హడలెత్తిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ జిల్లాను హడలెత్తిస్తోంది.

హడలెత్తిస్తున్న కరోనా
మాస్క్‌ ధరించని దుకాణం యజమానికి జరిమానా విధిస్తున్న పోలీసు (ఫైల్‌)

- జిల్లాలో రోజూ 250 దాటుతున్న కేసులు

- జిల్లా కేంద్రంలోనే ఎక్కువ మంది బాధితులు

- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలు

గద్వాలక్రైం, మే 5 : కరోనా వైరస్‌ జిల్లాను హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ 250కిపైగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలోనే ఎక్కువ కేసులు నమోదవు తుండడం గమనార్హం. పట్టణంలో ప్రతి రోజూ 70 నుంచి 80 మంది వరకు వైరస్‌ బారిన పడుతున్నారు. అందుకు ప్రజల నిర్లక్ష్యం కూడా ప్రధానకారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో కరోనాపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. అయినా జనంలో మార్పు రావడం లేదు. ఈ విషయంపై పోలీసు అధికారులు సీరియస్‌గా వ్యవహరించాలన్న సూచనలు వస్తున్నాయి. 


నిబంధనలను పట్టించుకోని జనం

కరోనా సెకండ్‌వేవ్‌ ఎంతో ఉధృతంగా వ్యాపిస్తున్నా ప్రజలు నిర్లక్ష్య ధోరణిని వీడడం లేదు. గద్వాల పట్టణంలోని పలుదుకాణాలు, వైన్‌షాపుల వద్ద జనం గుమిగూడుతూనే ఉన్నారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్న వారి సంఖ్య కూడా తక్కువ లేదు. ఎవరికి వారు తమకు కరోనా రాదులే అన్న మూర్ఖభావనతో బయట దర్జాగా తిరుగుతున్నారు. దీంతో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 


ప్రజల్లో అవగాహన రావాలి

కరోనా కేసులు తగ్గాలంటే మొదట ప్రజల్లో అవగాహన రావాలని డీఎంహెచ్‌వో చందూనాయక్‌ తెలిపారు. ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలను తప్పని సరిగా పాటిస్తేనే కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. అత్యవసరం అయితేనే ఎవరైనా బయటకు రావాలని ప్రజలకు సూచించారు. 



Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST