విశాఖ జిల్లాలో మరో 797 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-13T13:51:09+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బుధవారం మరో 797 మంది..

విశాఖ జిల్లాలో మరో 797 మందికి పాజిటివ్‌

వదలని వైరస్‌

జిల్లాలో 21,998కు చేరిన మొత్తం కేసుల సంఖ్య

15,581 మంది డిశ్చార్జ్‌

ఆస్పత్రుత్లో 6,261 మంది

తాజాగా వైరస్‌ బారినపడి మరో ఆరుగురి మృతి

150కు చేరిన మరణాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బుధవారం మరో 797 మంది వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,998కు చేరింది. కాగా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో కలిపి జిల్లాలో మరణాల సంఖ్య 150కు చేరింది. 


ఆరిలోవలో 28..

ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో 151 మందికి పరీక్షలు నిర్వహించగా 28 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


69, 72 వార్డుల్లో 16.. 

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 69, 72 వార్డులకు చెందిన 76 మందికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఆ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది కూడా ఉన్నారు. 


గోపాలపట్నంలో ఐదు.. 

గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనగర్‌లో ఇద్దరు, అజంతా పార్క్‌, ఇందిరానగర్‌, నరసింహనగర్‌లో ఒక్కొక్కరు వైరస్‌ బారినపడ్డారు. 


ఆనందపురంలో నాలుగు.. 

ఆనందపురం మండలంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో మండలాభివృద్ధి అధికారి ఉన్నారు. అలాగే మండలంలోని గంభీరం పంచాయతీలో ఇద్దరికి, గండిగుండంలో ఒకరికి కరోనా సోకింది. 


పరవాడ మండలం తాణాం గ్రామానికి చెందిన వ్యక్తి(35)కి కరోనా సోకింది. 


ఏజెన్సీలో 12 కేసులు  

ఏజెన్సీవ్యాప్తంగా బుధవారం 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ తెలిపారు. ఏజెన్సీలో మొత్తం 150 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చినట్టు తెలిపారు. మండలాల వారీగా....పాడేరులో 6,  కొయ్యూరులో 4, హుకుంపేటలో 1, డుంబ్రిగుడలో 1 చొప్పున  కేసులు నమోదయ్యాయన్నారు. దీంతో ఏజెన్సీలో ఇంతవరకు 376 మంది వైరస్‌బారిన పడ్డారు.


‘పేట’లో ఏడు కేసులు 

పాయకరావుపేట మండలంలో ఏడుగురికి వైరస్‌ సోకింది. పట్టణంలో లక్ష్మీ థియేటర్‌ వెనుక ప్రాంతంలో పురుషుడు, మండలంలోని అంకంపేటలో గర్భిణి, మహిళ, రాజానగరంలో గర్భిణి, పాల్తేరులో మహిళ, యువకుడు, ఈదటంలో బాలిక వైరస్‌బారిన పడినట్టు వైద్యాధికారులు తెలిపారు. 


మునగపాకలో ఏడు...

మునగపాక మండలంలో మరో ఏడుగురు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. మునగపాకలో పురుషుడు, మరో ముగ్గురికి, నాగులాపల్లిలో మహిళ, కుంచవానిపాలెంలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు చెప్పారు. 


అచ్యుతాపురంలో ఆరుగురికి...

అచ్యుతాపురం మండలంలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు రజని, కనకమహాలక్ష్మి తెలిపారు. అచ్యుతాపురానికి చెందిన ఐదుగురు, కొత్తపాలెం గ్రామానికి చెందిన పురుషుడు వైరస్‌ బారినపడ్డారు.


‘కశింకోట’లో ఐదుగురికి.... 

కశింకోట పీహెచ్‌సీ పరిధిలో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. బయ్యవరంలో పురుషుడు, శారదానగర్‌లో ముగ్గురు పురుషులు, బీఆర్‌టీ కాలనీలో యువకుడు వైరస్‌ బారినపడ్డారు.


‘గొలుగొండ’లో నలుగురికి..

గొలుగొండ మండలంలో నలుగురు మహిళలకు కరోనా వైరస్‌ సోకింది. మండల కేంద్రంలో వృద్ధురాలు, పోలవరంలో ముగ్గురు మహిళలు వైరస్‌ బారినపడినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ ధనలక్ష్మి తెలిపారు. 


సీలేరులో నాలుగు...

సీలేరులో బుధవారం 30 మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. 


కోటపాడు మండలంలో 4 

కె.కోటపాడు మండలంలోని మూడు గ్రామాల్లో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోటపాడులో మహిళ, పురుషుడు,  చౌడువాడలో మహిళ, ఆర్లిలో మహిళ వైరస్‌ బారిన పడినట్టు చౌడువాడ పీహెచ్‌సీ వైద్యాధికారి యు.రమేశ్‌ తెలిపారు. 


దేవరాపల్లి పీహెచ్‌సీలో బుధవారం 35 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో ఇద్దరు మహిళలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారి లలిత తెలిపారు. 

బుచ్చెయ్యపేటలో ఒక పురుషుడికి కరోనా సోకింది.  

కోటవురట్ల మండలం జల్లూరులో ఒక రాజకీయ నేత(44)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు కె.వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీనివాసరాజు తెలిపారు.   


ఒకేరోజు ముగ్గురు మృతి!

అనకాపల్లి : అనకాపల్లిలో బుధవారం కరోనాతో ముగ్గురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. గొల్లవీధిలో వృద్ధురాలు (62), చినరాజుపేటలో మహిళ(38)కు మంగళవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో ఎన్టీఆర్‌ వైద్యాలయంలో చేర్చారు. వీరిద్దరూ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. అలాగే కూండ్రం గ్రామానికి చెందిన ఒక మహిళ (54) ఆయాసంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం బుధవారం ఎన్టీఆర్‌ వైద్యాలయంలో చేరింది. అయితే పరిస్థితి విషమించడంతో కొద్దిగంటల్లోనే మృతి చెందింది. తరువాత కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యిందని అధికారులు చెప్పారు. 


పాడేరులో కరోనాతో వృద్ధుడి మృతి

పాడేరు: స్థానిక ఐటీడీఏ కార్యాలయం వెనుక ఉన్న రేకులకాలనీ ప్రాంతంలో 80 ఏళ్ల వృద్ధుడు కరోనాతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఇతని కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారి నుంచి ఈయనకు వైరస్‌ సోకివుంటుందని భావిస్తున్నారు. చనిపోయిన తరువాత కరోనా పరీక్షలు నిర్వహించగా, వైరస్‌బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.


Updated Date - 2020-08-13T13:51:09+05:30 IST