Abn logo
May 17 2021 @ 00:30AM

కరోనా పంజా

- ఒకేరోజు 19 మంది మృతి

- లాక్‌డౌన్‌ విధించినా ప్రజల్లో నిర్లక్ష్యం

- సడలింపు సమయంలో గుంపులు గుంపులుగా సంచారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా పంజా విసురుతోంది. సెకండ్‌వేవ్‌లో వేగంగా వ్యాపించడమే కాకుండా సోకిన మొదటి మూడు, నాలుగు రోజుల్లోనే తీవ్రతరమై ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఆదివారం ఒకేరోజు జిల్లాలో 19 మంది ప్రాణాలను కరోనా బలిగొన్నది. లాక్‌డౌన్‌కు ముందే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడికక్కడ కట్టడివిధించుకొని మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఏమాత్రం అనుమానాలున్నా పరీక్షలకు వెళ్లడం లాంటి చర్యలతో కరోనాను కట్టడి చేస్తుండగా జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు ధరించకపోగా భౌతికదూరం అసలే పాటించడం లేదు. దీంతో నగరంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

- సడలింపు సమయంలో తీవ్ర నిర్లక్ష్యం

 ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా జిల్లా కేంద్రంలోని ప్రజలలో పెద్దగా మార్పు రాలేదు. నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాలు తీర్చుకోవడం కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇవ్వగా ఆ సమయంలో ఆటవిడపుగా వ్యవహరిస్తున్నారు. ఒకేరోజు వారానికో, పదిరోజులకో అవసరమైన సామాను, కూరగాయలు తీసుకుని వెళ్లి అత్యవసరాలకు మాత్రమే బయటకు రావాల్సి ఉండగా నాలుగు గంటలపాటు యథేచ్ఛగా సంచరిస్తున్నారు. దీంతో కూరగాయల మార్కెట్‌, గంజ్‌, ఇతర వ్యాపార కూడళ్లన్నీ రద్దీగా మారి, ట్రాఫిక్‌ జాం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 

-పాజిటివ్‌ కేసుల్లో సగానికి మించి జిల్లా కేంద్రంలోనే..

జిల్లా వ్యాప్తంగా వస్తున్న పాజిటివ్‌ కేసుల్లో సగానికి మించి కరీంనగర్‌లోనే ఉంటున్నాయి. నగరవాసుల్లో అత్యధికులు టెస్టులకు వెళ్లకుండా సీటీస్కాన్‌ ద్వారా నిర్ధారణ చేసుకొని మందులు వాడుతున్నారు. దీంతో అధికారికంగా వెల్లడవుతున్న పాజిటివ్‌ సంఖ్యకంటే పట్టణంలో రెండు, మూడింతల కేసులు నమోదవుతున్నాయని సమాచారం. ఆదివారం జిల్లాలో 19 మంది మరణించగా అందులో 10 మంది కరీంనగర్‌కు చెందినవారే. శనివారం ఆరుగురు మరణించగా అందులో ముగ్గురు కరీంనగర్‌కు చెందినవారే కావడం గమనార్హం. ఆదివారం నగరంలోని కిసాన్‌నగర్‌, భాగ్యనగర్‌, చంద్రపురికాలనీ, తీగలగుట్టపల్లి, సప్తగిరికాలనీ, మంకమ్మతోటలో ఒక్కొక్కరు, రాంనగర్‌లో ఇద్దరు చొప్పున మరణించారు. ఐదో డివిజన్‌లో తండ్రి, కూతుళ్లు కరోనాకు బలయ్యారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేటలో ఇద్దరు, గంగాధర మండలం నారాయణపూర్‌లో ఒక్కరు, వీణవంక మండలం ఎలుబాకలో ఒకరు, సైదాపూర్‌ మండలం జాగీరుపల్లిలో ఒకరు, మానకొండూర్‌ మండలంలో ఒకరు, జమ్మికుంట మండలంలో ముగ్గురు వైరస్‌ బారినపడి మరణించారు. 

- తగ్గిన టెస్టులు

ఆదివారమైనందువల్ల జిల్లావ్యాప్తంగా తక్కువ టెస్టులు నిర్వహించారు. ఏప్రిల్‌ రెండో వారం వరకు 2,500 నుంచి 3,500 టెస్టులు నిర్వహించగా మేలో క్రమేపీ వాటిని తగ్గిస్తూ సగటున 1,300 నుంచి 1,500 వరకు మాత్రమే చేస్తున్నారు. ఆదివారం 1,159 టెస్టులు మాత్రమే నిర్వహించగా అందులో 278 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నవారిలో సగటున 23.98 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. కరీంనగర్‌లో 374 ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 98 మందికి, మండలాల్లో 785 టెస్టులు నిర్వహించగా 180 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. 

లాక్‌డౌన్‌ ఈ నెలాఖరు వరకు కొనసాగించడంతోపాటు జిల్లా కేంద్రంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు సమయంలో పోలీస్‌, మున్సిపల్‌ తదితర అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. భౌతిక దూరం విషయంలో మాస్కు విషయంలో ఏమాత్రం ఉపేక్షించకుండా ఫైన్‌ విధించడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తే నిర్లక్ష్యంగా ఉండేవారు దారికి వస్తారని భావిస్తున్నారు. షాపుల వద్ద ప్రధానంగా గంజ్‌, కూరగాయల మార్కెట్ల వద్ద అధికారులు దృష్టిపెట్టి ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 


Advertisement
Advertisement