మూడో అలపై సర్వం సన్నద్ధం

ABN , First Publish Date - 2021-08-04T15:51:18+05:30 IST

ముప్పిరిగొలుపు తున్న కరోనా మూడో అలను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ‘వార్‌ రూం’ ఏర్పాటు

మూడో అలపై సర్వం సన్నద్ధం

            - నగరంలో ‘పోలీస్‌ వార్‌ రూం’ ఏర్పాటు


చెన్నై: ముప్పిరిగొలుపుతున్న కరోనా మూడో అలను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ‘వార్‌ రూం’ ఏర్పాటు చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని పోలీసు, వైద్య, రెవెన్యూ శాఖలను అప్రమత్తం చేసింది. కరోనా రెండో అల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌ అందక వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం.. ఎక్కడికక్కడ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ రేయింబవళ్లు అధికారులతో చర్చించారు. అనంతరం కరోనా నియంత్రణలోకి రావడం, మృతుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ నేఫథ్యంలో, కరోనా రెండో అల కన్నా మూడవ అల తీవ్రంగా ఉంటుందని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశ ముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో అలను ఎదుర్కొనేలా రాష్ట్రప్రభుత్వాలు సిద్ధం కావాలని కేంద్రం సూచించింది. దీంతో, ఇప్పటికే సీఎం స్టాలిన్‌ కరోనా వ్యాప్తిని అడ్డుకొనేలా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆస్పత్రుల్లో పడకల పెంపు, వైద్య ఉపకరణాలు, మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు నిల్వ వంటి చర్యలు చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలల్లో కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే, కరోనా టీకాలు వేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో, కరోనా మూడవ అలను ఎదుర్కొనేలా చెన్నై నగర పోలీసు శాఖ వార్‌ రూం ఏర్పాటుచేసింది. అదనపు కమిషనర్‌ కన్నన్‌ నేతృత్వంలో బృందం ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తోంది. ఒక వ్యక్తి కరోనా లక్షణాలు నిర్ధారణ అయితే, అతనితో సంబంధాలున్న వారిని గుర్తించడం, కరోనా పరీక్షలు చేయడం, వారిని క్వారంటైన్‌లో ఉంచడం తదితరాలను ఈ వార్‌ రూం పర్యవేక్షిస్తుంది. అంతేగాక నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికిప్పుడు ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన చర్యలపై తగిన ఆదేశాలు సైతం ఇక్కడి నుంచే జారీ కానున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-08-04T15:51:18+05:30 IST