కన్నీళ్లకే కన్నీరొచ్చె..

ABN , First Publish Date - 2021-06-20T07:04:49+05:30 IST

సాయిసత్య సహర్ష..

కన్నీళ్లకే కన్నీరొచ్చె..
బాలుడిని పరామర్శిస్తున్న ఎంపీ భరత్‌రామ్‌

కొవిడ్‌తో ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

ఒంటరిగా మిగిలిన 13 ఏళ్ల పిల్లవాడు


రాజానగరం(తూర్పు గోదావరి): సాయిసత్య సహర్ష.. 13ఏళ్ల కుర్రాడు.. ఇంత చిన్న వయసులో ఈ చిన్నారికి చాలా పెద్ద కష్టం వచ్చింది. అతడి కుటుంబంలో కరోనా పెనువిషాదం నింపింది. కన్న తల్లిదండ్రుతోపాటు అమ్మమ్మ, తాతయ్య, నానమన్మలను బలి తీసుకుంది. ఒకేసారి ఐదుగురు కుటుంబసభ్యుల్ని దూరం చేసి ఆ బాలుడిని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ బాలుడి కథ వింటే కన్నీరుమున్నీరు అవ్వనివారుండరు. అసలేం జరిగిందంటే...


రాజానగరం హైవే సమీపంలోని బ్రిడ్జి కౌంటీలోని ఓ విల్లాలో మేడిచర్ల వి.సుధీర్‌ రాయల్‌, శ్వేత హరిత నివాసముంటున్నారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు సాయి సత్య సహర్ష రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. సాఫీగా సాగిపోతున్న వీరి కుటుంబంపై కరోనా మహమ్మారి కాటు వేసింది. సెకండ్‌ వేవ్‌ రూపంలో తల్లిదండ్రులకి కరోనా సోకింది. దీంతో తండ్రి సుధీర్‌ రాయల్‌ రాయల్‌ను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతూ ఏప్రిల్‌ 24న మరణించాడు. అంతకుముందే కరోనా సోకిన బాలుడి తల్లి శ్వేత హరిత మే 9న తుదిశ్వాస విడిచింది. అప్పటికే బాలుడి నానమ్మ కూడా కరోనాతో మరణించింది. రాజోలులోని శివకోడులో ఉంటున్న అమ్మమ్మ, తాతయ్య కూడా కరోనా బారిన పడి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌తో పోరాడకలేక తనువు చాలించారు. ఇక ఆ బాలుడికి మామయ్య మాత్రమే మిగిలాడు. ఇంతకీ తన జీవితంలో ఇంత విషాదం జరిగిందన్న విషయం ఆ బాలుడికి ఇంకా తెలియదు. నేడో, రేపో ఈ విషయం బంధువుల మధ్య కూర్చోబెట్టి చెబుదామని మేనమామ ప్రయత్నిస్తున్నాడు.


ఎంపీ భరత్‌రామ్‌ పరామర్శ

బాలుడు సహర్షను ఎంపీ భరత్‌రామ్‌ శనివారం పరామర్శించారు. ఆ బాలుడి మేనమామ జరిగిన విషయమంతా ఆయనకు వివరించాడు. తన అక్క, బావలకు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా ఫలితం లేకపోయిందని, ఆస్పత్రి యాజమాన్యం రూ.28లక్షలు వైద్యఖర్చులు వసూలు చేసిందని ఎంపీ దృష్టికి తీసుకొచ్చాడు. ‘ఇద్దరికి రూ.28లక్షలా..’ అంటూ ఎంపీ సైతం ఆశ్చర్యపోయారు. ఒకే ఇంట్లో ఐదుగురు మరణించడం విచారకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరు అప్పు చేసి ఆస్పత్రికి సొమ్ములు కట్టినట్లు తనకు ఇప్పటివరకు తెలియదని, వాటిని తిరిగి ఇప్పించడంతోపాటు ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం మంజూరు చేయిస్తానని కూడా హామీ ఇచ్చారు. బాలుడికి కేంద్రీయ విద్యాలయంలో చేర్పిస్తానన్నారు. కాసేపు బాలుడితో ముచ్చటించగా అతడు క్రికెటర్‌ కావడం తన కల అని ఎంపీతో అన్నాడు.

Updated Date - 2021-06-20T07:04:49+05:30 IST