కరోనా కోరల్లో స్పెయిన్‌

ABN , First Publish Date - 2020-03-29T07:45:58+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరణాలు 30 వేలు దాటాయి. ఒక్క ఇటలీలోనే శనివారం నాటికి 10 వేల మంది చనిపోయారు. యూరప్‌ ఖండంలోని ఒక్కో దేశాన్ని కబలిస్తున్న వైరస్‌ స్పెయిన్‌లోనూ విలయం సృష్టిస్తోంది.

కరోనా కోరల్లో స్పెయిన్‌

ఒక్క రోజు వ్యవధిలో 832 మంది మృతి

ఇటలీ తర్వాత అధికం.. ఫ్రాన్స్‌లోనూ దారుణ పరిస్థితి

వణుకుతున్న బ్రిటన్‌.. 6 లక్షలకు చేరిన పాజిటివ్‌లు

30 వేలు దాటిన మృతులు

ఒక్క ఇటలీలోనే 10 వేల మందిపైగా.. 

 స్పెయిన్‌లోనూ మృత్యు ఘోష


మాడ్రిడ్‌, న్యూయార్క్‌, లండన్‌, మార్చి 28: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరణాలు 30 వేలు దాటాయి. ఒక్క ఇటలీలోనే శనివారం నాటికి 10 వేల మంది చనిపోయారు. యూరప్‌ ఖండంలోని ఒక్కో దేశాన్ని కబలిస్తున్న వైరస్‌ స్పెయిన్‌లోనూ విలయం సృష్టిస్తోంది. శనివారం ఆ దేశంలో అత్యధికంగా 832 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. 9 వేల మందిపైగా ఆరోగ్య కార్యకర్తలు సైతం వైర్‌సకు గురయ్యారు. ఫ్రాన్స్‌లోనూ రోజుకు 300 మంది కొవిడ్‌కు బలవుతున్నారు. ఇటలీలో  పాజిటివ్‌ కేసులుగా తేలినవారిలో 10.5ు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రముఖులు సైతం వైర్‌సకు గురవుతుండటంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో భారీఎత్తున పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో 260 మరణాలు నమోదయ్యాయి. ఆసియాలో కరోనాతో కల్లోలమైన ఇరాన్‌లో మరో 139 మంది చనిపోయారు. పాకిస్థాన్‌లో కేసులు 1400 దాటాయి. 11 మంది మృతిచెందారు. 


అమెరికాలో సురక్షణ సాధనాల కొరత

అమెరికాలో పాజిటివ్‌ కేసులు 1,04,277కు చేరాయి. న్యూ ఒర్లీన్స్‌, చికాగో, డెట్రాయిట్‌లనూ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. న్యూ ఒర్లీన్స్‌లో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ను తాత్కాలిక ఆసుపత్రిగా మార్చేశారు. కరో నా ఉధృతంగా ఉన్న న్యూయార్క్‌ వంటి చోట్ల వైద్య సిబ్బంది తీరిక లేకుండా పనిచేస్తున్నారు. అయితే, తమకు రక్షణ కల్పించే సామగ్రి కొరత ఉండటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సాయం అం దిస్తున్న ఓనర్సు(48) చనిపోవడంతో వారిలో భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ప్రఖ్యాత సింగర్‌ జొ డిఫీ(61)కి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కరోనా జన్మస్థామైన హుబెయ్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం ప్రజలు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న జియాంగ్జి ప్రావిన్స్‌కు వెళ్తుండగా పోలీసులు వాహనాలను నిలిపివేశారు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు దాడికి దిగారు.  


యూఏఈలో ప్రార్థనలన్నీ ఆన్‌లైన్‌లోనే..

కరోనా నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో మతపరమైన దైనందిన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. దీంతో మసీదులు, చర్చిలు, ఆలయాల వర్గాలు ప్రజలను చేరుకునేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నాయి. ప్రార్థనలు, పూజలను ఆన్‌లైన్‌లోనే వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ముస్లింలకు వర్చువల్‌ రూపంలో తరగతులు నిర్వహిస్తుండగా, క్రైస్తవులకు చర్చి కార్యకలాపాల లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇస్తున్నారు. హిందువుల వార పూజలను వెబ్‌ కాస్టింగ్‌ చేస్తున్నారు. 


నడి సంద్రంలో ప్రాణాలు

కరోనాతో ప్రజల ప్రాణాలు నడి సంద్రంలోని నావలా మారుతున్నాయి. దీనికి నిదర్శనమే నెదర్లాండ్స్‌కు చెందిన ఓ నౌక ఉదంతం. హాలెండ్‌ అమెరికా లైన్‌ సంస్థకు చెందిన జాన్‌దామ్‌ నౌక 1,800 మంది ప్రయాణికులతో ఈ నెల 7న అర్జెంటీనాలోని బ్యూన్‌సఎయిర్స్‌ నుంచి బయల్దేరింది. చిలీలోని శాన్‌ ఆంటోనియాకు చేరాల్సి ఉంది. ఈలోగా నౌకలోని 42 మందిలో ఫ్లూ లక్షణాలు కనిపించడంతో చాలా పోర్టులు బోర్డింగ్‌కు నిరాకరించాయి. పనామా కాల్వ దాటి అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్దామంటే అనుమతి రాలేదు. ప్రస్తుతం పనామా దేశ పరిధిలోని నదీ జలాల్లో ఉండగా.. శుక్రవారం నలుగురు ప్రయాణికులు చనిపోయారు. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు అందించేందుకు వైద్య సామగ్రితో కూడిన మరో నౌకను హాలెండ్‌ అమెరికా లైన్‌ సంస్థ పంపుతోంది.

Updated Date - 2020-03-29T07:45:58+05:30 IST