్లు వినా దేనిపైనా సమగ్రమైన చర్చ జరగలేదు. ఏ ఒక్కరోజూ సరైన చర్చ జరగకుండానే దాదాపు పాతికబిల్లులు ఆమోదం పొందాయి. అధికారపక్షం విపక్షాలపై కత్తికట్టినట్టుగా వ్యవహరిస్తూ, కీలకమైన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే చర్చలేకుండా దాటించేస్తున్నదని విమర్శ. చట్టసభల్లో అంతరాయాలకు విపక్షాలను మాత్రమే బాధ్యులను చేయడం, వారినే తప్పుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. సభను సజావుగా నడిపే బాధ్యత అధికారపక్షంమీద మరింత ఉన్నది కనుక విపక్షాల డిమాండ్లకు సానుకూలంగా స్పందించడం అవసరం. కొత్త పార్లమెంటు భవనం నిర్మాణంకంటే, పార్లమెంటరీ సంప్రదాయాలకు విలువనివ్వడం ముఖ్యం. చర్చకు అవకాశం లేనిస్థితిలో సెలక్ట్‌కమిటీలకు నివేదించడం కూడా ఇటీవల తగ్గిపోయింది. పార్లమెంటరీ కమిటీలు కూడా ఉనికిని కోల్పోతున్నాయి. ఉభయపక్షాలూ చట్టసభలను సైతం ఎన్నికల ప్రచార వేదికలుగా, పోలింగ్‌ కేంద్రా‌ల్లాగా భావించడం సరికాదు. డెబ్బయ్‌ ఐదవ స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా జస్టిస్‌ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యను దృష్టిలో పెట్టుకొని అమృతోత్సవ భారతంలో నాయకులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని కోరుకుందాం.

Updated Date - 2021-08-20T06:23:48+05:30 IST