‘సంక్షేమ పథకం సమాచారం కావాలంటే రూ.17 లక్షలు చెల్లించండి’

ABN , First Publish Date - 2021-04-12T00:39:09+05:30 IST

ఓ సంక్షేమ పథకం అమలులో పారదర్శకత గురించి అడిగిన సమాచార

‘సంక్షేమ పథకం సమాచారం కావాలంటే రూ.17 లక్షలు చెల్లించండి’

రాయ్‌పూర్ : ఓ సంక్షేమ పథకం అమలులో పారదర్శకత గురించి అడిగిన సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తుదారుకు గట్టి షాక్ తగిలింది. ఆ సమాచారం కావాలంటే రూ.17.20 లక్షలు చెల్లించాలని ఛత్తీస్‌గఢ్ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (సీఆర్ఈడీఏ) ఆయనను కోరింది. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016లో ఛత్తీస్‌గఢ్‌లో సౌర సుజల యోజనను ప్రారంభించారు. రైతులకు రాయితీ ధరలపై సోలార్ పవర్డ్ ఇరిగేషన్ పంపులను అందజేయడం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలు కోసం అనుసరించిన ప్రక్రియను తెలియజేయాలని సమాచార హక్కు దరఖాస్తుదారు ఉచిత్ శర్మ సీఆర్ఈడీఏను కోరారు. ఈ సమాచారం కోసం రూ.17.20 లక్షలు చెల్లించాలని సీఆర్ఈడీఏ కోరడంతో ఉచిత్ శర్మ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సొమ్ము కోసం తనకు పరిచయమున్నవారిని సంప్రదిస్తున్నారు. 

ఉచిత్ శర్మ మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యవస్థ కార్యకలాపాల్లో పారదర్శకత గురించి తెలుసుకోవడానికి, సమాచారం పొందడానికి భారీ మొత్తంలో సొమ్మును చెల్లించవలసిరావడం తనను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని చెప్పారు. 

సీఆర్ఈడీఏ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అభిషేక్ శుక్లా మాట్లాడుతూ, ఉచిత్ శర్మ కోరిన సమాచారం చాలా విస్తృతమైనదని తెలిపారు. వేర్వేరు కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సమీకరించవలసి ఉందని చెప్పారు. ఒక పంపునకు సంబంధించిన సమాచారం 22 పేజీల్లో ఉంటుందని, అటువంటి పంపులను దాదాపు 40 వేల వరకు పంపిణీ చేశామని చెప్పారు. రూ.17.20 లక్షలు చెల్లించిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని వేర్వేరు కార్యాలయాల నుంచి సమీకరిస్తామని చెప్పారు. 


Updated Date - 2021-04-12T00:39:09+05:30 IST