కరోనా హైరానా

ABN , First Publish Date - 2022-01-20T06:07:00+05:30 IST

జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజు వందలాది మంది వైరస్‌ బారినపడుతున్నారు.

కరోనా హైరానా

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

24 గంటల్లో 1,827 నమోదు

49.33 శాతం పాజిటివిటీ

జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వేలాది మంది

పరీక్షలకు దూరం

కొవిడ్‌గానే భావించి చికిత్స తీసుకుంటున్న అత్యధికులు  


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజు వందలాది మంది వైరస్‌ బారినపడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 3,704 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 1,827 మంది (49.33 శాతం పాజిటివిటి)కి పాజిటివ్‌ వచ్చింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,69,533కు సంఖ్య చేరింది. ఇందులో 1,59,084 మంది కోలుకోగా, మరో 7,508 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం పాజిటివ్‌గా నిర్ధారింపబడిన 1,827 మందిలో 1,768 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండగా, 59 మంది ఆస్పత్రులలో చేరారు. 


నెలాఖరు నాటికి తారస్థాయికి..

కొవిడ్‌ వైరస్‌ విజృంభణ మరికొంతకాలం కొనసాగే అవకాశం వున్నదని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి తారస్థాయికి చేరుకోవచ్చునంటున్నారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ఆరు వేలకు పెంచితే రోజువారీ పాజిటివ్‌ కేసులు రానున్న రోజుల్లో మూడు వేలు పైబడి నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రస్తుతం వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న చాలామంది కొవిడ్‌ పరీక్షలకు దూరంగా ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది.


వందలాది మందిలో లక్షణాలు

జలుబు, దగ్గు, జ్వరం...ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కొద్దిరోజులుగా భారీగా పెరిగింది. నగరం, గ్రామీణ ప్రాంతం, ఏజెన్సీ అనే తేడా లేకుండా అన్నిచోట్ల ఇంటికి ఒకరిద్దరు ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు.  అయితే రూరల్‌లో అత్యధికులు గ్రామీణ వైద్యులిచ్చే మందులతోనే సరిపెట్టుకుంటుండగా, కొంతమంది నేరుగా మెడికల్‌ దుకాణాలకు వెళ్లి లక్షణాలను బట్టి మందులను తెచ్చుకుంటున్నారు. నగర పరిధిలో ప్రైవేటు క్లీనిక్‌లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌, కేజీహెచ్‌కు ఈ తరహా లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. తమ వద్దకు రోజుకు 50 మంది 150 మంది వరకు ఈ లక్షణాలతో వస్తున్నట్టు పలువురు వైద్యులు చెబుతున్నారు.


కొవిడ్‌ పరీక్షలకు దూరం

జలుబు, దగ్గు, జ్వరం  లక్షణాలతో బాధపడుతున్న చాలా మంది కొవిడ్‌ పరీక్షలకు  దూరంగా ఉంటున్నారు. ఈ లక్షణాలు కొవిడ్‌కు సంబంధించినవే కావడంతో పరీక్ష చేయించుకుంటే ఎక్కడ పాజిటివ్‌ వస్తుందోననే ఉద్దేశంతో చాలామంది ఆసక్తి చూపించడం లేదు. కొవిడ్‌ పాజిటివ్‌గానే భావించి చికిత్స చేయించుకుంటున్నారు.  


మూడు రోజులే జ్వరం...

అత్యధికులకు జ్వరం రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అది కూడా పగటిపూట స్వల్పంగా, రాత్రి ఎక్కువగా ఉంటోంది. రెండు రోజుల తరువాత జ్వరం తగ్గుముఖం పట్టినప్పటికీ జలుబు, దగ్గు వారం రోజుల పాటు వేధిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కొందరిలో అయితే దగ్గుతోపాటు గొంతు గరగర, మంట ఉంటున్నాయి. చిన్నారుల్లో దగ్గు, జలుబు, కపం కనిపిస్తున్నాయి.


కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

డాక్టర్‌ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి

జిల్లాలో కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. కేసులకు అనుగుణంగా ఆస్పత్రులను సిద్ధం చేశాం. కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌, ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గతంతో పోలిస్తే కొంత తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రజలెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం ద్వారా వైరస్‌ మహమ్మరిని అడ్డుకునే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-20T06:07:00+05:30 IST