అదుపులేని కరోనా.. భయపెడుతున్న హైదరాబాద్‌ రాకపోకలు...

ABN , First Publish Date - 2020-07-08T22:21:57+05:30 IST

కరోనా వైరస్‌ కరీంనగర్‌ పట్టణంపై పంజా విసురుతున్నది. రోజురోజుకు వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అదుపులేకుండా పెరిగిపోతున్నది. జిల్లాలో తొలి కరోనా కేసు 17న మార్చిన నమోదుకాగా ఇప్పటి వరకు

అదుపులేని కరోనా.. భయపెడుతున్న హైదరాబాద్‌ రాకపోకలు...

ఒకే రోజు వ్యాధిబారిన పడ్డ 13 మంది 

11 కేసులు కరీంనగర్‌లోనే

నెలరోజుల వ్యవధిలో 76 మందికి పాజిటివ్‌ 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌):రోనా వైరస్‌ కరీంనగర్‌ పట్టణంపై పంజా విసురుతున్నది. రోజురోజుకు వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అదుపులేకుండా పెరిగిపోతున్నది. జిల్లాలో తొలి కరోనా కేసు 17న మార్చిన నమోదుకాగా ఇప్పటి వరకు 177 కేసులు నమోదయ్యాయి. వీరిలో 10 మంది ఇండోనేషియన్లు కాగా 167 మంది జిల్లాకు చెందిన వారున్నారు. వీటిలో సగానికి మించి 84 మంది కరీంనగర్‌కు చెందిన వారే కావడం గమనార్హం. మంగళవారం జిల్లాలో 13 మందికి కరోనా వ్యాధి సోకగా వారిలో ఇద్దరు హుజూరాబాద్‌, జమ్మికుంటకు చెందిన వారు కాగా, 11 మంది కరీంనగర్‌కు చెందిన వారే ఉన్నారు. పట్టణంలోని వావిలాలపల్లిలో ముగ్గురు, లక్ష్మీనగర్‌లో ముగ్గురు, శివనగర్‌లో ఇద్దరు, గణేశ్‌నగర్‌, బోయవాడ, కాపువాడలో ఒక్కొక్కరు వ్యాధిబారిన పడ్డారు. సోమవారం జిల్లాలో 17 మందికి వ్యాధి సోకగా అందులో ఎనిమిది మంది నగరానికిచెందిన వారే. 4వ తేదీన ఏకంగా 10 మంది నగరవాసులు వ్యాధిబారిన పడ్డారు. మార్చి 17 నుంచి మే 31వ తేదీ వరకు జిల్లాలో 23 కేసులు నమోదు కాగా, వీరిలో 8 మంది కరీంనగర్‌ కు చెందిన వారు ఉన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత మంగళవారం వరకు జిల్లావ్యాప్తంగా 154 కేసులు నమోదు కాగా అందులో 76 కేసులు కరీంనగర్‌లోనే వచ్చాయి. ఇప్పటి వరకు కరీంనగర్‌లోనే 84 కేసులు నమోదు కావడం వ్యాధి తీవ్రతను చాటుతున్నది. 


భయపెడుతున్న హైదరాబాద్‌ రాకపోకలు

లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగడం, హైదరాబాద్‌లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి పలువురు జిల్లాకు తిరిగిరావడంతో కేసుల నమోదు పెరుగుతున్నది. బస్సు ప్రయాణాల్లో, ఆటోలు, ఇతర వాహనాల్లో ఎవరూ కూడా మాస్కులు ధరించక పోవడం, జిల్లా కేంద్రంలో కోవిడ్‌-19 నిబంధనలకు తిలోదకాల్చి ప్రజలు విచ్చలవిడిగా వ్యవహరించడం వ్యాధి వ్యాప్తికి కారణమవుతుఉన్నాయి. 


నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోని అధికారులు

గతంలో లాక్‌డౌన్‌ సమయంలో మాస్క్‌లు ధరించకుంటే జరిమానాలు విధించిన జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఆ విషయం పట్టించుకోవడం లేదు. మాస్క్‌లు లేకుండానే సగం మందికిపైగా బహిరంగంగా సంచరించడం, భౌతిక దూరం అనే విషయాన్నే పట్టించుకోకపోవడం సర్వసామాన్యమవుతుండడగా, మున్సిపల్‌, పోలీసు అధికారులు కూడా ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. దీంతో కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


80 శాతం కేసులకు ఇళ్లలోనే చికిత్స

జిల్లాలో యాక్టివ్‌ పేషెంట్లలో 80శాతం మేరకు ఇళ్ళలోనే ఉండి చికిత్సపొందుతున్నారు. దీనితో ఆయా ప్రాంతాల ప్రజలు తమకు వ్యాధి ఎక్కడ సోకుతుందోనన్న భయాందోళనకు గురవుతున్నారు. హోంక్వారంటైన్‌ నిబంధనలు పేషెంట్ల కుటుంబసభ్యులు పట్టించుకోవడం లేదని, వాటిని పర్యవేక్షించే వారు లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి.


Updated Date - 2020-07-08T22:21:57+05:30 IST