మాకు అధికారమిస్తే సీఏఏ అమలు కానీయం: రాహుల్
ABN , First Publish Date - 2021-02-14T22:31:25+05:30 IST
అసోం విభజనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు..
శివసాగర్: అసోం విభజనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అసోం ఒప్పందంలోని ప్రతి అంశాన్ని పరిరక్షించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. తమకు అధికారమిస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఎప్పటికీ రాష్ట్రంలో అమలు కానీయమని హామీ ఇచ్చారు. మార్చి-ఏప్రిల్‌లో జరుగనున్న అసోం ఎన్నికల ప్రచారానికి రాహుల్ ఆదివారంనాడు శ్రీకారం చుట్టారు.
శివసాగర్‌లో నిర్వహించిన తొలి బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, రాష్ట్రానికి 'సొంత ముఖ్యమంత్రి' అవసరమని, అతను ప్రజల వాణి వినగలిగే వాడై ఉండాలే కానీ, నాగపూర్, ఢిల్లీ చెప్పినట్టు నడుచుకునే వాడు కాకూడదని అన్నారు. ఒక టీవీని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయగలము కానీ ముఖ్యమంత్రిని కాదని, ప్రస్తుత ముఖ్యమంత్రి నాగపూర్, ఢిల్లీ మాటల ప్రకారమే నడుచుకుంటారని విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రే మళ్లీ వస్తే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని అన్నారు.
'అసోం ఒప్పందంతో శాంతి నెలకొంది. అది రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలుస్తోంది. ఒప్పదంలోని ప్రతి సూత్రాన్ని పరిరక్షించేందుకు నేను, నా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తాం. ఒక్క నిబంధనను కూడా అతిక్రమించం' అని రాహుల్ గట్టి హామీ ఇచ్చారు. అసోం ఒప్పంద కింద రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టే ప్రయత్నాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయని ఆరోపించారు. అసోం విడిపోతే ప్రధాని నరేంద్ర మోదీకి కానీ, హోం మంత్రి అమిత్‌షాకు కానీ వచ్చే నష్టం లేదని, కానీ అసోంకు, దేశంలోని తక్కిన ప్రాంతాలకు నష్టమని అన్నారు. సీఏఏపై మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చట్టాన్ని అమలు కానీయమని రాహుల్ స్పష్టం చేశారు.
మోదీ, షాపై విసుర్లు
ప్రధాని మోదీ, హోం మత్రి అమిత్‌షాలకు వ్యాపారవేత్తలు చాలా సన్నిహితమని, రాష్ట్రంలోని సహజవనరులు, పీఎస్‌యూలను దేశంలోని ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలకు అమ్మకానికి పెట్టేస్తారని రాహుల్ విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజా ధనాన్ని 'లూటీ' చేసి, తమ మిత్రులైన ఇద్దరు వ్యాపారవేత్తల రుణాలను మాత్రం పెద్దమొత్తంలో రద్దు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని హింసా శకానికి మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చరమగీతం పాడి, శాంతిని నెలకొల్పిందని రాహుల్ చెప్పారు.