బ్రిటన్‌-భారత్‌ విమానాల రద్దు

ABN , First Publish Date - 2020-12-22T08:49:01+05:30 IST

బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్‌ (వీయూఐ 202012/01) కలకలం నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి యూకేకు విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి...

బ్రిటన్‌-భారత్‌ విమానాల రద్దు

బ్రిటన్‌-భారత్‌ విమానాల రద్దు

మంగళవారం అర్థరాత్రి నుంచి 31 వరకు నిలిపివేత.. వచ్చేవారికి విమానాశ్రయాల్లో టెస్టులు

పరిశీలనలో ఇతర దేశాల నుంచి రాకపోకల రద్దు!

ఇటలీ, ఆస్ట్రేలియాకూ కరోనా కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి

పాజిటివ్‌ వస్తే ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌: పురి

నెగెటివ్‌ వచ్చినా 7 రోజులు హోం క్వారంటైన్‌

అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దన్న హర్షవర్ధన్‌

మహారాష్ట్ర పట్టణాల్లో 5వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ


న్యూఢిల్లీ, లండన్‌, డిసెంబరు 21: బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్‌ (వీయూఐ 202012/01) కలకలం నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి యూకేకు విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు భారత పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అక్కడినుంచి మంగళవారం అర్థరాత్రి వరకు భారత్‌ చేరుకున్న ప్రయాణికులు విమానాశ్రయాల్లో కచ్చితంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. పాజిటివ్‌ వచ్చినవారిని రాష్ట్రాల్లో ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌కు పంపుతామని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. నెగెటివ్‌ వచ్చినవారు వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఇతర దేశాల్లోనూ కొత్త స్ట్రెయిన్‌ ప్రభావం ఉన్నట్లు తెలిస్తే.. వాటికీ విమానాలను రద్దు చేస్తామని పురి తెలిపారు. మరోవైపు భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. తాజా పరిణామాలతో రాష్ట్రంలోని పట్టణాల్లో మంగళవారం నుంచి జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే  ఆదేశాలిచ్చారు. యూకే, మధ్య తూర్పు దేశాల నుంచి వచ్చేవారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపనున్నారు. 


ఆస్ట్రేలియా, ఇటలీలో కొత్త స్ట్రెయిన్‌

కొత్త స్ట్రెయిన్‌ ఇతర దేశాలకూ పాకినట్లు స్పష్టమవుతోంది. యూకే నుంచి డెన్మార్క్‌, ఆస్ట్రేలియా, ఇటలీ వెళ్లిన వారిలో  కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు. రెండో దశలో కేసులు, మరణాల పెరుగుదలకు కొత్త స్ట్రెయినే కారణమని దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. యూకే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, విమానాల రద్దు అంశం తమ పరిశీలనలో లేదన్నారు. 


విమానాల రద్దు బాటలో..

బ్రిటన్‌తో సరిహద్దులను ఫ్రాన్స్‌ మూసివేసింది. ఫ్రాన్స్‌, ఇటలీ, డెన్మార్క్‌, బల్గేరియా, ఐరిష్‌ రిపబ్లిక్‌, టర్కీ, కెనడా, హాంకాంగ్‌ విమానాలు రద్దు చేసుకోగా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌, క్రొయేషియా, అర్జెంటీనా, చిలీ, మొరాకో, కువైట్‌ ఆంక్షలు విధించాయి. రష్యా సోమవారం అర్థరాత్రి నుంచి వారం పాటు విమానాలను రద్దు చేసింది. 48 గంటల పాటు సర్వీసులను ఆపనున్నట్లు నార్వే ప్రకటించింది. సౌదీ అరేబియా ఏకంగా అన్ని అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులను వారం రోజులు రద్దు చేసింది. నౌకాశ్రయాలనూ మూసివేయనుంది. దేశంలో పరిస్థితిని సమీక్షించేందుకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం అత్యవసర కమిటీ సమావేశం నిర్వహించారు పరస్పర సమన్వయం కోసం యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సభ్య దేశాలు బ్రస్సెల్స్‌లో సమావేశం కానున్నాయి. కొత్త స్ట్రెయిన్‌ ప్రధానంగా లండన్‌, దక్షిణ ఇంగ్లాండ్‌లో కేంద్రీకృతమైంది. దీని ‘ఆర్‌’ నంబర్‌ (ఒకరి నుంచి ఎంతమందికి వ్యాపిస్తుందనే లెక్క) 0.4 నుంచి 0.9 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  


కొత్త స్ట్రెయిన్‌కూ టీకాతో చెక్‌

కొత్త స్ట్రెయిన్‌గా రూపాంతరం చెందుతూ, కరోనా ఎంత కొమ్ములు తిరిగినా.. టీకా దానిని సమర్థంగా నిరోఽధిస్తుందని, ఈ విషయంలో అపోహలు అవసరం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈయూ మెడిసిన్‌ రెగ్యులేటర్‌ చీఫ్‌ ఎమెర్‌ కుక్‌ సోమవారం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త స్ట్రెయిన్‌ను టీకా ఎదుర్కొనలేదనేందుకు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవని ఆమె అన్నారు. మరోవైపు కొత్త స్ట్రెయిన్‌ను ఫైజర్‌ టీకా సమర్థవంతంగా నిరోధించగలదని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్‌ స్పాన్‌ వ్యాఖ్యానించారు. స్పుత్నిక్‌-వి టీకా సైతం మరింత ప్రభావితంగా పనిచేస్తుందని.. ఇతర ఉత్పరివర్తనాలపై ఇప్పటికే ఇది నిరూపితమైందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రెవ్‌ పేర్కొన్నారు. కాగా టీకాలు కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనలేవని చెప్పలేమని అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు సర్జన్‌ జనరల్‌గా నియమితులు కానున్న ప్రవాస భారతీయుడు డాక్టర్‌ వివేక్‌ మూర్తి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-22T08:49:01+05:30 IST