గోశాలలో మృత్యుఘోష

ABN , First Publish Date - 2021-08-17T16:52:37+05:30 IST

సింహాచలం దేవస్థానానికి చెందిన..

గోశాలలో మృత్యుఘోష

మరో ఐదు లేగ దూడలు మృతి

అయినా కదలని అధికారులు

మిగిలిన దూడలకు వైద్య పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం


సింహాచలం(విశాఖపట్నం): సింహాచలం దేవస్థానానికి చెందిన పాత గోశాలలో మృత్యు ఘోష వినిపిస్తోంది. ఇక్కడ ఆదివారం ఐదు లేగ దూడలు మృతిచెందగా, సోమవారం మరో ఐదు చనిపోయాయి. అయినప్పటికీ వైద్యులచే పరీక్షలు చేయించడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. వివరాలిలా ఉన్నాయి.


సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన భక్తులు మొక్కుబడులుగా గోసంతతిని కానుకగా సమర్పిస్తుంటారు. ఆ విధంగా ఏడాదికి సుమారు 12 వేల నుంచి 15 వేల వరకు వస్తుంటాయి. అప్పన్నకు సమర్పించిన గోసంతతిని 2010 వరకు ఏడాదికొకమారు బహిరంగ వేలం ద్వారా విక్రయించేవారు. ఆ విధంగా దేవస్థానానికి లక్షలాది రూపాయల ఆదాయం వస్తుండేది. అయితే వేలం ద్వారా దక్కించుకున్నవారు గోవులను, దూడలను కబేళాలకు తరలిస్తున్నారంటూ హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ క్రమంలో 2013 వేసవిలో వందలాది గోవులు మృత్యువాత పడ్డాయి.


దీంతో జిల్లా కలెక్టర్‌, దేవదాయ శాఖ అధికారులు, పశు సంవర్థక శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి గోసంతతిని ఉచితంగా రైతులకు (పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉండాలి, గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి) పంపిణీ చేస్తూ వచ్చారు. అయితే కొందరు స్వార్థపరులు రైతుల ముసుగులో దూడలను చేజిక్కించుకుని వాటిని కబేళాలకు తరలించడం ప్రారంభించారు. ఇలా గత నెల మూడో వారంలో కబేళాకు వ్యాన్‌లలో దూడలను తరలిస్తుండగా హిందూ సంఘాల ప్రతినిధులు పట్టుకున్నారు. దాంతో అప్పటి నుంచి భక్తులు సమర్పించిన దూడల పంపిణీని దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం దేవస్థానం పాత గోశాలలో విదేశీ జాతులకు చెందిన బక్కచిక్కిన దూడలు సుమారు 400 వరకు ఉన్నాయి. స్థలాభావం, వాటికి చాలినంత దాణా పెట్టకపోవడం, ఒకదాని నుంచి వేరొకదానికి వ్యాధులు వ్యాపించడం తదితర కారణాల వల్ల మృత్యువాత పడుతున్నాయి.


మన్యంలోని అరకు, అనంతగిరి ప్రాంతాలకు చెందిన గిరిజన రైతులకు సుమారు 100 దూడలను సోమవారం దత్తత ఇచ్చినట్టు అధికారులు ప్రకటించారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే అర్హులైన రైతులకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. విదేశీ సంకర జాతి గోసంతతిని స్వీకరించబోమని, స్వదేశీ జాతికి చెందిన వాటిని మాత్రమే మొక్కుబడుల కింద సమర్పించాలని అధికారులు ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నారు. ఈ విషయంలో భక్తులకు అవగాహన కలిపించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు. ఇదిలావుండగా దూడల మృతి వ్యవహారంపై దేవస్థానం ఈఓ మంగళవారం మీడియాతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

Updated Date - 2021-08-17T16:52:37+05:30 IST