50శాతం Covid కేసులు ఐటీబీటీ ప్రాంతాల్లోనే..

ABN , First Publish Date - 2022-01-15T14:52:10+05:30 IST

బెంగళూరులో కొవిడ్‌ కేసులు పది రోజులలోనే బెంబేలెత్తిస్తున్నాయి. వైరస్‌ ప్రభావం రోజూ పెరుగుతుండటం అన్ని వర్గాల ప్రజలను కలవరపెడుతోంది. నగరవ్యాప్త కొవిడ్‌ కేసులలో 50 శాతం ఐటీబీటీ ప్రాంతాలలోనే నమోదవుతున్నట్లు అధికారు

50శాతం Covid కేసులు ఐటీబీటీ ప్రాంతాల్లోనే..

బెంగళూరు: బెంగళూరులో కొవిడ్‌ కేసులు పది రోజులలోనే బెంబేలెత్తిస్తున్నాయి. వైరస్‌ ప్రభావం రోజూ పెరుగుతుండటం అన్ని వర్గాల ప్రజలను కలవరపెడుతోంది. నగరవ్యాప్త కొవిడ్‌ కేసులలో 50 శాతం ఐటీబీటీ ప్రాంతాలలోనే నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు విభాగాల కంపెనీలు కలిగిన 8ప్రాంతాలలో వారం రోజుల వ్యవధిలో ఏకంగా 27వేల కేసులు నమోదయ్యాయి. మహదేవపుర, బొమ్మనహళ్ళితో పాటు తూర్పు ప్రాంతాలలోను కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇతర దేశాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడికి రావడమే కేసులు పెరిగేందుకు కారణమని గుర్తించారు. ఐటీబీటీ కంపెనీలు కలిగిన వార్డులను హైరిస్క్‌ వార్డులుగా గుర్తించారు. వాటిలో బెళ్ళందూరు, బేగూరు, తిప్పసంద్ర, హెచ్‌ ఎస్‌ఆర్‌ లేఅవుట్‌, హొరమావు, దొడ్డనెక్కుంది. కోరమంగల, శాంతలానగర, రాజ రాజేశ్వరీనగర్‌ ప్రాంతాలను గుర్తించారు. ఈవార్డులలో రోజూ వందలాది కేసులు నమోదవుతున్నాయి. సదరు ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పలుఐటీ కంపెనీలు అన్నీ ఉద్యోగులను నేరుగా ఆఫీసులకు వచ్చేలా ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ కొవిడ్‌ కేసులు తీవ్రమవుతున్న తరుణంలో అన్ని కంపెనీలు డోలాయమానంలో పడ్డాయి. కాగా కొన్ని కంపెనీలు ఇంకా వర్క్‌ ఫ్రం హోం ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ ప్రబలుతుండడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగిరం చేశారు. మరోవైపు 15-18ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్‌లతోపాటు అర్హులైనవారికి బూస్టర్‌ డోసును ఇస్తున్నారు. 

Updated Date - 2022-01-15T14:52:10+05:30 IST