కరోనా సంబంధిత సమాచారానికి ఒకే ఒక్క క్లిక్‌..!

ABN , First Publish Date - 2021-05-08T05:59:25+05:30 IST

కరోనా వచ్చిందన్న అనుమానం ఉందా

కరోనా సంబంధిత సమాచారానికి  ఒకే ఒక్క క్లిక్‌..!

ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సైబరాబాద్‌ సీపీ

ఏడు రోజుల్లో 70 వేల మంది సందర్శన

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : కరోనా వచ్చిందన్న అనుమానం ఉందా..? పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలి, ఐసోలేషన్‌ కేంద్రాలు ఎక్కడున్నాయి, అత్యవసర పరిస్థితి వస్తే ఏ ఆస్పత్రికి వెళ్తే మంచిది, బెడ్స్‌ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్‌ అవసరమైతే ఎవరిని సంప్రదించాలి, ఫుడ్‌  అందించేవారున్నారా, క్వారంటైన్‌లో ఉన్న వారికి ఆరోగ్యంపై అనుమానాలు ఉంటే ఎవరిని అడగాలి.. ఇటువంటి మొత్తం సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండేలా సైబరాబాద్‌ పోలీసులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా బాధితులకు అవసరమైన సమస్త సమాచారం, సేవల వివరాలను అందుబాటులోకి తెచ్చారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో వారం రోజుల క్రితం covid.scsc.in అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. వన్‌ స్టాప్‌ షాప్‌ ఫర్‌ ఆల్‌ కొవిడ్‌ రిలేటెడ్‌ సర్వీసెస్‌ అనే ట్యాగ్‌లైన్‌తో సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 70 వేల మంది ఈ సైట్‌ను వీక్షించి కరోనాకు సంబంధించిన సమాచారం పొందినట్లు వారు పేర్కొన్నారు. 


ఎస్సీఎస్సీకి అభినందనలు

 - సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ.

కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ)కు అభినందనలు. ప్రజలకు నాణ్యమైన(క్వాలిటీ  సర్వీసులు) సేవలను అందించే వారి వివరాలను పొందుపర్చడం గొప్ప విషయం. అద్భుతమై వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసి, క్వాలిటీ ఇన్ఫర్మేషన్‌ను అప్‌లోడ్‌ చేస్తున్న ఎస్సీఎస్సీ టీమ్‌ను, జనరల్‌ సెక్రటరీ కృష్ణ ఏదులను, వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తున్న ప్రత్యూష శర్మను అభినందిస్తున్నాను.


ఒకటికి పదిసార్లు చెక్‌ చేస్తున్నాం

- కృష్ణ ఏదుల, జనరల్‌ సెక్రటరీ, ఎస్సీఎస్సీ.

కరోనాకు సంబంధించిన క్రిటికల్‌ కేర్‌, సెల్ఫ్‌కేర్‌ సర్వీసులతో పాటు ప్రివెంటివ్‌ కేర్‌ సర్వీసెస్‌, ఇతర రిలవెంట్‌ సమాచారం వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నాం. నాణ్యమైన, కచ్చితమైన సేవలు అందించే సర్వీస్‌ ప్రొవైడర్‌ల సమాచారం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాం. 9 మందితో కూడిన టీమ్‌ ఇందుకోసం పని చేస్తోంది. ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకున్న తర్వాతే ఆ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాం. చాలా మంది ప్లాస్మా, ఆక్సిజన్‌, మెడిసిన్‌, బెడ్స్‌, అంబులెన్స్‌ సేవలను తమ వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచారం ద్వారానే పొందుతున్నారు. 

Updated Date - 2021-05-08T05:59:25+05:30 IST