బాలుడిపై దాష్టీకం!

ABN , First Publish Date - 2020-08-13T11:00:53+05:30 IST

ఓ బాలుడిపై యజమానికి దాష్టీకం ఇది. రాళ్లు కొట్టే పనికి రావడం లేదని బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి చితక బాదిన

బాలుడిపై దాష్టీకం!

పనికి రావట్లేదని కాంట్రాక్టర్‌ అమానవనీయ చర్య 

తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి  రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వైనం

స్థానికులు వారిస్తున్నా వినకుండా  రాడ్డుకు కట్టేసి హింస

మల్కాపూర్‌ (ఏ) లో ఘటన 


నిజామాబాద్‌ రూరల్‌/ నవీపేట ఆగస్టు 12 : ఓ బాలుడిపై యజమానికి దాష్టీకం ఇది. రాళ్లు కొట్టే పనికి రావడం లేదని బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి చితక బాదిన అమానవనీయ ఘటన  నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌ (ఏ) గ్రామంలో బుధవారం చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళితే.. మల్కాపూర్‌ (ఏ) గ్రామానికి చెందిన ముద్దంగుల బాలయ్య (55) కుల వృత్తి అయిన రాళ్లు కొట్టే కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడి వద్ద పదుల సంఖ్యలో కూలీలు పనులు చేస్తున్నారు. వారిలో సమీప బంధువైన ముద్దంగుల పెద్ద బాలయ్య 15ఏళ్ల చిన్న కొడుకు కూడా కూలీ పనులు చేస్తున్నాడు. ఆరో తరగతి వరకు అదే గ్రామంలో చదివిన బాలుడు.. తండ్రి అనారోగ్యం, తల్లి మతిస్థిమితంలేని కారణంగా కుటుంబ పోషణ నిమిత్తం చదువు మానేసి కొన్నేళ్లుగా బాలయ్య వద్ద రాళ్లు కొట్టే పనిలో కుదిరాడు. అయితే కొద్దిరోజులుగా బాలుడు సరిగ్గా పనులకు వెళ్లడం లేదు.


దీంతో పనులకు సరిగ్గా రాకపోవడం.. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదన్న కోపంతో బుధవారం మధ్యాహ్నం మిత్రులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని బాలయ్య పట్టుకుని చితక్కొట్టాడు. కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి రోడ్డునుంచి ఇంటివరకు బలవంతంగా లాక్కెళ్లాడు. గాయాలపాలైన బాలుడు వద్దని వారించినా, కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. దానికి తోడు బాలయ్య కుటుంబీకులు కూడా బాలుడిని కొట్టాల ని ప్రోత్సహించారు. ఓవైపు గ్రామ పెద్దలు వారించినా వినలేదు. ఇంటి సమీపంలోని ఇనుప రాడ్‌కు కట్టివేసి అక్కడే కాపలా ఉన్నాడు. చివరకు గ్రామ సర్పంచ్‌ శేఖర్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి వెళ్లి భీమయ్యను విడిపించి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇటువంటి హేయమైన చర్యలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని బాలయ్యను హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాలయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నవీపేట ఎస్సై యాకూబ్‌ తెలిపారు. 

Updated Date - 2020-08-13T11:00:53+05:30 IST