Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీబీఐ ప్రతిష్టను దిగజారుస్తున్నారు: సీపీఐ నారాయణ

విజయవాడ: సీబీఐ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. సుప్రీం కోర్టు సీజే సీబీఐ పట్ల వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అమరావతి రాజధాని రైతుల పోరాట దీక్ష 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులు చేపట్టిన నిరసన ర్యాలీకి నారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేశారు. కావాల్సిన వాళ్లకు బెయిల్, వాయిదాలు ఇచ్చేలా సీబీఐ వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఇజ్రాయెల్ నుంచి పెగసస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ప్రజాప్రతినిధులపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఇజ్రాయెల్ ఒప్పందం బయట పడేసరికి.. అదంతా బీజేపీపై జరుగుతున్న కుట్ర అని బుకాయిస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని చెప్పి.. ఏకపక్షంగా ఆమోదించుకున్నారని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ బెయిల్ పై డ్రామా నడుస్తోందని.. తమ ప్రభుత్వాన్ని పడేయడానికి కుట్ర జరుగుతోందని ఆ పార్టీ మంత్రులు అంటున్నారని, అయితే వైసీపీ ప్రభుత్వం పడిపోయేందుకు ఆ పార్టీ మంత్రులే కారణమవుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. 134 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరరాజా కంపెనీ సూట్ కేస్ కంపెనీ కాదని.. ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. విజయవాడలో సీపీఐ కౌన్సిల్ మీటింగ్  నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

రైతుల ర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గం : సీపీఐ రామకృష్ణ

అమరావతి రైతుల ర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి కోసం భూములిచ్చిన రైతులు 600 రోజులుగా సుదీర్ఘ ఉద్యమం  చేస్తున్నారన్నారు. 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు నిరసన ర్యాలీ చేపడితే.. దాన్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగానే కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు ఒప్పుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. నేడు మాట మార్చారని విమర్శించారు. మరోవైపు కేంద్రం దృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అమరావతిపై కేంద్రం స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు టిడ్కో గృహాలను తక్షణమే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 


Advertisement
Advertisement