కోవిడ్-19 నిరోధానికి అగ్నిమాపక దళం సేవలు : ఢిల్లీ ఎల్‌జీ

ABN , First Publish Date - 2020-04-01T22:28:15+05:30 IST

విడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అగ్నిమాపక దళం సేవలు ఉపయోగించుకోవాలని

కోవిడ్-19 నిరోధానికి అగ్నిమాపక దళం సేవలు : ఢిల్లీ ఎల్‌జీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అగ్నిమాపక దళం సేవలు ఉపయోగించుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఈ వైరస్ సోకడానికి అనువుగా ఉండే ప్రాంతాలు, ఇప్పటికే తీవ్రతగల ప్రదేశాలు, క్వారంటైన్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాలలో వైరస్ నిరోధక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. 


అనిల్ బైజాల్ ప్రతి రోజూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, కోవిడ్-19పై పోరాటానికి సన్నాహాలు, వైద్యపరంగా అవసరమైన పరికరాలు, ఇతర మందుల సేకరణ, మార్గదర్శకాల అమలు, ఐసొలేషన్, క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు. అష్ట దిగ్బంధనం అమలుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. 


కరోనా వైరస్ సోకడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు, క్వారంటైన్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి అగ్నిమాపక సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. అష్ట దిగ్బంధనాన్ని సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక దూరం, హోం క్వారంటైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 



Updated Date - 2020-04-01T22:28:15+05:30 IST