విశ్వకీర్తి

ABN , First Publish Date - 2021-07-28T08:49:34+05:30 IST

కాకతీయుల శిల్పకళావైభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వసంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు, తెలుగువారందరికీ గర్వకారణం...

విశ్వకీర్తి

కాకతీయుల శిల్పకళావైభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వసంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు, తెలుగువారందరికీ గర్వకారణం. తెలుగునేలమీద ఈ గుర్తింపు పొందిన తొలి క్షేత్రం ఇదే. ఈ ఎనిమిదివందలేళ్ళనాటి ఆలయానికి ఈ విశేష గౌరవం దక్కిన తరువాత, గుజరాత్‌లోని ధోలవీరను కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్టు యునెస్కో మంగళవారం ప్రకటించింది. 


శిల్పిపేరుతో ఒక ఆలయం ఇంతటి ప్రాచుర్యం పొందడం ఆశ్చర్యకరమైన విషయం. అది ఒక అద్భుత కట్డడంగా వందల ఏళ్ళు నిలిచి వెలగడం వెనుక శిల్పుల దశాబ్దాల శ్రమ, కృషి కాదనలేనివి. దాదాపు నలభైయేళ్ళు ఈ ఆలయంకోసం శ్రమించి, శిలలను శిల్పాలుగా మలచి, కాకతీయ ప్రాభవానికి చెరగని సాక్ష్యంగా దానిని అద్భుతంగా మలిచారు వారు. గుడిలో ఉన్న దేవుడు లేదా దానిని కట్టించిన రాజుపేరుతో ప్రఖ్యాతిగాంచాల్సిన క్షేత్రం, ఆలయం అణువణువునూ అపురూపంగా మలచిన స్థపతి పేరుతో చిరస్థాయిగా నిలిచిపోయింది. కాకతీయ గణపతిదేవుని ఏలుబడిలో సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ అద్భుతకట్టడం కాకతీయుల శిల్పకళకు, కళాసౌందర్యానికి, ఇంజనీరింగ్‌ ప్రతిభకు నిదర్శనం. భక్తుల దృష్టిలో అది రుద్రేశ్వరాలయమైతే, కళాప్రియుల దృష్టిలో ఓ సౌందర్యశాల. నల్లని రాళ్ళపైన చెక్కిన స్త్రీమూర్తులు కన్నెదుట సజీవంగా నాట్యమాడుతుంటాయి. ఇన్ని వందలేళ్ళు గడిచినా ఇప్పుడే చెక్కినంత నునుపుగా ఉంటుంది ఆ మనోజ్ఞశిల్ప సంపద. ఆలయకుడ్యాలమీద ఉన్న పేరిణి నృత్యభంగిమలు నటరాజ రామకృష్ణకు ఒక నాట్యరీతిని పునరుద్ధరించేంత ప్రేరణనిచ్చాయి. ఎత్తుమడమల పాదరక్షలు, అల్లికల వస్త్రం వంటివి నాటి ఫ్యాషన్లను కళ్ళముందుంచుతాయి. శిల్పం, నాట్యం ఇత్యాది కళలకే కాదు, భవన నిర్మాణ విజ్ఞానశాస్త్రానికీ ప్రతీక ఈ కట్టడం. పదిహేను అడుగుల లోతున ఇసుకను నింపి, దానిపైన రాళ్ళను పునాదిగా నిలబెట్టి, మొత్తం ఆలయాన్ని కఠినమైన శిలలతో నిర్మిస్తే, అందుకు పూర్తి భిన్నంగా విమానగోపురాన్ని మాత్రం నీటిలో తేలే బోలు ఇటుకలతో నిర్మించడం కాకతీయ శిల్పులకు మాత్రమే సుసాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానం అది. పురాణ ఇతిహాసాలనూ, నృత్య, యుద్ధకళలనూ ఆవిష్కరిస్తూ ప్రతీ అంగుళాన్నీ కళాత్మకంగా, ప్రతీ శిల్పాన్నీ ప్రత్యేకంగా తీర్చిదిద్దుతూ నాటి సమాజ వికాసాన్నీ, మానవజీవితంలోని పార్శ్వాలనూ ఆవిష్కరించింది రామప్ప. అలయం కోసమే కాక, భావితరాలకు సంస్కృతీ సంప్రదాయాలను, చరిత్రను అందించే విజ్ఞాన భాండాగారంగా దీనిని తీర్చిదిద్దాలన్న నిర్మాతల లక్ష్యం విస్పష్టంగా కనిపిస్తుంది. మీటితే స్వరాలు, మూడురంగుల రాళ్ళు, వెంటాడే నంది చూపులు, సూర్యుడున్నంత సేపూ వెలిగే శివలింగం వంటి విశేషాలకు ఇక లోటే లేదు. ‘నేను ఎవరికైనా శత్రువును కావచ్చు, ఈ ఆలయం మాత్రం కాదు, దీనిని ధ్వంసం చేయవద్దు’ అని రేచర్ల రుద్రుడు శాసనంలో చేసిన అభ్యర్థనకు ప్రకృతి తోడుగా ఉన్నందునే, ఇన్ని వందలేళ్ళ తరువాత కూడా ఈ కట్టడం దృఢంగా నిలిచింది. 


వారసత్వ కట్టడాలను యునెస్కో ఇలా గుర్తించడం ఆరంభించిన ఐదేళ్ళకు మనం ఒప్పందంలో చేరితే, మరో ఆరేళ్ళకు అజంతా ఎల్లోరాతో ఆరంభమై, అనేక సాంస్కృతిక నిర్మాణాల చేరికతో, ఇప్పుడు రామప్ప, హరప్పా క్షేత్రాలతో కలసి ఆ సంఖ్య నలభైకు చేరింది. గత ఏడాదే ఈ తీపికబురు వినబడుతుందని ఆశించినా, కరోనా కారణంగా సమావేశం జరగక, ఈ ఏడాది చైనా వేదికగా ప్రపంచ వారసత్వ కమిటీ తన 44వ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించుకొని ఈ నిర్ణయాలను తీసుకుంది. ఈ కట్టడాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు ఆ పనిచేయకపోతే పదివేల జన్మలు పేడపురుగులుగా పుడతారని కూడా రామప్ప నిర్మాత రేచర్ల రుద్రుడు ఆ శాసనంలో శపించాడు. నిజాం నవాబు కాలం నుంచీ ఆలయ రక్షణ, పునరుద్ధరణలకు ప్రయత్నాలు జరిగినా అవి అవసరమైన స్థాయిలో లేవన్నది నిజం. యునెస్కో గుర్తింపు తరువాత ప్రపంచఖ్యాతితో పాటు సందర్శకుల రద్దీ కూడా పెరుగుతుంది. ప్రాచీన కట్టడాలకు గుర్తింపులు వచ్చినప్పుడు గర్వించడంతో పాటు, ఉన్నవాటిని కూల్చకపోవడం, మరింత గట్టిగా నిలబెట్టుకోవడం ఒక విలువగా, విధానంగా అమలు జరగడం అవసరం.

Updated Date - 2021-07-28T08:49:34+05:30 IST