కరోనా @1267

ABN , First Publish Date - 2021-05-10T05:11:57+05:30 IST

కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతమవుతోంది. వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య పెరుగుతోంది.

కరోనా @1267

విజృంభిస్తున్న మహమ్మారి

కర్ఫ్యూ అమలులో ఉన్నా తగ్గని వైరస్‌

ఆగని మృత్యుఘోష


కడప, మే 9 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతమవుతోంది. వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదై అధికార యంత్రాంగానికి సవాల్‌ విసురుతోంది. పాజిటివ్‌ వ్యక్తులకు ట్రీట్‌మెంటు చేస్తున్నారు తప్ప ట్రేసింగ్‌, టెస్టింగ్‌లో మాత్రం అలసత్వం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో వైరస్‌ విజృంభిస్తోంది. దానికి తోడు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో జిల్లాలో 1267 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కడపలో వైరస్‌ తీవ్రంగా కొనసాగుతోంది. ప్రొద్దుటూరులో కూడా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. మొత్తం కేసులు 72,089కు చేరుకున్నాయి. 570 మంది మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు, కేర్‌ సెంటర్లలో కోలుకున్న 1055 మందిని డిశ్చార్జి చేయగా రికవరీ సంఖ్య 64,666కు చేరుకుంది. 


కర్ఫ్యూ పెట్టినా వైర్‌సకు అడ్డేది

రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూను అమలు చేస్తోంది. మధ్యాహ్నం 12 తరువాత ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నారు. వాణిజ్య సముదాయాలు మూత వేస్తున్నారు. ఒకేచోట జన సమూహం గుమికూడకుండా కట్టడి చేస్తున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం కలవరపాటుకు గురి చేస్తోంది. పోలీసులు కట్టుదిట్టంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నప్పటికీ కొందరు పనిలేకున్నా కూడా అత్యవసరం పేరు చెప్పి రహదారులపై తిరిగేస్తున్నారు. గతంలో మొదటి దశలో వైరస్‌ వ్యాప్తి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అయితే రెండో దశ మాత్రం చాపకింద నీరులా చాలా వేగంగా జిల్లా అంతటా విస్తరించింది. అధికారికంగా నమోదైన కేసుల సంఖ్య కన్నా అనధికారికంగా అంతకు మించి కేసులు నమోదవుతున్నాయి. 


వ్యాక్సిన్‌ కోసం నిరీక్షణ

కరోనా నుంచి రక్షణకు వ్యాక్సినే శ్రీరామరక్ష అని తెలియడంతో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు జనం ఎదురుచూస్తున్నారు. మొదటి డోస్‌ వేయించుకున్న వారికి చాలామంది రెండో డోస్‌ కోసం నిరీక్షిస్తున్నారు. తొలుత కోవాగ్జిన్‌ రెండో డోస్‌ నాలుగు నుంచి ఆరు వారాలు, కోవిషీల్డ్‌ 6 వారాల్లోపు వేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు కోవాగ్జిన్‌ కొరత తీవ్రంగా ఉంది. శనివారం కోవాగ్జిన్‌ రెండో డోస్‌ జిల్లాలో 21 ఆరోగ్య కేంద్రాల్లో వేశారు. అయితే ఆ వ్యాక్సిన్‌ కోసం తెల్లవారుజాము నుంచే జనం బారులు తీరారు. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద జనాన్ని కట్టడి చేయకపోవడంతో ఒకరిపై ఒకరు తోసుకుంటూ గుంపులు గుంపులుగా కనిపించింది. అసలు వ్యాక్సిన్‌ కేంద్రాలే వైరస్‌ వ్యాప్తికి నిలయాలుగా మారుతాయన్న ఆందోళన జనాల్లో ఉంది. కోవాగ్జిన్‌ రెండో డోస్‌ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మొదటి  డోస్‌ వేసుకుని కొందరికి ఆరు వారాలు జరిగిపోతుండడంతో భయం నెలకొంది. దీంతో వ్యాక్సిన్‌ కోసం తోపులాట జరుగుతోంది.


ఆగని మృత్యుఘోష

వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం రెండో దశలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 37 మందిని కరోనా కాటేసింది. అనధికారికంగా అయితే మృతుల సంఖ్య అంతకు రెండింతలు ఉంటుందని చెబుతున్నారు. కడప రిమ్స్‌ మార్చురీలో శనివారం 13 మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. ఒకేసారి అన్ని మృతదేహాలు రావడంతో పలు అనుమానాలు రేకెత్తించింది. ఫాతిమాలో మృతి  చెందిన ఒకరు, రిమ్స్‌లో మృతి  చెందిన 12 మంది మృతదేహాలని అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్‌తో మరణిస్తే కొవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం అధికారులే అంత్యకియ్రలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించే ఎక్స్‌కవేటర్‌ చెడిపోవడంతో మూడురోజులు అంత్యక్రియలు నిర్వహించలేదని అధికారులు చెప్పారు. అయితే ఆ మరణాలను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించే కొవిడ్‌ మరణాల్లో చూపలేదు. దీంతో అనుమానాలు వచ్చాయి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి చనిపోతేనే కొవిడ్‌ మరణంగా గుర్తిస్తారట. సీటీ స్కాన్‌లో పాజిటివ్‌ అని తేలితే దానిని కొవిడ్‌ మరణంగా చూపించమని అధికారులు చెబుతున్నారు. అటు కరోనా వైరస్‌ విజృంభించడం, ఇటు మరణాల రేటు పెరుగుతుండడం భయాందోళనకు గురి చేస్తోంది. మండలాల వారీగా నమోదైన పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే.. 


జిల్లాలో 49 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కడపలో 179, ప్రొద్దుటూరు 115, సీకేదిన్నె 87, పులివెందుల 84, గాలివీడు 43, జమ్మలమడుగు 36, చాపాడు 33, దువ్వూరు 33, ఎర్రగుంట్ల 30, చిన్నమండెం 35, అట్లూరు 1, బి.కోడూరు 1, బి.మఠం 12, బద్వేలు 14, చక్రాయపేట 22,  చెన్నూరు 24, చిట్వేలు 4, గోపవరం 9, కలసపాడు 1, కమలాపురంలో 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖాజీపేటలో 9, కొండాపురం 29, లింగాల 27, ఎల్‌ఆర్‌పల్లె 12, ముద్దనూరు 36, మైదుకూరు 14, మైలవరం 14, ఓబులవారిపల్లె 9, పెద్దముడియం 10, పెనగలూరు 6, పెండ్లిమర్రి 16, పోరుమామిళ్ల 1, పుల్లంపేట 2, రాజంపేట 18, రాజుపాలెం 20, రామాపురం 4, రాయచోటి 92, రైల్వేకోడూరు 6, ఎస్‌ఎకేఎన్‌ 1, సంబేపల్లె 8, సిద్దవటం 17, సింహాద్రిపురం 23, టి.సుండుపల్లె 15, తొండూరు 15, వల్లూరు 11, వీరబల్లె 12, వేంపల్లె 19, వేముల 10, వీఎన్‌పల్లె 16, ఒంటిమిట్ట 4, అదర్‌ డిస్ట్రిక్ట్‌ 4 కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2021-05-10T05:11:57+05:30 IST