Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా కంటే ప్రమాదకరమైన బీజేపీ

సీపీఎం తూర్పు కృష్ణాజిల్లా మహాసభల్లో నాయకులు

హనుమాన్‌ జంక్షన్‌, నవంబరు 28 : భారత రాజ్యాంగ మూలాలను సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్న నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా  కంటే ప్రమాదకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీపీఎం తూర్పు కృష్ణాజిల్లా మహాసభలు ఆదివారం హనుమాన్‌ జంక్షన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మతోన్మాద వైరస్‌ భారతదేశానికి అంటుతుందని  సీపీఎం ముందే చెప్పిందన్నారు. అపర కుబేరులైన అదానీ, అంబానీలకు పట్టంకట్టి దేశంలోని రైతాంగ, కార్మిక, ఉద్యోగ వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి  కేంద్రం సిద్ధపడుతోందన్నారు. భూగర్భ గనుల నుంచి రైలు, రోడ్డు మార్గాలను సైతం కార్పొరేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడానికి చూస్తోందని చెప్పారు. టోల్‌ఫీజు పేరుతో త్వరలో ద్విచక్ర వాహనాలపై భారం మోపేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి పెట్రోల్‌ రేటు రూ.200కు చేరుతుందని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోక్సో కంపెనీకి కట్టబెట్టడానికి పూనుకుంటే, దానికి వ్యతిరేకంగా నిలబడింది ఒక్క సీపీఎం మాత్రమేనన్నారు. రైతుల పోరాట ఫలితంగానే మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. అలాంటి పోరాటాలు విశాఖ ఉక్కు విషయంలో కూడా జరగాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సీపీఎం బాపులపాడు మండల కార్యదర్శి బేత శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వై.నరసింహారావు, కళ్లం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యురాలు ఎం.జయమ్మ పాల్గొన్నారు. తొలుత నూజివీడులోని శ్రీనివాస కల్యాణ మండపం నుంచి బహిరంగ సభా వేదిక వరకు భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు, పాటలు ఆకట్టుకున్నాయి. 

Advertisement
Advertisement