Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధిక్కారమేనా..!

అనంతపురం నగర పాలక సంస్థ స్కూళ్లలో చోద్యం

చిన్న తరగతులకు బోధించేందుకే ఉపాధ్యాయుల మొగ్గు

పెద్ద తరగతులకు వెళ్లేందుకు ససేమిరా..

అధికార పార్టీ నేతలు, కార్పొరేటర్ల ద్వారా అధికారులపై ఒత్తిళ్లు

హైస్కూళ్లలో వేధిస్తున్న టీచర్ల కొరత

అనంతపురం కార్పొరేషన, నవంబరు29: 

నగర పాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. డిప్యుటేషనపై చిన్న తరగతులకు బోధించేందుకు మొగ్గు చూపుతున్నారు. యథాస్థానాలకు వెళ్లి, పెద్ద తరగతుల్లో పాఠాలు చెప్పేందుకు ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి, టీచర్ల కొరత ఏర్పడింది. అయినా.. డిప్యుటేషన రద్దు చేసుకుని, హైస్కూళ్లకు వెళ్లేందుకు టీచర్లు మొండికేస్తున్నారు. అవసరమైన కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు సిఫార్సులు తీసుకొస్తున్నారు. వారి ద్వారా అధికారులపై ఒత్తిళ్లు సైతం తెస్తున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. టీచర్ల తీరుతో ఉన్నత పాఠశాలల్లో బోధన కుంటుపడుతోంది.

అనంతపురం నగరపాలక సంస్థలోని అయ్యవార్లు ధిక్కారం ప్రదర్శిస్తున్నారు. వాళ్ల అర్హత, హోదాను (స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు) బట్టి పెద్ద పిల్లలకు (ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి) పాఠాలు చెప్పాల్సింది పోయి.. చిన్న పిల్లలకు చెప్పి కాలక్షేపం చేసేస్తామంటున్నారు. మూడేళ్ల క్రితం ఒకేసారి 53 మంది ఉపాధ్యాయులు వర్క్‌ అడ్జ్‌స్టమెంట్‌ కింద డిప్యుటేషనపై ఉన్నత పాఠశాలల నుంచి  ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లారు. ఇప్పుడు హైస్కూళ్లకు వెళ్లమంటే ససేమిరా అంటున్నారు. అధికారులు ఆ డిప్యుటేషన రద్దు చేసి, ఆయా పాఠశాలలకు వెళ్లాలని ఉత్తర్వులు ఇవ్వకుండా సిఫార్సులు సైతం చేయిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయలు యథాస్థానాలకు వెళ్లకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సబ్జెక్టులకు ఒక్కరే టీచర్‌ ఉం డటంతో బోధన కుంటుపడుతోంది. ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లే ఇలా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత

మూడేళ్ల క్రితం అప్పట్లో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని స్కూల్‌ అసిస్టెంట్లు-12 మందిని, సెకండ్‌ గ్రేడ్‌ టీచర్లు(ఎ్‌సజీటీలు) 41 మందిని మొత్తం 53 మంది టీచర్లను డిప్యుటేషనపై వర్క్‌ అడ్జ్‌స్టమెంట్‌ మీద ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపారు. స్కూల్‌ అసిస్టెంట్లను మహాత్మాగాంధీ, నెహ్రూ, రహమత, 15వ వార్డు ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపారు. ఎస్జీటీలను ప్రాథమిక పాఠశాలకు పంపారు. ఇప్పుడు హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దాదాపు అన్ని హైస్కూళ్లలో ఇదే పరిస్థితి. ఒక్కో పాఠశాలలో 200 నుంచి 250 వరకు పెరిగారు. దీంతో టీచర్ల కొరత పట్టి పీడిస్తోంది. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 52 పాఠశాలలున్నాయి. అందులో ఏడు ఉన్నత (6 నుంచి పదో తరగతి వరకు), నాలుగు ప్రాథమికోన్నత (1 నుంచి 8వ తరగతి వరకు), 41 ప్రాథమిక పాఠశాలలు (1 నుంచి ఐదో తరగతి వరకు) ఉన్నాయి. 

      మొదటిరోడ్డులోని శారదా బాలికల నగరపాలకోన్నత పాఠశాలలో 1181 మంది విద్యార్థినులున్నారు. ఇక్కడికి సోషల్‌-2, ఇంగ్లీష్‌-2, గణితం, హిందీ, జీవశాస్ర్తాలకు సంబంధించి ఒక్కొక్కరు చొప్పున అవసరముందని ఆ పాఠశాలవర్గం కోరుతోంది. బుడ్జప్పనగర్‌లోని రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌లో గతంలో 800 వరకు విద్యార్థులుండగా... ఇప్పుడు ఆ సంఖ్య 1020కి పెరిగింది. పాఠశాలకు హిందీతోపాటు నలుగురు టీచర్లు కావాలని కోరుతున్నారు. పొట్టి శ్రీరాములు హైస్కూల్‌లో 960 మంది విద్యార్థులుండగా.. ఇంకా ముగ్గురు ఉపాధ్యాయులు అవసరమని, కస్తూర్బా హైస్కూల్‌లో 1010 మంది పిల్లలుండ గా.. ఇద్దరు టీచర్లు అవసరమనీ, శ్రీకృష్ణదేవరాయ పాఠశాలలో 1050 మంది విద్యార్థులుండగా... ఇంకా నలుగురు టీచర్లు, నేతాజీలో స్కూల్‌లో 487మంది విద్యార్థులకు మరో నలుగురు టీచర్లు కావాలంటున్నారు. 


చిన్న పిల్లలకే పాఠాలు చెప్తారట..

తరచూ ఐదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల పాఠాలు చెప్పే అయ్యవార్లకు ఐదోతరగతిలోపు పిల్లలకు బోధించడం లెక్కే కాదు. అందుకేనేమో ఎస్జీటీలు, స్కూల్‌అసిస్టెంట్లు చిన్న పిల్లలకే తరగతులు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. నగరంలోని ఝాన్సీలక్ష్మీబాయి స్కూల్‌ లో అధికారుల లెక్కల ప్రకారం 111 మంది విద్యార్థులున్నారు. అక్కడ ఏడుగురు టీచర్లున్నారు. హైస్కూల్‌కు వెళ్లాలని అధికారులు ఆదేశిస్తే రాత్రికి రాత్రి 150 మంది విద్యార్థులున్నారని చెబుతారట. మదర్‌థెరిస్సా స్కూల్‌లో 81 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్‌లో 104 మంది విద్యార్థులకు ఆరుగురు టీచర్లుండటం గమనార్హం. ఇలా అవసరం లేకపోయినా ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువ మంది టీచర్లుండటం విమర్శలకు తావిస్తోంది.


కార్పొరేటర్లు, నాయకుల సిఫార్సులు

గతంలో ఇచ్చిన డిప్యుటేషనను రద్దు చేసి, టీచర్లు యథాస్థానాలకు పంపేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారా..? అనే  అనుమానాలు కలుగుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో ఇంత సమస్య ఉన్నా ఇప్పటివరకు రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తున్నట్లు తెలుస్తోంది. పాత స్థానాలకు వెళ్లకుండా ఉండేందుకు అయ్యవార్లు.. అధికారపార్టీ నేతల సిఫార్సులు కోరుతున్నారట. కొందరు స్థానిక కార్పొరేటర్లు, నాయకులతో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. మరికొందరు అయ్యవార్లు.. ప్రజాప్రతినిధుల సిఫార్సులు తెచ్చారట.


ఆ బడికి వెళ్లమంటే... సీఎం పేషీకైనా సిద్ధమే...

నగరంలోని శారదా బాలికల పాఠశాలకు వెళ్లాలంటే ఉపాధ్యాయులకు దడ అని చెబుతున్నారు. ఎందుకంటే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యమా స్ర్టిక్టు. బెల్లు కొట్టగానే... ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పడానికి తరగతి గదిలోకి వెళ్లాల్సిందేనని, లేకపోతే పరిస్థితి వేరే ఉం టు ందని సమాచారం. ఈ క్రమంలో ఆ పాఠశాలకు వెళ్లేందుకు ఎవ రూ సుముఖత వ్యక్తం చేయరని తెలుస్తోంది. ఒత్తిడి తెస్తే... సీఎం పేషీకైనా వెళ్లి రెకమెండేషన లెటర్‌ తెచ్చుకుంటారని టీచర్లలోనే చర్చ సాగుతోంది. 


విద్యార్థులకు న్యాయం జరగాలి

గతంలో హైస్కూళ్లలో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో డిప్యుటేషన మీద టీచర్లను పంపారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటికైనా వారిని యథాస్థానాలకు పంపి, విద్యార్థులకు న్యాయం చేయాలి.

- రామాంజనేయులు,  ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి


కొందరినైనా సర్దుబాటు చేయాలి

హైస్కూల్‌ విద్యార్థులకు అందులోనూ 8 నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు టీచర్లు ప్రత్యేకంగా ఉండాలి. విద్యార్థుల సంఖ్య పెరగడంతో టీచర్ల కొరత ఏర్పడింది. కనీసం అవసరం మేరకైనా సర్దుబాటు చేయాలి.  - ఓబులేసు, ఎంటీఎఫ్‌

Advertisement
Advertisement