కోర్టులో వివాదాన్ని దాచి పెట్టి స్థలాన్ని అంటగట్టారు

ABN , First Publish Date - 2021-01-21T07:15:44+05:30 IST

స్థలంపై కోర్టులో ఉన్న వివాదాన్ని దాచి పెట్టి తమకు అంటగట్టారని హోటల్‌ లీలా వెంచర్స్‌ లిమిటెడ్‌పై బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది.

కోర్టులో వివాదాన్ని దాచి పెట్టి స్థలాన్ని అంటగట్టారు

హోటల్‌ లీలా వెంచర్స్‌పై చీటింగ్‌ కేసు
బంజారాహిల్స్‌,జనవరి20 (ఆంధ్రజ్యోతి):
స్థలంపై కోర్టులో ఉన్న వివాదాన్ని దాచి పెట్టి  తమకు అంటగట్టారని హోటల్‌ లీలా వెంచర్స్‌ లిమిటెడ్‌పై బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌కు చెందిన పీబీ స్యాంప్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యాపార విస్తరణ కోసం 2014లో హోటల్‌ లీలా వెంచర్స్‌ లిమిటెడ్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10లో ఉన్న 3.28 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 15.5 కోట్ల రూపాయలు లీలా వెంచర్స్‌కు అందజేశారు. ఇందులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని కంపెనీ భావించింది. అయితే కొద్ది రోజుల తరువాత  ఈ స్థలం పై సుప్రీంకోర్టులో వివాదం ఉన్నట్టు పీబీ స్యాంప్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు తెలిసింది. తమకు తెలియకుండా లీలా వెంచర్స్‌ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌తో అడ్డదారిలో డెవల్‌పమెంట్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ విషయంపై పీబీ స్యాంప్‌ ప్రాజెక్ట్స్‌ నిర్వాహకులు లీలా వెంచర్స్‌ సీఎండీ వివేక్‌నాయర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ వారు సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు వివాదం దాచి పెట్టడమే కాకుండా తమకు అమ్మిన స్థలాన్ని అక్రమ మార్గంలో డెవల్‌పమెంట్‌కు ఇచ్చి మోసం చేశారని పేర్కొంటూ పీబీ స్యాంప్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లీలా వెంచర్స్‌ సీఎండీ వివేక్‌ నాయర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-21T07:15:44+05:30 IST