భూమి బల్లపరుపుగా ఉందని నిరూపించాలనుకుని.. చివరకు క్వారంటైన్‌ సెంటర్లో..

ABN , First Publish Date - 2020-09-14T00:48:59+05:30 IST

భూమి ఎలా ఉంటుంది..? బల్లపరుపుగానా..? గోళాకారంలోనా..? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే మనమంతా ఠక్కున గోళాకారంగా అని చెప్పేస్తాం. కానీ ఇటలీలోని ఓ జంట మాత్రం భూమి బల్లపరుపుగా ఉందని బలంగా...

భూమి బల్లపరుపుగా ఉందని నిరూపించాలనుకుని.. చివరకు క్వారంటైన్‌ సెంటర్లో..

భూమి ఎలా ఉంటుంది..? బల్లపరుపుగానా..? గోళాకారంలోనా..? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే మనమంతా ఠక్కున గోళాకారంగా అని చెప్పేస్తాం. కానీ ఇటలీలోని ఓ జంట మాత్రం భూమి బల్లపరుపుగా ఉందని బలంగా నమ్మింది. ఎలాగైనా తమ వాదన నిజమని నిరూపించాలనుకుంది.అందు కోసం ప్రపంచం అంచును కనిపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో లంపేడుసా ఐలాండ్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అందుకోసం తమ కారును అమ్మేసి ఆ డబ్బుతో ఓ బోటును కోనుగోలు చేసింది. దాని సాయంతో సముద్ర ప్రయాణం ప్రారంభించింది. కానీ చిరవకు కరోనా ఐసోలేషన్‌ వార్డులో ఇరుక్కోవాల్సి  వచ్చింది. 


నాలుగు వందల ఏళ్ల క్రితం భూమి బల్లపరుపుగా ఉండేదని ప్రతి ఒక్కరూ నమ్మేవారని తెలుసా..? అవును అప్పట్లో ప్రతి ఒక్కరూ భూమి సమతలంగా ఉంటుందని, దాని అంచులకు వెళితే పడిపోతారని భయపడేవారు కూడా. ఆ.. అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు భూమి గోళాకారంగా ఉందని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.. అనుకుంటున్నారా.. అయితే మీ ఆలోచన తప్పు. సైన్స్‌, టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అలా నమ్మేవారు కొంత మంది ఉన్నారు. అలాంటి ఓ జంట ఇటలీలో ఉంది.


భూమి బల్లపరుపుగా ఉంటుందనే సిద్దాంతాన్ని నమ్మేవారు.. ప్రపంచం అంచు 'లంపేడుసా' ఐలాండ్‌ సమీపంలోనే ఉంటుందని నమ్ముతారు. ఈ ఐల్యాండ్‌ ఇటలీలోని సిసిలి ఐలాండ్‌కు, ఉత్తర ఆఫ్రికా మధ్యలో ఉంటుంది. మన ఇటలీ జంట కూడా ఆ ఐల్యాండ్‌కు వెళ్లేందుకే ప్రయాణమయ్యారు. అయితే సాధారణ దిక్సూచిని వినియోగించి ప్రయాణం మొదలెట్టడంతో సముద్రంలో కొంత దూరం వెళ్లిన తరువాత ఆ దిక్సూచీ పనిచేయలేదు. దీంతో సిసిలి సమీపంలోని ఉస్టికా ఐలాండ్‌ వద్ద వారిద్దరూ దారి తప్పారు. ఎటు చూసినా సముద్రం, చేతిలో పనిచేయని దిక్సూచీ, ఇక ఆ జంట కష్టాలు వర్ణనాతీతం. ఎటు వెళ్లాలో తెలియక ప్రాణాల మీద ఆశలు కూడా వదిలేసుకున్నారు వారిద్దరూ. అలాంటి తరుణంలో ఇటలీకి చెందిన ఓ నేవీ షిప్‌ అటుగా వెళుతోంది. అందులోని ఓ వైద్యుడు ఈ బోటును, అందులోని జంటను గుర్తించి కాపాడాడు.


బతుకు జీవుడా అంటూ ఆ జంట తీరానికి చేరారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో వారిని అధికారులు స్థానిక క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. కానీ వారిద్దరూ అక్కడి నుంచి పారిపోవాలని రెండు సార్లు ప్రయత్నించారు. అధికారులు పట్టుకుని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. దీంతో ప్రస్తుతం ఆ జంట రెండువారాల పాటు ఐసోలేషన్‌లో ఉండనుంది. ప్రస్తుతం ఈ ఇటలీ జంటకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ప్రపంచాన్నే తప్పని రుజువు చేయాలనుకుని చివరకు ఐసోలేషన్‌ వార్డుకు చేరుకున్నారంటూ నెటిజన్లు వారిపై జోకులు పేలుస్తున్నారు. నిజమే మరి సాహసంతో మొదలైన వారి ప్రయాణం ఆసుపత్రి బెడ్‌పైకి చేరింది. పాపం.

Updated Date - 2020-09-14T00:48:59+05:30 IST