మరణాల ఉధృతి
ABN , First Publish Date - 2021-05-14T07:06:47+05:30 IST
కేసుల సంఖ్యపరంగా దేశంలో కరోనా ఉధృతి కాస్త నెమ్మదించినట్లే కనిపిస్తున్నా.. మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా రెండో రోజు వైర్‌సతో 4 వేలమంది పైగా చనిపోయారు..
మళ్లీ వరుసగా రెండో రోజూ 4 వేలకు పైనే..
దేశవ్యాప్తంగా 4,120 మంది మృతి
తగ్గుతున్న కేసులు.. 3.62 లక్షలు నమోదు
కలెక్టర్లతో 18, 20 తేదీల్లో మోదీ సమీక్ష
మహారాష్ట్రలో జూన్ 1 వరకు లాక్‌డౌన్
ఏపీ సహా 10 రాష్ట్రాల్లో 25% పైనే పాజిటివిటీ
ఢిల్లీలో 15% దిగువకు.. నెలలో అత్యల్పం
ఈనెల 3 నుంచి రికవరీ రేటు మెరుగు: కేంద్రం
న్యూఢిల్లీ, మే 13: కేసుల సంఖ్యపరంగా దేశంలో కరోనా ఉధృతి కాస్త నెమ్మదించినట్లే కనిపిస్తున్నా.. మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా రెండో రోజు వైర్‌సతో 4 వేలమంది పైగా చనిపోయారు. మొత్తమ్మీద గత 8 రోజుల్లో 4 సార్లు మరణాలు 4 వేలపైన నమోదయ్యాయి. రెండుసార్లు ఈ సంఖ్యకు దగ్గరగా వచ్చాయి. బుధవారం దేశంలో 3,62,727 మందికి వైరస్ నిర్ధారణ కాగా, 4,120 మంది చనిపోయారు. 3.52 లక్షల మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 2.37 కోట్లకు, మరణాలు 2.58 లక్షలకు పెరిగాయి. 1.97 కోట్ల మంది కోలుకున్నారు. క్రితం రోజుతో పోలిస్తే యాక్టివ్ కేసులు 6 వేలు పెరిగి.. 37.10 లక్షలకు చేరాయి.
బుధవారం 18.64 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో కేసులు తగ్గుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. రెండ్రోజుల క్రితం 18 రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి నెమ్మదించగా.. ఇప్పుడది 20కి పెరిగింది. రెండు వారాల్లో 187 జిల్లాల్లో పాజిటివ్‌లు తగ్గాయని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు లక్షపైనే ఉన్నట్లు వివరించింది. 8 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య ఉన్నట్లు తెలిపింది. 5.92 లక్షల యాక్టిక్ కేసులతో కర్ణాటక అగ్ర స్థానంలో ఉంది.
మహారాష్ట్రలో 5.48 లక్షలున్నాయి. 1.97 లక్షల యాక్టివ్ కేసులతో ఏపీ ఆరో స్థానంలో ఉంది. మరోవైపు 10 రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు 25పైగా నమోదవుతున్నట్లు కేంద్రం వివరించింది. ఈ జాబితాలో ఏపీ (25.3) 9వ స్థానంలో ఉంది. మూడు రోజులుగా కొత్త కేసుల సంఖ్య నిలకడగా ఉందని.. రికవరీలు పెరుగుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ నెల 6 నుంచి 12 తేదీల మధ్యలో 338 జిల్లాల్లో పాజిటివ్ రేటు తగ్గిందని స్పష్టం చేసింది. ఏప్రిల్ 22 నుంచి 28 మధ్య 125 జిల్లాల్లోనే పాజిటివ్ రేటు తగ్గుదల కనిపించిందని చెప్పింది.
మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను జూన్ 1వ తేదీ వరకు పొడిగించారు. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో.. రాష్ట్రానికి బస్సు, రైలు, విమానం సహా ఏవిధంగా వచ్చేవారికి 48 గంటలు ముందుగా చేయించుకున్న పరీక్ష తాలూకు నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేశారు. బిహార్‌లో శనివారంతో ముగియనున్న లాక్‌డౌన్ ఈ నెల 25వరకు పొడిగించారు. కరోనాతో పదుల సంఖ్యలో సిబ్బంది చనిపోయిన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని సీఎం యోగి సందర్శించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న బెంగళూరుకు చెందిన మహిళ ద్వారా 33 మందికి కరోనా సోకింది. ఈ మహిళ ఏప్రిల్ మొదటి వారంలో కుంభమేళాకు హాజరైంది.
ఢిల్లీలో పాజిటివ్ రేటు మరింత దిగువకు
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 10,489 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ రేటు 14.24గా ఉంది. ఏప్రిల్ 13 (13.1) తర్వాత ఇదే అత్యల్పం. అయితే, తాజాగా మరణాలు (308) మాత్రం అధికంగానే ఉన్నాయి. కాగా, ఆక్సిజన్ డిమాండ్ 700 టన్నుల నుంచి 580 టన్నులకు తగ్గిందని.. మిగులు ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ఇతర రాష్ట్రాలకు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కేంద్రాన్ని కోరారు. ఒకటీ లేదా రెండు ఆస్పత్రుల నుంచి మాత్రమే ఆక్సిజన్ కావాలంటూ ఎస్‌వోస్ సందేశం వస్తోందని తెలిపారు. రోజువారీ రోగులు తగ్గడంతో ఆస్పత్రుల్లో పడకలు సైతం అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.
కలెక్టర్లతో 18,20 తేదీల్లో మోదీ సమీక్ష
దేశంలో కరోనా తీవత్ర అధికంగా ఉన్న వంద జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ ఈ నెల 18, 20 తేదీల్లో సమీక్ష నిర్వహించనున్నారు. తొలుత 9 రాష్ట్రాల్లోని 46 జిల్లాల కలెక్టర్లతో, 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాల కలెక్టర్లతో తర్వాత మోదీ సమీక్షిస్తారు. ఇందులో ఆయా రాష్ట్రాల సీఎంలూ పాల్గొంటారు. కాగా, కరోనా ప్రారంభమయ్యాక.. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని పలుసార్లు సమావేశమయ్యారు. అయితే, జిల్లాల కలెక్టర్లతో నేరుగా సమీక్షించనుండటం ఇదే తొలిసారి.
గంగలో మృతదేహాలు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
గంగానదిలో మృతదేహాలు కొట్టుకొస్తుండటంపై ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఏం చర్యలు తీసుకున్నారో 4 వారాల్లో చెప్పాలని కోరింది. కాగా, ఇదే ఘటనపై యూపీ సీఎం యోగి.. సమీక్ష నిర్వహించారు. మృతదేహాలను గంగలో వదిలేయడం కాలుష్యానికి దారితీస్తుందన్నారు. మరోవైపు యూపీలోని ఉన్నావ్ జిల్లాలో నది ఇసుకలో మృతదేహాలు కూరుకుపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.