సాఫీగా టీకా

ABN , First Publish Date - 2021-01-17T06:15:34+05:30 IST

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగా సాగింది. ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది.

సాఫీగా టీకా

తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 253 మందికి వ్యాక్సిన్‌

నల్లగొండలో ప్రారంభించిన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

సూర్యాపేటలో మంత్రి జగదీ్‌షరెడ్డి, యాదాద్రిలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగా సాగింది. ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో మూడు చొప్పున మొత్తం తొమ్మిది కేంద్రాల్లో ఎంపిక చేసిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ ఇచ్చారు. మొత్తం 270 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉండగా, పలు కారణాలతో 17 మంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 90 మందికిగాను 83 మందికి, సూర్యాపేట జిల్లాలో 90 మందికి గాను 80, యాదాద్రి జిల్లాలో 90 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. టీకా అనంతరం వారిని గంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ కనిపించకపోవడంతో ఇళ్లకు పంపించారు. 


శాస్త్రవేత్తలు, వైద్యులకు అభినందనలు

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ అర్బన్‌, మిర్యాలగూడ అర్బన్‌, జనవరి 16: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు, వైద్యులు, విపత్కర పరిస్థితుల్లో సమన్వయం పాటించిన ప్రజలకు అభినందనలు అని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటగా వ్యాక్సిన్‌ను తెలంగాణలో కనుక్కోవడం అభినందించదగ్గ విషయమన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో కలిసి పనిచేసి వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని టీవీలో వీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ ఏవీ.రంగనాథ్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రతీమాసింగ్‌, డీఎంహెచ్‌వో కొండల్‌రావు, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింహ, డీఐవో వేణుగోపాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రారంభించారు. మునిసిపల్‌ చైర్మన్‌ భార్గవ్‌, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి మాతృనాయక్‌ పాల్గొన్నారు.


ప్రతి ఒక్కరూ సహకరించాలి : మంత్రి 

సూర్యాపేటటౌన్‌, హుజూర్‌నగర్‌: కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, రాజీవ్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. కరోనా టీకా కారణంగా వ్యాధి నిరోధక శక్తి 70 శాతానికిపైగా పెరుగుతుందన్నారు. ఈ నెల 31న జిల్లాలో మొత్తం 31 కేంద్రాల్లో 6479 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికయుగేందర్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, డీఎంహెచ్‌వో కర్పూరపు హర్షవర్దన్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఆర్డీవో వెంకారెడ్డి, డీఎంహెచ్‌వో నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో తొలిటీకాను ఆస్పత్రి పారిశుధ్య కార్మికుడు కోటికి ఇచ్చారు.


ఐక్యతతో విజయవంతం చేయాలి : విప్‌

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి)/బీబీనగర్‌, చౌటుప్పల్‌: కరోనా నివారణకు ప్రజలు చూపిన ఐక్యతను టీకాల కార్యక్రమం విజయవంతంలోనూ చూపాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి కోరారు. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీకా తీసుకున్నామని నిర్లక్ష్యంగా ఉం డకుండా, మాస్క్‌ ధరించడంతోపాటు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, భువనగిరిలో తొలి టీకాలను నర్సు శోభారాణికి వైద్యాధికారి డాక్టర్‌ మురళీ మోహన్‌కు ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాంబశివరావు, ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిప్రకాశ్‌, అర్బన్‌ మెడికల్‌ ఆఫిసర్‌ డాక్టర్‌ లీలావతి, జిల్లా టీకాల అధికారి డాక్టర్‌ పరిపూర్ణాచారి, గ్రంథాలయ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, బీబీనగర్‌ మండలం కొండమడుగు పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ను కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, డీఎంహెచ్‌వో సాంబ శివరావు ప్రారంభించారు. చౌటుప్పల్‌లో అదనపు కలెక్టర్‌ ఖిమ్యానాయక్‌, మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డిరాజు ప్రారంభించారు. చౌటుప్పల్‌లో తొలి టీకాను నర్స్‌ శశిళకు, కొండమడుగులో స్టాఫ్‌నర్స్‌ సుజాతకు ఇచ్చారు. టీకా పంపిణీని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పరిశీలించారు. కార్యక్రమంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. 


సంతోషంగా ఉంది : మద్దు ముక్కంటి, నల్లగొండ

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం సంతోషంగా ఉంది. వ్యాక్సిన్‌ గురించి ఎవరూ భయపడవద్దు. నేను ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్‌ తీసుకున్నా. నాకు అక్టోబరులో కరోనా పాజిటివ్‌ వచ్చింది. మందులు వాడాక తగ్గింది. అప్పుడే అనుకున్నా వ్యాక్సిన్‌ రాగానే ముందు వరుసలో ఉండి వ్యాక్సిన్‌ తీసుకోవాలని అనుకున్నా.


గర్వంగా ఉంది : డాక్టర్‌ మురళీమోహన్‌, భువనగిరి అర్బన్‌ సబ్‌సెంటర్‌ వైద్యాధికారి

కరోనా వ్యాక్సిన్‌ను జిల్లాలో తీసుకున్న తొలివ్యక్తిని కావడం గర్వంగా ఉంది. టీకాపై అనుమానాలు, అపోహలు వద్దు. అది చెప్పేందుకే తొలిటీకా తీసుకోవడం సంతోషంగా ఉంది. టీకా తర్వాత ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లేదు. టీకా వేసుకున్నట్టుగానే లేదు. భయాందోళన లేకుండా అంతా టీకా వేసుకోవాలి.


అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది : బురుగు సుజాత, ఏఎన్‌ఎం, బీబీనగర్‌ మండలం 

కరోనా తొలి టీకా వేసుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఎప్పటిలాగే సాధారణంగా ఉంది. ప్రజలు కూడా భయపడకుండా టీకా తీసుకోవాలి. అనంతరం తగిన జాగ్రత్తలు పాటించాలి.  

Updated Date - 2021-01-17T06:15:34+05:30 IST