మంత్రులు, కలెక్టర్‌ సాక్షిగా... కొవిడ్‌ నిబంధనలకు పాతర!

ABN , First Publish Date - 2020-11-21T05:57:34+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి మరోమారు విజృంభించే అవకాశం వుందని, సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వుండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాయి.

మంత్రులు, కలెక్టర్‌ సాక్షిగా...  కొవిడ్‌ నిబంధనలకు పాతర!
బీచ్‌రోడ్డులో ర్యాలీ

విశాఖ బీచ్‌ రోడ్డులోవేలాది మందితో ఓ ప్రైవేటు సంస్థ బైక్‌ ర్యాలీ

పాల్గొన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ 

ఉచిత హెల్మెట్‌ల కోసంద్విచక్ర వాహన చోదకుల తోపులాట


బీచ్‌ రోడ్డు నవంబరు 20: కొవిడ్‌ మహమ్మారి మరోమారు విజృంభించే అవకాశం వుందని, సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వుండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా పంజా విసరడంతో లాక్‌డౌన్‌ విధించే దిశగా అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. ఇక రాష్ట్రంలో కొవిడ్‌ ఇంకా అదుపులోకి రాలేదని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల ప్రాణాలకే ప్రమాదమని సీఎం జగన్‌ వద్ద నుంచి మంత్రుల వరకు చెబుతున్నారు. ఈ తరుణంలో ప్రజలకు జాగ్రత్తలు సూచించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా ఉన్నతాధి కారులు కూడా కొవిడ్‌ నిబంధనలకు పక్కాగా పాతరేశారు. 


అతివేగంతో అనర్థాలు సంభవిస్తాయని, హెల్మెట్‌ ధరించాలని...ప్రచారం చేసేందుకు విశాఖపట్నం సాగరతీరంలో శుక్రవారం ఓ సంస్థ చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీలో కొవిడ్‌ నిబంధనలకు నీళ్లొదిలేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, ఇతర అధికారులు పాల్గొన్న ఈ ర్యాలీలో ఆసాంతం కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. వేదికపై ప్రసంగించిన నేతల్లో చాలామంది కనీసం మాస్కు కూడా ధరించలేదు. ఈ సందర్భంగా చేపట్టిన హెల్మెట్‌ల పంపిణీ కుమ్ములాటలకు దారితీసింది. ఉచితంగా హెల్మెట్‌ లభిస్తుండడంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ప్రభుత్వ యంత్రాంగమే దగ్గరుండి మరీ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ర్యాలీలను నిర్వహించడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా హెల్మెట్‌ తప్పనిసరని, శబ్ద కాలుష్యాన్ని నివారించాలని నినదిస్తూ సాగిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్న వారిలో అధికశాతం మంది హెల్మెట్‌లు ధరించలేదు. హారన్లు మోగిస్తూ, బిగ్గరగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం విశేషం.


శ్రీహర్ష ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో...

వేగం వద్దు...నిదానమే ముద్దు...ఈవ్‌ టీజింగ్‌ నేరమని నినదిస్తూ బీచ్‌రోడ్డు కాళీమాత గుడి నుంచి రుషికొండ బీచ్‌ వరకు శుక్రవారం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. శ్రీహర్ష ఫౌండేషన్‌ నిర్వహకురాలు హిమబిందు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్‌ ధరించాలని, ఈవ్‌ టీజింగ్‌ నేరమని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు అలీ,  తనీష్‌, దీక్ష, అషురెడ్డి, ఇండియన్‌ ఐడిల్‌ విన్నర్‌ రేవంత్‌, తదితరులు పాల్గొన్నారు. 


బీచ్‌రోడ్డులో సబ్‌లీజులతో లింకు

బీచ్‌రోడ్డులో జీవీఎంసీ పలు షాపులను లీజుకు వచ్చింది. వాటిని సినిమా రంగానికి చెందిన కొందరు సబ్‌లీజుకు తీసుకొని భాగస్వాములతో కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జీవీఎంసీ అధికారులు సబ్‌లీజుల్లో వున్న షాపులు అన్నింటికీ నోటీసులు ఇచ్చారు. వాటిని ఖాళీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా వుండేందుకే ఈ ర్యాలీ ఏర్పాటుచేశారని, విజయసాయిరెడ్డిని ముఖ్య అతిథిగా పిలిచారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 


Updated Date - 2020-11-21T05:57:34+05:30 IST