కరోనా బిజినెస్‌!

ABN , First Publish Date - 2020-08-14T09:43:50+05:30 IST

ఎన్‌ఆర్‌ పేటలోని ఆ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 15 మందికి పైగా బాధితులకు చికిత్స అందించినట్లు తెలిసింది.

కరోనా బిజినెస్‌!

బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు

అనుమతి లేకుండానే కొవిడ్‌ వైద్యం

తెగబడుతున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు

తక్కువ ధరకే చికిత్స చేస్తామని ప్రచారం

హంద్రీ ఒడ్డున పారేస్తున్న పీపీఈ కిట్లు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: 

ఎన్‌ఆర్‌ పేటలోని ఆ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 15 మందికి పైగా బాధితులకు చికిత్స అందించినట్లు తెలిసింది. అదేమంటే అనుమతి కోసం కలెక్టర్‌కు వినతి చేసుకున్నామని, త్వరలోనే వచ్చేస్తాయని నమ్మబలుకుతున్నారు. గాయత్రి ఎస్టేట్‌లో అనుమతి లేని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కూడా ఇటీవలే కరోనా సోకిన ఓ గర్భిణికి వైద్యం చేశారు. కొవిడ్‌కు, ప్రసవానికి కలిపి ఆస్పత్రి యాజమాన్యం రూ.6లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఆర్‌ఎంపీలను అడ్డం పెట్టుకుని వైద్య వ్యాపారం చేస్తోందనే వివాదం నడుస్తోంది. వెలుగోడుకు చెందిన ఓ వ్యాపారి కొవిడ్‌తో కర్నూలు కర్నూలులోని బళ్లారి చౌరస్తా సమీపంలో కరోనా చికిత్సకు అనుమతి ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 15 రోజుల క్రితం చేరాడు. అతడి నుంచి ఏకంగా రూ.20 లక్షలు ఆ ఆసుపత్రి యాజమాన్యం వసూలు చేసింది. అయినా ఆ బాధితుడు బతకలేదు. పరిస్థితి విషమించడంతో తక్షణమే హైదరాబాద్‌ తరలించాలని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది. అతను మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఇటీవలే డీఎంహెచ్‌వోకు ఆ ఆసుపత్రిపై వరుసగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వైద్యాధికారులు నోటీసులు పంపించారు. 


  కరోనా బాధితులను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు పీల్చిపిప్పి చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. బాధితుడి ఆరోగ్యం విషమిస్తే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని చేతులు దులుపుకుంటున్నాయి. అనుమతి ఉన్న కొన్ని ఆసుపత్రుల్లో ఇలా జరుగుతుండగా.. అనుమతిలేని వాటిలో సైతం వైద్య వ్యాపారం జోరుగా సాగుతోంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ ఫీజుకే అంటే రూ.10-15 వేలకే చికిత్స చేస్తామని వాట్సాప్‌ ద్వారా ప్రచారం చేసుకుంటున్నాయి.


కరోనాపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో అనుమతి లేకుండా 8కి పైగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్నారు. సాధారణంగా ఆసుపత్రులు ప్రారంభించే ముందు డీఎంహెచ్‌వో కార్యాలయంలోని మాస్‌ మీడియాలో వాటి వివరాలను రిజిస్టర్‌ చేయించుకోవాలి. అలా చేయించుకున్న వాళ్లకు 3 నెలల్లోపు శాశ్వత అనుమతులిస్తారు. అయితే ఈ ఆసుపత్రులు అసలు రిజిస్టర్‌ చేయించుకోలేదని జిల్లా వైద్య శాఖ స్పష్టం చేస్తోంది. ఇలాంటి ఆస్పత్రుల్లో ఇప్పుడు ఏకంగా కొవిడ్‌ బాధితులకే చికిత్స చేస్తున్నారు. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 


అనుమతి ఉన్న చోట ఇలా.. 

జిల్లాలో 55 ఆరోగ్యశ్రీ అసుపత్రులుండగా తొమ్మిదింటిని నెట్‌వర్క్‌ పరిధిలో గుర్తించారు. వాటితో పాటు తక్కిన ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో వ్యక్తిగత బాధ్యతతో జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. అయితే ఆ ఆసుపత్రుల్లో ఒక్కో బాధితుడి నుంచి రూ.40-45 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక ఆసుపత్రి అయితే ఏకంగా రూ.లక్షల్లో వసూలు చేస్తోంది. ఈ దోపిడీని ఆసరాగా చేసుకుని అనుమతిలేని ప్రైవేటు ఆసుపత్రులు దండుకుంటున్నాయి. ఆసుపత్రిలో చేరాక చుక్కలు చూపిస్తున్నాయి. 


ఫ వెలుగోడుకు చెందిన ఓ వ్యాపారి కొవిడ్‌తో కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 15 రోజుల క్రితం చేరాడు. అతడి నుంచి ఏకంగా రూ.20 లక్షలు ఆ ఆసుపత్రి యాజమాన్యం వసూలు చేసింది. అయినా ఆ బాధితుడు బతకలేదు. పరిస్థితి విషమించడంతో తక్షణమే హైదరాబాద్‌ తరలించాలని చెప్పి ఆస్పత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది.


అతను మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఇటీవలే డీఎంహెచ్‌వోకు ఆ ఆసుపత్రిపై వరుసగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వైద్యాధికారులు నోటీసులు పంపించారు. ఇలాంటి కార్పొరేట్‌ ఆసుపత్రులు కరోనాను అడ్డం పెట్టుకుని బాధితులను దోచుకోవడాన్ని అనుమతుల్లేని ప్రైవేట్‌ ఆసుపత్రులు వాడుకుంటున్నాయి. 


చౌక ధరలకే చికిత్సలట!

కరోనా చికిత్సకు కార్పొరేట్‌ ఆస్పత్రులు భారీగా వసూలు చేస్తుండటంతో అనుమతి లేని ప్రైవేట్‌ ఆసుపత్రులు పబ్బం గడుపుకుంటున్నాయి. రూ.10-15 వేలకే చికిత్స చేస్తామని రోగులను రాబట్టుకుంటున్నాయి. వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నాయి. ఆర్‌ఎంపీల ద్వారా కరోనా బాధితులను తెచ్చుకుని ఈ ప్రైవేట్‌ ఆసుపత్రులు వ్యాపారం చేస్తున్నాయి.


ఆర్‌ఎంపీలకు కమీషన్లు ఇస్తున్నాయి. కరోనా బాధితులు మరణిస్తే తక్షణమే ఆసుపత్రి యాజమాన్యాలు రంగంలోకి దిగి బాధిత కుటుంబాలతో పంచాయితీలు నెరుపుతాయి. ఇలా రహస్య చికిత్సల వల్ల ప్రాణహాని జరిగిన ఘటనలను దాచేస్తున్నాయి. జిల్లా అధికారులు ఈ విషయంలో స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఎక్కడపడితే అక్కడ పీపీఈ కిట్లు 

ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉపయోగించిన పీపీఈ కిట్లు మరుసటి రోజున రోడ్ల పక్కన, కాల్వల పక్కన పడేస్తుండడంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అప్రమత్తమైన ఓ ఆసుపత్రి యాజమాన్యం తప్పు సరిదిద్దుకుంది. ఇలాంటి ఆసుపత్రుల్లో వాడేసిన పీపీఈ కిట్లను రోజూ ట్రాక్టర్ల ద్వారా సేకరిస్తున్నారు. వాటన్నింటినీ హంద్రీ నది ఒడ్డున కుప్పలుగా వదిలేస్తున్నారు.


నగర పాలక సంస్థ అధికారులు కూడా వాటిని పట్టించుకోవడంలేదు. అలా వదిలేసిన కిట్లు గాలికి ఎగిరిపడుతూ చుట్టు పక్కల కాలనీల్లోని నివాసాల వద్దకు చేరుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 


చర్యలు తీసుకుంటాం: 

అనుమతులున్న ఆసుపత్రుల్లో మాత్రమే కొవిడ్‌ చికిత్స చేయాలి. అనుమతుల్లేని ఆస్పత్రుల యాజమానులు మమ్మల్ని సంప్రదించలేదు. ఇప్పుడు అలాంటి ఆస్పత్రులకు అనుమతి వచ్చే అవకాశం లేదు. ఇటీవలే వీఆర్‌ మల్టీస్పెషాలిటీ, కిమ్స్‌ హాస్పిటల్స్‌కు కొత్తగా అనుమతులిచ్చాం. ఇలా అనుమతుల్లేకుండా చికిత్స చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. 

                          -డా.ప్రవీణ్‌కుమార్‌, ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌


Updated Date - 2020-08-14T09:43:50+05:30 IST