యువత నిర్లక్ష్యం వల్లే వ్యాప్తి... దశాబ్దాల పాటు కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-08-01T08:47:48+05:30 IST

యువత నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తిని పెంచుతోందని, చాలా దేశాల్లో వారే వ్యాప్తిని నిర్దేశిస్తున్నారని

యువత నిర్లక్ష్యం వల్లే వ్యాప్తి... దశాబ్దాల పాటు కరోనా ప్రభావం

అలసత్వం వీడకుంటే పెనుముప్పే: డబ్ల్యూహెచ్‌వో


జనీవా, జూలై 31: యువత నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తిని పెంచుతోందని, చాలా దేశాల్లో వారే వ్యాప్తిని నిర్దేశిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. వారు ఇకనైనా అలసత్వం వీడి జాగ్రత్తగా వ్యవహరించకుంటే పెనుముప్పు తప్పదని హెచ్చరించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన వర్చువల్‌ న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అఢనోమ్‌ ఘేబ్రియేసస్‌ మాట్లాడారు. ‘‘కరోనా.. ముసలివాళ్లకు, ఇతర జబ్బులతో బాధపడే వాళ్లకు మాత్రమే కాదు.. యువతకు కూడా ప్రాణాంతకమే. వారేమీ అజేయులు కారు. వారికీ ముప్పు పొంచి ఉంది’’ అని వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిలో నైట్‌క్లబ్‌ల పాత్ర అధికమన్నారు.


ఇదిలా ఉంటే... శతాబ్దానికి ఒకసారి మానవాళిని పట్టి కుదిపే ఇటువంటి ప్రాణాంతక వైరస్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ఘేబ్రియేసస్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలోని అత్యవసర విభాగ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోటిన్నరకు పైగా ప్రజలు కరోనా బారిన పడగా... దాదాపు ఆరున్నర లక్షలమందికిపైగా ఈ వైరస్‌కు బలైపోయిన నేపథ్యంలో దీని ప్రభావాన్ని తక్కువ అంచనా వేయరాదన్నారు.

Updated Date - 2020-08-01T08:47:48+05:30 IST