ఫోన్‌లో వివరాలు చెప్పి నష్టపోతే బ్యాంకుల బాధ్యత ఉండదు : వినియోగదారుల కమిషన్

ABN , First Publish Date - 2021-03-17T01:25:57+05:30 IST

బ్యాంకులు పంపించే సందేశాలను ఖాతాదారులు శ్రద్ధతో గమనించి

ఫోన్‌లో వివరాలు చెప్పి నష్టపోతే బ్యాంకుల బాధ్యత ఉండదు : వినియోగదారుల కమిషన్

న్యూఢిల్లీ : బ్యాంకులు పంపించే సందేశాలను ఖాతాదారులు శ్రద్ధతో గమనించి, పాటించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించి నష్టపోయిన ఖాతాదారులకు బ్యాంకులు నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉండదని తెలుసుకోవాలి. ఈ విషయం గుజరాత్‌లోని వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పుతో సుస్పష్టమైంది. 


గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పు చెప్పింది. మోసానికి బాధితుడైన బ్యాంకు ఖాతాదారుకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత ఆ బ్యాంకుకు లేదని తెలిపింది. తనకు జరిగిన నష్టానికి పరిహారాన్ని ఆ బ్యాంకు నుంచి పొందే అర్హత బాధిత ఖాతాదారుకు లేదని స్పష్టం చేసింది. ఖాతాదారు నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే మోసానికి గురైనట్లు తీర్పు చెప్పింది. 


పదవీ విరమణ పొందిన టీచర్ కుర్జి జావియా ప్రస్తుతం న్యాయవాద వృత్తిని చేపట్టారు. 2018 ఏప్రిల్‌లో ఆయనకు ఓ మోసపూరిత ఫోన్ కాల్ వచ్చింది. తాను భారతీయ స్టేట్ బ్యాంకు మేనేజర్‌నని ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆ కాలర్‌కు తన ఏటీఎం కార్డ్ వివరాలను కుర్జీ తెలియజేశారు. ఆ మర్నాడు కుర్జీ బ్యాంకు ఖాతా నుంచి రూ.41,500 విత్‌డ్రా అయింది. 


ఈ విషయాన్ని గమనించిన కుర్జీ  డబ్బు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చిన వెంటనే ఎస్‌బీఐ నాగ్‌నాథ్ బ్రాంచ్‌కి అనేకసార్లు ఫోన్ చేసినప్పటికీ, ఎటువంటి స్పందన కనిపించలేదు. ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఆ డబ్బు విత్‌డ్రా అయినట్లు ఆయన తెలుసుకున్నారు. తన ఖాతాగల బ్యాంకుపై దావా వేశారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మోసం జరగకుండా బ్యాంకు నిరోధించగలిగి ఉండేదని వాదించారు. కానీ వినియోగదారుల కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. 


సురక్షిత లావాదేవీల కోసం బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలను, హెచ్చరికలను కుర్జీ పాటించలేదని కోర్టు తెలిపింది. ఇటువంటి ఫేక్ కాల్స్, మోసగాళ్ళ గురించి బ్యాంకులు హెచ్చరికలు చేస్తూ ఉంటాయని, వాటిని పాటించకుండా కుర్జీ నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొంది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను బ్యాంకులు ఎన్నడూ ఫోన్ కాల్స్ ద్వారా అడగబోవని పేర్కొంది. ఫిర్యాదుదారు ఓ టీచర్, ప్రాక్టీసింగ్ లాయర్ అయి ఉండి కూడా ఓ అపరిచిత వ్యక్తితో తన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నారని పేర్కొంది. ఇది బ్యాంకు సేవా లోపం, లేదా, నిర్లక్ష్యం కాదని వివరించింది. 


Updated Date - 2021-03-17T01:25:57+05:30 IST