క‌రోనాపై గంద‌ర‌గోళం

ABN , First Publish Date - 2021-04-13T07:20:58+05:30 IST

కరోనాపై అనుమానంతో

క‌రోనాపై గంద‌ర‌గోళం

మార్చి 8న మొదలైన సెకండ్‌ వేవ్‌

ఇప్పటికే 34 రోజులు

దినదినానికీ వైరస్‌ ఉధృతం

ఎదుర్కోవడంలో ఇప్పటికీ అయోమయం

టెస్టులూ, టీకాల ప్రక్రియలో పౌరులకు ఇబ్బందులు

కట్టుదిట్టమైన ప్రణాళిక కోసం ప్రజల ఎదురుచూపులు

మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 11 దాకా 6205 కేసులు

మార్చిలో 2152

ఏప్రిల్‌లో 4053

ఆదివారం (ఏప్రిల్‌ 11) 355 కేసుల నమోదు

శనివారం (ఏప్రిల్‌ 10) 551

మార్చిలో సగటున రోజుకు వంద కేసులు

ఏప్రిల్‌లో సగటున రోజుకు 368 కేసులు


కరోనా రెండో వేవ్‌ మొదలై నెల దాటిపోయింది. గంట గంటకూ రెండో ‘అల’ ఉధృతంగా విరుచుకుపడుతోంది. కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షల కోసం, టీకాల కోసం జనం ఆరోగ్య కేంద్రాలకు, ఆస్పత్రులకు తరలి వెళ్తున్నారు. సంవత్సరం కింద మార్చిలో మొదలై ఏడాదంతా ఏడిపించిన కరోనాని ఎదుర్కొన్న అనుభవం సిటీ విభాగాల అధికారులకు ఉంది. ఈ ఏడాది వైరస్‌ విజృంభణ మొదలై 34 రోజులవుతోంది. ఎక్కడ చూసినా టెస్టులు, టీకాలు, వాటి కోసం ప్రయత్నాల హడావిడి కనిపిస్తోంది. మాస్కు లేని వారిపై జరిమానాల విధింపు కూడా ప్రారంభమైంది. మూడు జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, డీఎంహెచ్‌ఓలు, ఇతర విభాగాలు, వాటి సిబ్బంది అందరూ కలిసికట్టుగా కార్యాచారణ ప్రణాళిక రూపొందిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా జరగకపోవడం వల్ల ఓ విధమైన గందరగోళం, అయోమయం ఏర్పడుతున్నాయి. వాటిపై ఎంత త్వరగా అదుపు సాధించగలిగితే అంత వేగంగా కరోనాని కంట్రోల్‌ చేయవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. 


ల్యాబ్‌, ల్యాబ్‌కూ ఫలితం మారితే ఎలా..?

కరోనా అనుమానితుల్లో గందరగోళం



హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : 

కరోనాపై అనుమానంతో కూకట్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఈ నెల 6న కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్‌ చేయించుకున్నాడు. అక్కడ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే రోజు బంజారాహిల్స్‌లోని మరో ల్యాబ్‌లో పరీక్ష చేయించుకున్నాడు. అక్కడ నెగెటివ్‌ వచ్చింది. మరుసటి రోజు మూసాపేటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి యాంటీజన్‌ చేయించుకున్నాడు. అక్కడ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇలా రెండు చోట్ల పాజిటివ్‌, మరో చోట నెగెటివ్‌ రావడంతో ఆ యువకుడు అయోమయంలో పడిపోయాడు. తాను చికిత్స చేయించుకోవాలా, వద్దా అనే గందరగోళంలో ఉన్నాడు. 

సంజీవరెడ్డినగర్‌కు చెందిన మరో యువకుడిది కూడా అదే పరిస్థితి. ఇలా ఒకరు, ఇద్దరు కాదు, అనేక మందికి పలు రకాలుగా కరోనా ఫలితాలు వస్తుండడంతో అయోమయంలో పడిపోతున్నారు. లక్షణాలు ఉన్న వారికి కూడా నెగెటివ్‌ వస్తుండడంతో గందరగోళంలో పడిపోతున్నారు. 


ర్యాపిడ్‌తో నిర్ధారణకు రాలేమా

ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్ష కేవలం ప్రాథమిక నిర్ధారణ మాత్రమే. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకోలేమని వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన 7 నుంచి 12 రోజుల మధ్యనే ర్యాపిడ్‌ పరీక్ష చేయించాలి. 7వ రోజుకు ముందు కానీ, 12 రోజు తర్వాత కానీ ఈ పరీక్ష చేయిస్తే ఫలితం రాదని వైద్యులు తెలిపారు. విండో పీరియడ్‌లోనే ర్యాపిడ్‌ పరీక్ష చేయిస్తే సెన్సివిటి బాగా ఉంటుందని చెబుతున్నారు. ఒకసారి పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా లక్షణాలు ఉంటే మూడు రోజుల తర్వాత మరో సారి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.


నమునాల తీసుకునే పద్ధతిని బట్టి

కరోనా పరీక్ష నిర్ధారణ బాధితుడి నుంచి సేకరించే నమునాలను బట్టి కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముక్కు, గొంతు నుంచి తీసే నమునాలు చాలా లోతుగా తీస్తేనే ఫలితాలు కచ్చితంగా వస్తాయని అంటున్నారు. కొంత మంది వేడి నీటిని, బెటాడిన్‌ లాంటివి నోటిలో పుకిలిస్తుంటారని, ఇలాంటి సమయాలలో ముక్కు, గొంతు భాగంలో ఉండే వైరస్‌ నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయని, ఆ సమయంలో సేకరించే నమునాలతో నెగెటివ్‌ వస్తుందని వైద్యులు వివరించారు. వైరస్‌ మాత్రం ఇతర భాగాలలో ఉంటుందన్నారు. కిట్లను బట్టి కూడా ఫలితాలలో తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ పాథాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సందీప్‌ తెలిపారు. 


రెండు, మూడు సార్లు వద్దు

వైరస్‌ నిర్ధారణ కోసం కొంత మంది రెండు, మూడు సార్లు పరీక్ష చేయించుకుంటున్నారు. అది సరి కాదని, దీని వల్ల ఆందోళన, కన్‌ఫ్యూజన్‌ తప్ప ఉపయోగం లేదని వైద్యులు చెబుతున్నారు. పరీక్షలో పాజిటివ్‌ అని తేలితే ఐసోలేషన్‌కు వెళ్లడం మంచిది. ఇంటి నుంచి బయటకు వెళ్లని వారు, ఎవరినీ కలవని వారు, లక్షణాలు ఉండి పాజిటివ్‌ వస్తే వాళ్లు మూడు, నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాలి. అదే రోజు మరో ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేస్తే తేడా ఉండొచ్చునని వైద్యులు వివరించారు. నెగెటివ్‌ వచ్చినప్పటికీ లక్షణాలు ఉంటే రెండు, మూడు రోజుల పాటు సాధారణ వైద్యం చేయించుకుని తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుని నిర్ధారించుకోవాలన్నారు. 


అన్ని చోట్ల ఒకే రకం రాదు

ల్యాబ్‌, ల్యాబ్‌కు సాంకేతిక మారుతుంటుంది. ఒక్కో ల్యాబ్‌లో వేర్వేరు ప్యాటర్స్‌ ఉంటాయి. వైద్యుల అనుభవాలు, కిట్ల సామార్థ్యం ఆధారంగా సైకిలికల్‌ థ్రిషోల్డ్‌ (సీటీ)లో విలువ నిర్ణయిస్తారు. ఒక ల్యాబ్‌లో సీటీ విలువ 32 కంటే తక్కువ ఉంటే పాజిటివ్‌గా నిర్ణయిస్తారు. ఎక్కువగా ఉంటే నెగెటివ్‌గా నిర్ధారిస్తారు. మరో ల్యాబ్‌లో సీటీ విలువ 35 ఉంటే పాజిటివ్‌గా నిర్ణయిస్తారు. కొన్ని దేశాల కిట్లలో 32 ఉండొచ్చు, మరికొన్ని దేశాలకు సంబంధించిన కిట్లలో 30, 35 సిటీ విలువ ఉండొచ్చు. వినియోగించే కిట్లు, పరికరాలను ఉత్పత్తి చేసిన కంపెనీ సూచనలు, వైద్యుల అనుభవాల ఆధారంగా నిర్ధారణలు ఉంటాయి. ఆర్టీపీసీఆర్‌లో చేసిన ఫలితాలకు కేవలం 65 శాతం మాత్రమే సెన్సివిటి ఉంటుంది. వందలో 65 మందికి మాత్రమే పాజిటివ్‌ వస్తుంది. మిగతా వారికి నెగెటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్పారు. ప్రతీ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వైరస్‌ నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. 

- డాక్టర్‌ సందీప్‌, పాథాలజీ డైరెక్టర్‌ 


7 రోజుల్లో 3,214 మందిపై కేసులు

మాస్క్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జన సమర్థ ప్రాంతాలైన కూడళ్ల వద్ద, రద్దీ ప్రదేశాలైన దుకాణాలు, మాల్స్‌, ఇతర వాణిజ్య కేంద్రాల వద్ద మాస్కులు ధరించకుండా ఉన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వారం రోజుల్లో 3214 మందిపై కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలపై అవగాహన కల్పించిన పోలీసులు తర్వాత యాక్షన్‌లోకి దిగారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారిపై అంటువ్యాధుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారం రోజుల్లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మాస్కులు ధరించకుండా సంచరిస్తున్న 2030 మందిపైన, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 670, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 514 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2021-04-13T07:20:58+05:30 IST