ఫోన్‌ స్ర్కీన్‌.. కరోనాకు అడ్డా !

ABN , First Publish Date - 2021-02-23T08:03:19+05:30 IST

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కుస్రావాల నుంచి వెలువడే తుంపర్లు ఇతర గ్లాస్‌ పరికరాల కంటే ఫోన్‌ స్ర్కీన్‌లపై మూడురెట్లు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -హైదరాబాద్‌ (ఐఐటీ- హెచ్‌) శాస్త్రవేత్తలు...

ఫోన్‌ స్ర్కీన్‌.. కరోనాకు అడ్డా !

  • ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి


దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కుస్రావాల నుంచి వెలువడే తుంపర్లు ఇతర గ్లాస్‌ పరికరాల కంటే ఫోన్‌ స్ర్కీన్‌లపై మూడురెట్లు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -హైదరాబాద్‌  (ఐఐటీ- హెచ్‌) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫోన్‌ స్ర్కీన్‌ మీద తడి అయితే త్వరగా ఆరదని, అందుకే దానిపైకి చేరే వైర్‌సతో కూడిన నీటి తుంపర్లు ఎక్కువ సేపు ఉంటాయని తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో ఇవి ఆరిపోయేందుకు దాదాపు గంట సమయం పడుతుందని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణ ఉష్ణోగ్రత, చల్లటి వాతావరణం, ఉపరితల స్వభావం, పరిమాణం ఆధారగా తుంపర్లలో ఉండే వైరస్‌ ఎంతసేపు జీ వించి ఉంటుందనేది నిర్ధారించవచ్చన్నారు.  తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్‌ తెరలపై తుంపర్లు ఎక్కువసేపు నిలిచి ఉంటాయి. ఈ సమయంలో వాటిలోని వైరస్‌ కూడా సజీవంగానే ఉంటుంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్‌లు ఉపయోగిస్తున్నప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. అప్పుడు ఫోన్‌  స్ర్కీన్‌లపై పడే తుంపర్లలోని వైరస్‌ ఎక్కువసేపు జీవిస్తుంది. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. కరోనా సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లలో ఉప్పు, వైర్‌సప్రొటీన్‌, నీరు, ఉపరితల పీడనాన్ని నియంత్రించే ద్రవాలు ఉంటాయని రాయల్‌ సొసైటీ అధ్యయనంలో తేలింది. వైరల్‌ తుంపర్లలో ఉండే ఈ పదార్థాల వల్లే సాధారణ నీటి తుపర్లతో పోలిస్తే అవి ఎక్కువ సేపు ఆరిపోకుండా ఉంటున్నాయని ఐఐటీ- హెచ్‌ మెకానికల్‌, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ శరవణన్‌ బాలుసామి, డాక్టర్‌ సాయక్‌ బెనర్జీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కృతి చంద్ర సాహు పరిశోధనల్లో వెల్లడైంది. ఈవివరాలు ‘ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ హీట్‌ అండ్‌ మాస్‌ ట్రాన్స్‌ఫర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

- స్పెషల్‌ డెస్క్‌


కూలర్లు, ఫ్యాన్లతోనూ ముప్పు

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వివిధ పరిమాణాల్లో తుంపర్లు బయటకు వస్తాయి. ఒక నానోలీటర్‌ పరిమాణం ఉన్న తుంపర ఒక నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఆరిపోతుంది. 10 నానోలీటర్ల పరిమాణం ఉన్న బిందువు ఆరిపోయేందుకు 50శాతం చల్లదనం ఉన్న వాతావరణంలో 15 నిమిషాలు పడుతుంది. అదే 90శాతం చల్లటి వాతావరణంలో తుంపర బిందువులు ఆరేందుకు గంట సమయం అవసరం. చల్లటి వాతావరణంలో వైరస్‌ ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి.  

- ప్రొఫెసర్‌ కృతి చంద్ర సాహు, 

కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఐఐటీ హైదరాబాద్‌


Updated Date - 2021-02-23T08:03:19+05:30 IST