మళ్లీ వణికిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-17T06:36:00+05:30 IST

కరోనా మళ్లీ వణికిస్తోంది. జిల్లాలో మరోమారు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

మళ్లీ వణికిస్తున్న కరోనా

- జిల్లాలో వారం రోజుల్లో 83 పాజిటివ్‌ కేసులు

- మరోవైపు వేగంగా వ్యాక్సినేషన్‌

జగిత్యాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కరోనా మళ్లీ వణికిస్తోంది. జిల్లాలో మరోమారు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. సుమారు నాలుగు నెలల పాటు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  

- వారం రోజులుగా పెరుగుదల..

 జిల్లాలో వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా సగటున 5 నుంచి 10 కేసులు నమోదు అవుతుండేవి. ప్రస్తుతం  వారం రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. వారం రోజుల్లో జిల్లాలో 83 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈనెల 9వ తేదిన నాలుగు పాజిటివ్‌ కేసులు, 10వ తేదీన ఎనిమిది, 11వ తేదిన 12 పాజిటివ్‌ కేసులు, 12వ తేదిన ఎనిమిది కేసులు, 13వ తేదీన 19 కేసులు, 14వ తేదీన 20 కేసులు, 15వ తేదిన 12 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ప్రధానంగా నాలుగు, ఐదు రోజులుగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కరోనా బాధితుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చినప్పుడు, కార్యాలయాలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కొవిడ్‌ వ్యాప్తి చెందుతుందని వైద్య వర్గాలు అంటున్నాయి.

- జోరుగా వ్యాక్సినేషన్‌..

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో 18 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకు మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను 101 శాతం పూర్తి చేశారు. జిల్లాలో 7,58,727 మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ వేయాలన్న లక్ష్యానికి గాను ఇప్పటివరకు 7,65,380 మందికి వ్యాక్సినేషన్‌ పంపిణీ చేశారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు మొదటి డోసు వ్యాక్సినేషన్‌ అందించడంలో జగిత్యాల జిల్లా 23వ స్థానంలో ఉంది. కాగా జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు రెండో డోసు వ్యాక్సినేషన్‌ను వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు 72 శాతం పూర్తి చేశారు. జగిత్యాల జిల్లాలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ను 7,58,727 మందికి అందించాలన్న లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 5,46,254 మందికి పంపిణీ చేశారు. రెండో డోసు వ్యాక్సినేషన్‌లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా 16వ స్థానంలో ఉంది. 

- టీనేజర్లకు కొనసాగుతున్న టీకా..

ప్రభుత్వ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు గల యువతీ, యువకులకు సైతం మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను అందిస్తున్నారు. జిల్లాలో 48,781 మంది టీనేజర్లకు వ్యాక్సిన్‌ అందించాలన్న లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 20,139 మందికి అందించి 41 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొంటున్న వృద్ధులకు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోసు టీకాను సైతం అందిస్తున్నారు. 

- కలవరపెడుతున్న ఒమైక్రాన్‌...

జిల్లాలో ఒమైక్రాన్‌ సైతం కలవరపెడుతోంది. జిల్లాలో ఇప్పటికే ఇరువురికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇటీవల జిల్లాలోని మెట్‌పల్లి పట్టణంలో ఒకరికి, మల్లాపూర్‌ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఒకరికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ వీరిరువుని హైద్రాబాద్‌లోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఇరువురు కోలుకున్నప్పటికీ ముప్పు పొంచి ఉన్నట్లయింది. కలెక్టర్‌ గుగులోతు రవి కరోనా వ్యాప్తి నివారణపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆసుపత్రులను సందర్శించడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తుండడం వంటివి చేస్తూ అధికారుల పనితీరును మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారు.

- పొంచి ఉన్న ముంబాయి, విదేశీ ముప్పు..

జిల్లాకు మహారాష్ట్రలోని ముంబాయి, పుణేలతో పాటు విదేశీ ముప్పు సైతం పొంచి ఉంది. విద్యా, ఉపాధి అవసరాల కోసం జగిత్యాల జిల్లా నుంచి వేల సంఖ్యలో మహారాష్ట్రలోని ముంబాయికి, విదేశాలకు వెళ్లి వస్తున్నారు. ముంబాయిలో దశాబ్దాల తరబడి జిల్లాకు చెందిన పలు కుటుంబాలు నివాసముంటున్నాయి. జిల్లా వాసులతో పలు సంబంధాలను కలిగిఉన్నారు. దీంతో మహారాష్ట్రకు జగిత్యాలకు ప్రతీ నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు జరుగుతున్నాయి. అదేవిధంగా అమెరికా, సింగాపూర్‌, కెనడా, సౌది అరేబియా, దుబాయి, దోహా ఖతార్‌, షార్జా తదితర దేశాలకు విద్యా, ఉపాధి అవసరాలకు పలువురు వ్యక్తులు వందల సంఖ్యలో వెళ్లారు. అక్కడ నెలకొన్న కరోనా పరిస్థితులు, ఇతర కారణాల కారణంగా సంబంధిత వ్యక్తులు జగిత్యాల జిల్లాకు వస్తుండడంతో కరోనా వ్యాప్తి జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా గుర్తించిన ఇరువురు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారు కావడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. 



Updated Date - 2022-01-17T06:36:00+05:30 IST