నిబంధనలు పాటిద్దాం.. ‘కరోనా’ను జయిద్దాం

ABN , First Publish Date - 2020-04-04T12:27:24+05:30 IST

నిబంధనలు పాటిద్దాం.. ‘కరోనా’ను జయిద్దాం

నిబంధనలు పాటిద్దాం..  ‘కరోనా’ను జయిద్దాం

చెన్నై: కఠిన నిబంధనలు పాటించి ‘కరోనా’ మహమ్మారిని జయిద్దామని ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే తరఫున తేని జిల్లాలో 4,346 మంది అసంఘటి రంగ కార్మికులకు తలా రూ.1,000 నగదును డిప్యూటీ సీఎం అందజేశారు. అలాగే, డిప్యూటీ సీఎం కుమారుడు, ఎంపీ రవీంధ్రనాథ్‌ కుమార్‌ తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి వ్యయంతో కొనుగోలు చేసిన 8 వెంటిలేటర్లను తేని జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఎంపీ, ఉన్నతాధికారులతో ప్రభుత్వాసుపత్రి పరిశీలించారు. రోగులకు అందిస్తున్న చికిత్స, మందుల నిల్వలు తదితరాలను ఓపీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రులకు అవసరమైన మందులు, పరికరాలను కొరత లేకుండా నిల్వ ఉంచాలని, కరోనా ప్రత్యేక విధుల్లో పాల్గొంటున్న వైద్యులు, నర్సులు, సిబ్బందికి గ్లౌజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లను ఎప్పటికప్పుడు అందించాలని ఆసుపత్రి సూపరింటెండ్‌కు ఓపీఎస్‌ సూచించారు. ఉపాధి కోసం జిల్లాకు వచ్చి స్థిరపడిన అసంఘటిత రంగ కార్మికుల వివరాలను సేకరించి, వారికి ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, చక్కెర, నూనె, పప్పు తదితర నిత్యావసరాలు  అందేలా చర్యలు చేపట్టాలని, కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదుచేసుకున్న వారికి సరుకులు అందించేందుకు టోకెన్లు అందజేసే సమయంలోనే రూ.1,000 నగదు అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేలా పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని, వారి సేవలను ప్రజలు ఎన్నడూ మరువలేరన్నారు.వారి సంక్షేమానికి అవసరమైన చర్యలతో పాటు విధుల్లో వారికి అవసరమైన భద్రతా పరికరాలు అందజేయాలని కలెక్టర్‌ను ఓపీఎస్‌ ఆదేశించారు. ఒక కులం వల్లనో, మతం వల్లనో ‘కరోనా’ వ్యాపించదని, ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో ఒక మతం ద్వారా కరోనా వ్యాపిస్తుందనే వార్తలు పూర్తిగా అసత్యమన్నారు. అందరు నిబంధనలను కఠినంగా పాటించి కరోనాను జయిద్దామని ఓపీఎస్‌ సూచించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్రప్రజలు అందరు  ఆదివారం రాత్రి 9 గంటలకు తమ ఇళ్లలో లైట్లన్నీ ఆర్పివేసి, ఇళ్ల ముందు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి 9 నిముషాలు సంఘీభావం పాటించాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-04T12:27:24+05:30 IST