కరోనా కల్లోలం!

ABN , First Publish Date - 2021-03-28T07:15:44+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్‌ వ్యాప్తిలో వేగం తొలి వేవ్‌నే మించిపోతోంది. శుక్రవారం ఒక్కరోజులో ఏకంగా 62,258 మంది మహమ్మారి బారిన పడగా.. 291 మంది కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో..

కరోనా కల్లోలం!

సచిన్‌కు కరోనా

సినీ నటుడు పరేశ్‌ రావల్‌కూ..

62వేల కేసులు.. మృతులు291 

మహారాష్ట్రలోనే అత్యధికం

బహిరంగంగా ఉమ్మినా, ఆంక్షలు ఉల్లంఘించినా వెయ్యి జరిమానా

వైరస్‌ నియంత్రణకు కేంద్రం ఐదంచెల ప్లాన్‌.. రాష్ట్రాలతో భేటీ

సెకండ్‌ వేవ్‌ తీవ్రత మరింత పెరుగుతుందంటున్న నిపుణులు

రిజిస్ట్రేషన్‌ లేకుండానే టీకా

ఢిల్లీ సర్కార్‌ సంచలన నిర్ణయం


న్యూఢిల్లీ, మార్చి 27: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్‌ వ్యాప్తిలో వేగం తొలి వేవ్‌నే మించిపోతోంది. శుక్రవారం ఒక్కరోజులో ఏకంగా 62,258 మంది మహమ్మారి బారిన పడగా.. 291 మంది కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో.. మొత్తం బాధితుల సంఖ్య 1,19,08,910కి చేరగా.. మరణాలు 1,61,240కి పెరిగాయి. వరుసగా 17 రోజులుగా కోలుకుంటున్న వారి సంఖ్య కన్నా కొత్త కేసులే అధికంగా నమోదవుతుండడంతో.. యాక్టివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పెరుగుదల సగటున రోజుకు 26 వేలుగా ఉంటోంది.  శుక్రవారం మరో 30,386 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 1,12,95,023కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,52,647 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇవి మొత్తం కేసుల్లో 3.80 శాతం కావడం గమనార్హం. దేశంలో కేసుల పెరుగుదలను మహారాష్ట్ర, పంజాబ్‌, చత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితులు మరిం త దిగజారాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం ఈ రాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా శుక్రవారం రికార్డు స్థాయిలో 36,902 మంది కరోనా బారినపడగా.. 112 మంది మృత్యువాత పడ్డారు. 


రాష్ట్రంలోని అన్ని రెస్టారెంట్లు, షాపింగ్‌ మా ళ్లు, పార్కులు, గార్డెన్లను రాత్రి 8 నుంచి ఉదయం 7 వరకు మూసివేయాలని ఆదేశించింది. రాత్రి 8 తర్వాత బీచుల్లోకి ప్రవేశాన్ని నిషేధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.1000, మా స్కు ధరించని వారికి రూ.500, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మిన వారికి రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా మత, రాజకీయాలతో పాటు అన్ని రకాల జన సమీకరణలపైనా నిషేధం విధించింది. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌, సినీనటుడు పరేశ్‌ రావల్‌ కరోనా బారిన పడ్డారు. కాగా, పంజాబ్‌(3,122), కర్ణాటక (2,886), చత్తీ్‌సగఢ్‌ (2,665) రాష్ట్రాల్లోనూ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో వరుసగా ఈ మూడు రాష్ట్రాలూ నిలిచాయి. తమిళనాడులోనూ సెకండ్‌ వేవ్‌లో తొలిసారిగా కేసులు 2 వే లు దాటాయి. కాగా, ఆగ్రాలో తాజాగా మరో కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్‌ అ త్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని వారు అంటున్నారు. గుజరాత్‌లో రెండు ప్రఖ్యాత విద్యాలయాలు కరోనా బారినపడ్డాయి. అహ్మదాబాద్‌ ఐఐఎంలో 40 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లకు పాజిటివ్‌ రాగా.. గాంధీనగర్‌ ఐఐటీలో 25 మందికి వైరస్‌ సోకింది. హాస్టల్‌ గదుల్లోనే వీరిని క్వారంటైన్‌ చేశారు.


సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్రం: నిపుణులు

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని, ఇది తొలి వేవ్‌ను అలవోకగా అధిగమించేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో నమోదవుతున్న కేసులను విశ్లేషించిన వారు.. ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతానికి దేశంలో కేసుల పెరుగుదల రేటును మహారాష్ట్ర మాత్రమే ప్రభావితం చేస్తోందని, ఈ రాష్ట్రం ఇప్పటికే తొలి దశ అత్యధిక కేసుల రికార్డును ఎప్పుడో అధిగమించేసిందని గుర్తుచేస్తున్నారు. అలాగే, ప్రస్తుతం పంజాబ్‌, గుజరాత్‌లు కూడా అత్యధిక కేసులను నమోదు చేశాయని, ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా వస్తే.. కేసులు భారీగా పెరిగిపోతాయని అంటున్నారు. ఇక బెంగాల్‌, యూపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లు ప్రస్తుతానికి నెమ్మదిగానే ఉన్నా.. ఒక్కసారి వైరస్‌ ప్రభావం చూపితే.. దేశం అత్యధిక కేసుల రికార్డు చెదిరిపోవడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. 


వైరస్‌ నియంత్రణకు 5 అంచెల ప్రణాళిక

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఆ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మహారాష్ట్ర, హరియాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌, చత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, జమ్మూకశ్మీర్‌కు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు. అలాగే, ఈ రాష్ట్రాల్లో కేంద్రం గుర్తించిన 46 కరోనా ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్‌ కమిషనర్లు హాజరయ్యారు. మార్చిలో నమోదైన మొత్తం కేసుల్లో 71 శాతం ఈ 46 జిల్లాల నుంచే వచ్చాయని, మరణాల్లో కూడా 69 శాతం వీటిలోనే నమోదయ్యాయని కేంద్రం గుర్తించింది. వీటిలో 25 జిల్లాలు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇక్కడ కేసుల్ని నియంత్రిస్తే.. దేశవ్యాప్తంగా వైరస్‌ అదుపులోకి వస్తుందని భావిస్తున్న కేంద్రం.. ఇందుకుగాను ఓ ఐదంచెల ప్రణాళికను సిద్ధం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచడం, నిర్ధారిత కేసుల్ని పకట్బందీగా ఐసొలేషన్‌లో ఉంచడంతో పాటు వారి కాంటాక్టులను గుర్తించడం, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందిని ఉత్తేజితం చేయడం, కొవిడ్‌ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయడం, వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను నిర్దేశించుకుని వేగవంతం చేయడం.. ఇలా ఈ ఐదు అంశాలను సమర్ధంగా అమలు చేస్తే వైరస్‌ వ్యాప్తిని నియంత్రిచవచ్చని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు 70 శాతానికి తగ్గకుండా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. కరోనా నియంత్రణలో ఐసొలేషన్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కీలకపాత్ర పోషిస్తాయని, కనీసం 30 కాంటాక్టులను గుర్తించి, పరీక్షించి, 72 గంటలు క్వారంటైన్‌ చేయాలని చెప్పారు. 

Updated Date - 2021-03-28T07:15:44+05:30 IST