ఉగాండ వ్యాపారి కిడ్నాప్‌నకు యత్నం

ABN , First Publish Date - 2021-05-08T05:12:28+05:30 IST

ఉగాండ వ్యాపారిని మోసం చేయడమే కాకుండా అతడ్ని కిడ్నాప్‌ చేసి డబ్బుల కోసం బెదిరించి హత్యకు కుట్ర పన్నిన ఇద్దరిపై కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉగాండ వ్యాపారి కిడ్నాప్‌నకు యత్నం

బంజారాహిల్స్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): ఉగాండ వ్యాపారిని మోసం చేయడమే కాకుండా అతడ్ని కిడ్నాప్‌ చేసి డబ్బుల కోసం బెదిరించి హత్యకు కుట్ర పన్నిన ఇద్దరిపై కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీకి చెందిన శ్రీరాంశెట్టి శ్రవణ్‌కుమార్‌ ఉగాండలో వ్యాపారి. 2014లో ఆయన ఉగాండలో ఉండగా విశాఖపట్నంకు చెందిన గోల్లపల్లి నాగమోహన్‌తో పరిచయం ఏర్పడింది. నాగమోహన్‌ ఉగాండలో ఓ హోటల్‌ నిర్వహిస్తున్నాడు. శ్రవణ్‌కుమార్‌ అదే హోటల్‌లో దిగారు. కొద్ది రోజులకు చెన్నైకి చెందిన స్వామియంతన్‌ కళ్యాణ రమన్‌ కూడా వీరికి తోడయ్యాడు. ముగ్గురూ కలిసి కోకో ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట వ్యాపారం మొదలుపెట్టారు. కొద్ది కాలానికి శ్రవణ్‌కుమార్‌ తన కుమార్తె వివాహం చేసేందుకు నగరానికి వచ్చాడు. సంబంధం కుదిరాక భార్య సాహిత్యను రమ్మని చెప్పాడు. కానీ శ్రవణ్‌ ఇండియాకు వెళ్లడం నాగమోహన్‌, కల్యాణ్‌కు ఇష్టం లేదు. ఎలాగైనా శ్రవణ్‌ వద్ద ఉన్న డబ్బు కాజేయాలని భావించారు. ఈ మేరకు ఉగాండలో సాహిత్యను ఇండియాకు రాకుండా ఆపేసి శ్రవణ్‌కు ఫోన్‌ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చేసేది లేక శ్రవణ్‌కుమార్‌ బంధువుల వద్ద రూ.కోటి అప్పుగా తీసుకొని నాగమోహన్‌ ఖాతాలో జమచేశాడు. అనంతరం ఉగాండకు వెళ్లి భార్యను నగరానికి తీసుకువచ్చాడు. వ్యాపారం తాలూకు ఇంకా డబ్బులు రావాల్సి ఉందని నాగమోహన్‌, కళ్యాణ్‌ ఫోన్‌ చేయడం మొదలుపెట్టారు. శ్రవణ్‌ వద్ద ఉగాండలో పనిచేసే వారిని వేధింపులకు గురిచేసి పారిపోయేలా చేశారు. కంపెనీకి చెందిన ఈమెయిల్స్‌ శ్రవణ్‌కు రాకుండా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాగమోహన్‌ వ్యాపార లావాదేవీ విషయంలో మాట్లాడుకునేందుకు శ్రవణ్‌కు ఫోన్‌ చేసి ఫిలింనగర్‌ క్లబ్‌కు రావాలని సూచించారు. శ్రవణ్‌ అక్కడకు వెళ్లాక నాగమోహన్‌ మరికొందరు కిరాయి గూండాలు పదునైన ఆయుధాలతో శ్రవణ్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతోపాటు 2.9 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. లేదంటే చంపేస్తామని హెచ్చరించారు. బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నాగమోహన్‌, కల్యాణ్‌పై ఐపీసీ 307,323,374,471,506,447, రెడ్‌విత్‌ 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-05-08T05:12:28+05:30 IST