ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2021-04-27T06:35:59+05:30 IST

జిల్లాలో గత నెలాఖరు నుంచి రెండో దశ కరోనా ప్రభావం కనిపించగా ఈనెలలో ఉగ్రరూపం దాల్చింది.

ఉక్కిరిబిక్కిరి
దర్శిలోని సీహెచ్‌సీ వద్ద వ్యాక్సిన్‌ కోసం భౌతిక దూరం కూడా పాటించకుండా నిల్చొన్న ప్రజలు

జిల్లాలో కరోనా విలయతాండవం

వేలాదిగా కేసులు, వందల్లోనే మృతులు

చికిత్స అందక బాధితులు గగ్గోలు

టెస్టులు, వ్యాక్సిన్ల కోసం పరుగులు పెడుతున్న జనం

కొలిక్కి రాని కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు

నియంత్రణ చర్యల్లోనూ ఉదాసీనత

టెస్టుల ఫలితాల జాప్యంతో విస్తరిస్తున్న వైరస్‌

నేడు మంత్రి బాలినేని ప్రత్యేక సమీక్ష

 జిల్లాలో కరోనా రెండో దశ వేగంగా వ్యాపిస్తూ విలయతాండవం చేస్తోంది. వేలాది మందికి వైరస్‌ సోకుతుండగా  మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా వందల్లోనే ఉంటోంది.  కొవిడ్‌ బారిన పడిన వారు చికిత్స సక్రమంగా అందక అల్లాడిపోతున్నారు. తమకు కూడా వైరస్‌ వచ్చి ఉంటుందన్న ఆందోళన అత్యధికశాతం ప్రజల్లో కనిపిస్తోంది. దీంతో పరీక్షల కోసం, అలాగే  కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం పరుగులు తీస్తున్నారు. మరోవైపు కొవిడ్‌ టెస్టులు కూడా పరిమితంగా జరుగుతున్నారు. వాటి ఫలితాలు వెల్లడిలోనూ తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతోనే జిల్లావ్యాప్తంగా వైరస్‌ ఉధృతి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కరోనా నియంత్రణ చర్యలు, బాధితులకు మెరుగైన చికిత్స కోసం కొవిడ్‌ కేర్‌ కేంద్రాల ఏర్పాటు ఇలా అన్ని విషయాల్లోనూ గతేడాదితో పోల్చితే ప్రస్తుతం పూర్తి ఉదాసీనత అధికార యంత్రాంగం వైపు నుంచి కనిపిస్తోంది. దీంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

ఒంగోలు, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత నెలాఖరు నుంచి రెండో దశ కరోనా ప్రభావం కనిపించగా ఈనెలలో ఉగ్రరూపం దాల్చింది. వేలాది కేసులు నమోదయ్యాయి. గతేడాది మార్చిలో తొలికేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 69,513 పాజిటివ్‌లు నమోదు కాగా, ఈ ఒక్క నెలలోనే 6,298 కేసులు నమోదయ్యాయి. అందులో గత పది రోజులకుపైగా నిత్యం వందల సంఖ్యలోనే కేసులు వస్తున్నాయి. తాజాగా సోమవారం కూడా జిల్లాలో 522 కేసులు నమోదయ్యాయి. ఈనెలలో అత్యధికంగా ఒంగోలు నగరంలోనే 1,716 పాజిటివ్‌లు వచ్చాయి. మార్కాపురం, చీరాల, కందుకూరు, కనిగిరి, అద్దంకి వంటి పట్టణాలతోపాటు పలు ఇతర మండలాల్లోనూ భారీగానే కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో పెద్దసంఖ్యలోనే మృత్యువాత పడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే కరోనా జిల్లాలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 615 మంది మరణించగా, ఈ నెలలోనే వారిలో దాదాపు 35మంది వరకు ఉన్నారు. అయితే అధికారిక లెక్కల్లోకి రాని, అలాగే ఇతర ప్రాంతాల్లో చికిత్స చేయించు కుంటూ మృతిచెందిన జిల్లా వాసులు ఈనెలలో ఇప్పటి వరకు దాదాపు 200మంది వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కరోనా ఉధృతితో వేల కేసులు నమోదవుతుండగా ఆ స్థాయిలో చికిత్స అందించే పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. 


దొరకని బెడ్లు

జిల్లాలో ప్రస్తుతం 4,869 యాక్టివ్‌ కేసులు ఉండగా వారిలో 3,487మంది ఇంటి వద్ద నుంచే చికిత్స పొందుతున్నారు. 1,382 మంది ఆస్పత్రిలో ఉండి వైద్యం చేయించుకుంటున్నట్లు అధికారిక సమాచా రాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఇంకా ఎక్కువ మందికి  ఆస్పత్రిలో చికిత్సలు అవసరమైనప్పటికీ ఒంగోలులోని రిమ్స్‌తోపాటు జిల్లాలో అనుమతి ఉన్న కరోనా చికిత్స చేసే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. వారంరోజులుగా కరోనా బాధితులు బెడ్ల కోసం ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గతం కన్నా వైరస్‌ తీవ్రత అధికంగా ఉంటుండటంతో ఆక్సిజన్‌ ఎక్కువ మంది రోగులకు అవసరం అవుతుండగా సకాలంలో దొరక్క అల్లాడిపోతున్నారు. పలురకాల మందుల పరిస్థితి కూడా అదేవిధంగా కనిపిస్తోంది. మరోవైపు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ స్థాయిలో టెస్టులు గతంలో వలే జరగడం లేదు. దీంతో వేలాదిమంది అందుబాటులో ఉన్న ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి టెస్టులు చేయించుకుంటుండగా వారిని ప్రైవేటు ల్యాబ్‌లు నిలువుదోపిడీ చేస్తున్నారు. 


వ్యాక్సిన్‌ కోసం బారులు

తొలుత వ్యాక్సిన్‌పై విముఖత చూపిన జనం ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తితో అప్రమత్తమై టీకా కోసం వస్తుండగా వారికి  అందించే పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఎక్కడచూసినా కరోనా టెస్టుల కోసం, వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు జనం పరుగులు తీస్తుండటం కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి గతంలో వలే కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంలో కొంత అప్రమత్తత యంత్రాంగం నుంచి కనిపించింది. ప్రస్తుతం వారంరోజుల నుంచి ఆ ప్రయత్నంలో అధికారులు ఉన్నప్పటికి సరైన వసతులు ఉన్న భవనాలు దొరకడం లేదు. గతంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈ తరహా సెంటర్లను ఏర్పాటుచేయగా, ప్రస్తుతం వాటిల్లో తరగతులు జరుగుతుండటంతో వీలు కాక కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఎక్కడ ఏర్పాటు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


పరీక్షలు ఆలస్యమే..

జిల్లాలో వైరస్‌ వ్యాప్తికి ప్రధానంగా టెస్టులు అధికంగా చేయకపోవడం కన్నా చేసిన వారి ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం జరగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పాజిటివ్‌ కేసులు వచ్చిన అనేకమందికి వారి శాంపిల్స్‌ తీసిన తర్వాత వారంరోజుల వరకు కూడా ఫలితం తెలియడం లేదు. ఉదాహరణకు ఆది, సోమవారాల్లో అధికారులు ప్రకటించిన పాజిటివ్‌ కేసుల జాబితాలో ఈనెల 17 నుంచి 19 వరకు సేకరించిన శాంపిల్స్‌ వారు కూడా ఉన్నారు. తమకు పాజిటివ్‌ ఉన్న సంగతి తెలియని వారు జనంలో తిరుగుతుండ టంతో మరింతగా వ్యాప్తి చెందుతోంది. 


నియంత్రణ అంతంతమాత్రమే..

అలాగే గతంలో వలే ఈసారి జన నియంత్రణ కూడా ఇంతవరకూ సక్రమంగా చేసిన దాఖలాలు లేవు. జిల్లావ్యాప్తంగా పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ సకాలంలో తగు నిర్ణయం తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు తగుచొరవ తీసుకోలేదు. నాలుగైదు  రోజులుగా కొన్నిప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు అమలవుతుండగా అత్యధిక ప్రాంతాల్లో సాధారణంగానే కనిపిస్తోంది. ఫలితంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు మెరుగైన చికిత్స తదితర అంశాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. కీలక అధికారులు, ముఖ్యమైన ప్రజాప్రతినిఽధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని జిల్లా ప్రజలను కరోనా బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 




Updated Date - 2021-04-27T06:35:59+05:30 IST