కొత్తింట్లో విషాదం

ABN , First Publish Date - 2020-12-01T06:18:24+05:30 IST

ఎంతో ఆనందంగా నూతన గృహ ప్రవేశం చేసిన ఆ దంపతులకు 24 గంటలు తిరక్కుండానే పుత్రశోకం కలిగి అంతులేని ఆవేదన మిగిల్చింది. అంతకుముందు రోజు వరకూ బంధువులు, స్నేహితులతో కళకళలాడిన ఆ ఇల్లు... చిన్నారి మృతితో శోకసంద్రమైంది.

కొత్తింట్లో విషాదం

నీటి గుంతలో పడి చిన్నారి మృతి

24 గంటలు తిరక్కుండానే ఆవిరైన 

గృహ ప్రవేశ ఆనందం 

ధర్మవరంరూరల్‌, నవంబరు 30: ఎంతో ఆనందంగా నూతన గృహ ప్రవేశం చేసిన ఆ దంపతులకు 24 గంటలు తిరక్కుండానే పుత్రశోకం కలిగి అంతులేని ఆవేదన మిగిల్చింది. అంతకుముందు రోజు వరకూ బంధువులు, స్నేహితులతో కళకళలాడిన ఆ ఇల్లు... చిన్నారి మృతితో శోకసంద్రమైంది. నీటి గుం తలో పడి ఆ ఇంటి దీపం ఆరిపోవడంతో ఆ తల్లిదండ్రులను ఓ దార్చడం ఎవరి తరమూ కాలేదు. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న పొదరింట్లో చేరిన మరుసటి రోజే బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు వేదన వర్ణనాతీతం. నీటి గుంతలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మండలంలోని ఓబుళనాయునిపల్లిలో జరిగింది. గ్రా మానికి చెందిన మల్లికార్జున, నందిని దంపతులకు మణికంఠ అనే నాలుగేళ్ల ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. కూలీ చేసుకుని పోగుచేసిన సొమ్ముతో ఈ మధ్యనే ఓ ఇంటిని కట్టుకున్నారు. ఆదివారం బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో గృహప్రవేశం చేశారు. సోమవారం ఉదయం చిన్నారి మణికంఠ ఆడుకుంటూ ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న నీటి గుంతలో   ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో చిన్నారి అలానే నీ ళ్లలో ఉండిపోయాడు. కొద్ది సేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో అటూ ఇటూ వెదికారు.  నీటి తొట్టెలో బాలుడు పడి ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ చిన్నారిని తీసుకుని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి త రలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నా రి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు.  రూరల్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరీశీలించారు.

Updated Date - 2020-12-01T06:18:24+05:30 IST