మోదీని ఎండగడుతూనే శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-09-17T23:21:06+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఓ వైపు ఎండగడుతూ

మోదీని ఎండగడుతూనే శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఓ వైపు ఎండగడుతూ, మరోవైపు జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. ఆయన వైఫల్యాలకు దేశం మూల్యం చెల్లిస్తోందని దుయ్యబట్టింది. ఆయన జన్మదినంనాడు ‘నిరుద్యోగ దినం’, ‘రైతు వ్యతిరేక దినం’, ‘అధిక ధరల దినం’గా నిర్వహించింది. 


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘హ్యాపీ బర్త్‌డే మోదీజీ’’ అని పేర్కొన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్‌కు, ఎన్ఎస్‌యూఐకి ఇది ‘‘జాతీయ నిరుద్యోగ దినం’’ అని తెలిపారు. 


కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ మీడియాతో మాట్లాడుతూ, మాజీ ప్రధాన మంత్రుల జయంతులను రకరకాలుగా జరుపుకుంటున్నామని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ జయంతినాడు బాలల దినోత్సవంగానూ, ఇందిరా గాంధీ జయంతిని జాతీయ సమైక్యతా దినంగానూ, రాజీవ్ గాంధీ జయంతినాడు సద్భావన దినంగానూ, అటల్ బిహారీ వాజ్‌పాయి జయంతిని సుపరిపాలన దినంగానూ జరుపుకుంటామన్నారు. అయితే మోదీ జన్మదినాన్ని నిరుద్యోగ దినంగా జరుపుకుంటున్నామన్నారు. మోదీకి సద్బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఇది ప్రధాన మంత్రి జన్మదినం కాబట్టి అన్ఎంప్లాయ్‌మెంట్ డే, యాంటీ ఫార్మర్స్ డే, హై ప్రైసెస్ డే, క్రిపుల్డ్ ఎకానమీ డే, ఈడీ, ఐటీ, సీబీఐ రెయిడ్ డే, కరోనా మిస్‌మేనేజ్‌మెంట్ డేగా జరుపుకుంటున్నామన్నారు. 


గడచిన ఏడేళ్ళలో అనేక విధాలుగా మోదీ విఫలమయ్యారన్నారు. దేశాన్ని ఈ విధంగా నడుపుతున్నట్లు గుర్తించే వివేకాన్ని మోదీకి ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నామని చెప్పారు. మోదీ వైఫల్యాలకు దేశం భారీ మూల్యం చెల్లిస్తోందన్నారు. 


Updated Date - 2021-09-17T23:21:06+05:30 IST