సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా ఉండేందుకే ఈ-రక్షాబంధన్‌

ABN , First Publish Date - 2020-08-04T10:13:33+05:30 IST

నిత్యం ఇంటర్నెట్‌ను వినియోగించే మహిళలు, విద్యార్థినులు సైబర్‌ నేరాలు, మోసాలకు గురికాకుండా అవగాహన ..

సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా ఉండేందుకే ఈ-రక్షాబంధన్‌

సీపీ ఆర్కే మీనా


విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): నిత్యం ఇంటర్నెట్‌ను వినియోగించే మహిళలు, విద్యార్థినులు సైబర్‌ నేరాలు, మోసాలకు గురికాకుండా అవగాహన పెంపొందించేందుకే ముఖ్యమంత్రి జగన్‌ ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సీపీ ఆర్కే మీనా పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, సీఐడీ సంయుక్తంగా రూపొందించిన ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని సోమవారం వెలగపూడిలో సీఎం ప్రారంభించిన సందర్భంగా సీటీ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొంతమంది కాలేజీ విద్యార్థినులను ఆహ్వానించి, వారందరికీ ఈ-రక్షాబంధన్‌ లక్ష్యం, 31వ తేదీ వరకూ చేపట్టే కార్యక్రమాలను వివరించారు.


ఇప్పటివరకూ నమోదైన కేసులు, భవిష్యత్తులో నేరాలు జరిగేందుకు ఆస్కా రం ఉన్న అంశాలను గుర్తించి అధికారులు కొన్ని వీడియోలను రూపొందించారని, నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీటికి జత చేస్తూ రోజూ ఉదయం 11 గంటల నుంచి వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తారన్నారు. సీఐడీ అధికారులిచ్చే లింక్‌లను ఏ రోజుకా రోజు  ఏయూ, గీతం వర్సిటీల వీసీలతో పాటు వివిధ కళాశాలల నిర్వాహకులకు పంపిస్తామని... వారు ఆ లింకులను తమ విద్యార్థుల మొబైళ్లకు పంపిస్తారని సీపీ వివ రించారు. అనంతరం విద్యార్థినులు సీపీ మీనా, డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగీలకు రాఖీలు కట్టారు. 

Updated Date - 2020-08-04T10:13:33+05:30 IST