విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-10-25T04:44:54+05:30 IST

భవనంపై పనిచేస్తున్న సమయంలో హెచ్‌టీ లైన్‌ తగిలి విద్యుదాఘాతానికి గురైన ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి
వైకుంఠరావు మృతదేహం

గోపాలపట్నం, అక్టోబరు 24: భవనంపై పనిచేస్తున్న సమయంలో హెచ్‌టీ లైన్‌ తగిలి విద్యుదాఘాతానికి గురైన ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శేషాద్రిపురం గ్రామానికి చెందిన గెండెం వైకుంఠరావు(40) అనే భవన నిర్మాణ కార్మికుడు తన భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలతో స్థానిక పాతగోపాలపట్నంలో నివాసముంటున్నాడు. అయితే కొత్తపాలెంలోని ఖారవేలనగర్‌లో ఓ భవన నిర్మాణం పనికోసం ఆదివారం ఉదయం అతను వచ్చాడు. సాయంత్రం 5 గంటల సమయంలో భవనంపై పని చేస్తుండగా హెచ్‌టీ విద్యుత్‌ తీగలు అతనికి తగిలి భవనంపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చి భోరున విలపించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా భవన నిర్మాణ కార్మిక సంఘం (సీటూ) నేత బి.వెంకటరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-10-25T04:44:54+05:30 IST