పాజిటివ్‌ జీరో

ABN , First Publish Date - 2020-04-04T12:07:56+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలతో అనుమానితులుగా గుర్తించిన 49 కేసుల్లో నెగటివ్‌ ఫలితాలు వచ్చాయి.

పాజిటివ్‌ జీరో

శాంపిల్స్‌ సేకరించేందుకు 3 ప్రత్యేక వైద్య బృందాలు

 95 మంది అనుమానితుల నుంచి సేకరణ

49 కేసుల్లో  నెగిటివ్‌ ఫలితాలు


కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలతో అనుమానితులుగా గుర్తించిన 49 కేసుల్లో నెగటివ్‌ ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్‌ జీరో ఫలితాలు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అనుమానితుల నుంచి శాంపిల్స్‌ను సేకరించేందుకు వైద్యాధికారులు జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. జిలా కేంద్రంలోని జీజీహెచ్‌లో మాత్రమే అనుమా నితుల నుంచి శాంపిల్స్‌ (స్వాబ్‌) సేకరించే ఏర్పాటు ఉండేది. ప్రస్తుతం జీజీహెచ్‌తో పాటు ఎంపిక చేసిన సోంపేట, ఇచ్ఛాపురం, పలాసలలో కూడా ప్రత్యేక వైద్యబృందాల ద్వారా శాంపిల్స్‌ (స్వాబ్‌)ను మూడు రోజులుగా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 95 మంది నుంచి శాంపిల్స్‌ (స్వాబ్‌)ను సేకరించి కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కళాశాలలోని ల్యాబ్‌కు పంపిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా నుంచి పంపించిన 49 కేసుల్లో నెగటివ్‌ ఫలితాలు రాగా మరో 46 శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని జీజీహెచ్‌ ఆర్‌ఎంవో డా.హేమంత్‌ తెలిపారు.


ఉద్దానంపై ప్రత్యేక దృష్టి

ఉద్దానంలోని సోంపేట, ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో విదేశాల నుంచి వచ్చిన  వారు కరోనా లక్షణాలతో అనుమానితులుగా ఎక్కువ మంది నమోదు అవుతండటంతో  ఆయా ప్రాంతాల్లో 3 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అనుమానితుల నుంచి శాంపిల్స్‌ (స్వాబ్‌)ను సేకరించే ఏర్పాట్లను చేపట్టారు. రిపోర్టులు వచ్చే వరకు బాఽధితులను ఐసోలేషన్‌ వార్డుల్లో పరిశీలనకు ఉంచుతున్నారు. కాగా... శుక్రవారం 9 మందికి నెగటివ్‌ ఫలితాలు రావడంతో వారందరిని జీజీహెచ్‌ వైద్యాధికారులు ఇళ్లకు విడచిపెట్టారు. ఐసోలేషన్‌ వార్డు నుంచి వెళ్లాక కనీసం 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో కచ్చితంగా ఉండాలనే నిబంధనపై విడచిపెడుతున్నారు. మరోవైపు ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై సర్వే నిర్వహిస్తున్నారు. గుర్తించిన వారిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో పరిశీలనకు పంపిస్తున్నారు. అంతే కాకుండా జీజీహెచ్‌లో సాధారణ ఓపీని ఏర్పాటుచేసి కరోనా వైరస్‌ లక్షణాలతో ఉన్న వారికి చికిత్సలను అందజేసే ఏర్పాటును కూడా చేశారు.

Updated Date - 2020-04-04T12:07:56+05:30 IST