జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-17T06:04:44+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ శనివారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. తొలిరోజు 32 కేంద్రాల్లో 3,174 మంది ఆరోగ్య సిబ్బంది, వైద్యులకుగాను 2,066 మంది (65.09 శాతం) టీకా వేయించుకున్నారు.

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం
చినవాల్తేరు ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్‌కు టీకా వేస్తున్న దృశ్యం. పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

తొలిరోజు 32 కేంద్రాల్లో 2,066 మందికి వ్యాక్సిన్‌ 

టీకా వేసుకున్న వారిలో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌, పలువురు వైద్యాధికారులు

తొలిరోజు ఎటువంటి సమస్యా తలెత్తకపోవడంతో ఊపిరిపీల్చుకున్న యంత్రాంగం

మొదటిరోజు 65.09ు శాతం

ఏజెన్సీలో ముందుకురాని కొందరు వర్కర్లు

వద్దంటూ కొందరు లేఖలు


విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):


కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ శనివారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. తొలిరోజు 32 కేంద్రాల్లో 3,174 మంది ఆరోగ్య సిబ్బంది, వైద్యులకుగాను 2,066 మంది (65.09 శాతం) టీకా వేయించుకున్నారు. మిగతా 1,108 మంది వివిధ కారణాలతో టీకాకు దూరంగా ఉన్నారు. ఉదయం భారత ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారుల సమక్షంలో నగరంలోని చినవాల్తేరులో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్‌ సాయిలక్ష్మికి తొలి టీకా ఇచ్చారు. ఇదే సమయంలో మిగిలిన 31 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. ప్రతిచోట టీకా తీసుకున్న వారిని అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కాగా సిబ్బందితోపాటు సాధారణ ప్రజానీకంలో ధైర్యం నింపేందుకు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌, పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కృష్ణారావు, పాడేరు ఐటీడీఏ అదనపు జిల్లా వైద్యాధికారి తదితరులు తొలిరోజు టీకా వేయించుకున్నారు. 


తొలిరోజు 65.09ు శాతం


జిల్లాలో కొవిడ్‌-19 టీకాను తొలిరోజు 65.09 శాతం మంది వేయించుకున్నారు. తొలి విడతలో 32 కేంద్రాల ద్వారా 36,694 మందికి కొవిషీల్డ్‌ టీకా ఇవ్వాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రోజైన శనివారం 3,174 మందికి ఏర్పాట్లు చేసింది. రాత్రి ఎనిమిది గంటలకు అందిన సమాచారం ప్రకారం 2,066 మందికి టీకా వేశారు. ఏజెన్సీలో చాలామంది టీకా వేయించుకోవడానికి వెనకడుగు వేశారు. టీకా వేసుకుంటే ఇబ్బందులు వస్తాయనే అపోహలతో కొందరు ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నారు. అలాగే బాలింతలు, గర్భిణులు, జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు కూడా టీకా తీసుకోలేదు. అరకు, పాడేరు, పెదబయలు, చింతపల్లి వంటి కేంద్రాల్లో బాగా తక్కువ మంది హాజరయ్యారు. అరకులోయలో 168 మందికి గాను 69 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. చింతపల్లిలో సుమారు 30 మంది పేర్లు రిపీట్‌ అయ్యాయి. పాడేరులో 200 మందికి కేవలం 54 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. మైదాన ప్రాంతాలకు వచ్చేసరికి విస్తృత ప్రచారం, అవగాహన కారణంగా కార్యక్రమం చాలాచోట్ల 90 నుంచి 100 శాతం విజయవంతమైంది. నర్సీపట్నం కేంద్రంలో శతశాతం టీకా తీసుకున్నారు. నక్కపల్లిలో 100కి 99 మంది, మాడుగులలో 100 మందికి 98 మంది వేయించుకున్నారు. చోడవరంలో 100 మందికి ఏర్పాట్లు చేయగా 81 మంది ముందుకు వచ్చారు. 12 మంది గైర్హాజరు కాగా ఏడుగురు తమకు టీకాలు వద్దని లేఖలు సమర్పించారు. రావికమతం మండలం కొత్తకోటలో కూడా ఆరుగురు టీకాలు వద్దని లేఖలు ఇచ్చారు. నగరంలోని శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రి కేంద్రంలో 100 మందికి 35 మంది మాత్రమే తీసుకున్నారు. మల్కాపురం సీఎం ఆరోగ్య కేంద్రంలో 75 మందికిగాను 41 మందికి టీకా ఇచ్చారు. 


ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం


జిల్లాలో శనివారం టీకా తీసుకున్న 2,066 మందిలో ఎటువంటి సమస్యలు కనిపించకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. తొలిరోజు ఏదైనా ఇబ్బంది వస్తే తరువాత రోజుల్లో టీకా తీసుకునేందుకు చాలామంది వెనుకంజ వేసే ప్రమాదం వుందని అధికారులు భావించారు.


ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు


వ్యాక్సినేషన్‌ ప్రారంభ కార్యక్రమానికి నగరంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జేసీ అరుణ్‌బాబు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సూర్యనారాయణ, రూరల్‌ ప్రాంతంలోని కొయ్యూరులో అరకులోయ ఎంపీ జి.మాధవి, మాడుగులలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, పాడేరులో ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, అచ్యుతాపురంలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలలో ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ, ఉమాశంకర్‌ గణేష్‌, పరవాడలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు, మల్కాపురంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, అల్లిపురంలో దక్షిణ ఎమ్మెల్యే గణేష్‌కుమార్‌ హాజరయ్యారు. 


ఎక్కడా రియాక్షన్‌ లేదు

సూర్యనారాయణ, డీఎంహెచ్‌ఓ


జిల్లాలో మొదటిరోజు 2,066 మంది కొవిడ్‌-19 టీకా తీసుకోగా ఎవరికీ రియాక్షన్‌ రాలేదు.  ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. ఈ కార్యక్రమం 20వ తేదీ వరకు కొనసాగుతుంది.  


చీమకుట్టినట్టుగా కూడా లేదు 

పీవీ సుధాకర్‌, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌


తొలిరోజు టీకా తీసుకున్నాను. చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఏదైనా టీకా తీసుకుంటే చిన్నపాటి నొప్పి ఉంటుంది. అటువంటిది ఏమీ లేదు. టీకా తీసుకున్న తరువాత అరగంటపాటు గదిలో ఉంచుతారు. అందువల్ల ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. ఎవరికైనా జ్వరం వచ్చినా, నొప్పి కలిగినా గాభరాపడాల్సిన పనిలేదు. రెండో డోసు తీసుకున్న తరువాత శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం మొదలవుతుంది. టీకా ఇచ్చేముందు అలర్జీ, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోవడం జరుగుతుంది.

Updated Date - 2021-01-17T06:04:44+05:30 IST